logo

హోప్‌ ఐలాండ్‌ అభివృద్ధికి ప్రణాళిక

కాకినాడ నగరానికి రక్షణ కవచంలా నిలిచే తాళ్లరేవు మండల పరిధిలోని హోప్‌ ఐలాండ్‌ ప్రాంతాన్ని పర్యాటక శాఖ అధికారుల బృందం శనివారం సందర్శించింది.

Published : 04 Jun 2023 05:28 IST

హోప్‌ ఐలాండ్‌లో శిథిలమైన షెడ్డును పరిశీలిస్తున్న పర్యాటకశాఖ బృందం

ఈనాడు, కాకినాడ: కాకినాడ నగరానికి రక్షణ కవచంలా నిలిచే తాళ్లరేవు మండల పరిధిలోని హోప్‌ ఐలాండ్‌ ప్రాంతాన్ని పర్యాటక శాఖ అధికారుల బృందం శనివారం సందర్శించింది. కలెక్టర్‌ కృతికాశుక్లా ఆదేశాల మేరకు అక్కడి తాజా పరిస్థితి.. చక్కదిద్దాల్సిన చర్యలను గుర్తించేందుకు బృందం బోటులో అక్కడికి వెళ్లింది. జిల్లా పర్యాటక శాఖ అధికారి పసుపులేటి పోశయ్య, కార్యనిర్వాహక ఇంజినీరు రాజారావు, వాటర్‌ ఫీట్‌ మేనేజర్‌ గంగబాబు, ఏఈ వెంకటేష్‌, ఎల్‌డీసీ వీరేంద్రనాయుడు, ఏపీవో త్రిమూర్తులు, వెంకటరామిరెడ్డి తదితరులు హోప్‌ ఐలాండ్‌ను సందర్శించారు. కచ్చులూరు వద్ద గోదావరిలో పాపికొండలు పర్యాటక బోటు మునిగి 51 మంది జల సమాధి అయిన సంఘటన నాటి నుంచి హోప్‌ ఐలాండ్‌ పర్యాటక ప్రయాణం స్తంభించిన విషయం తెలిసిందే. దీంతో గతంలో పర్యాటకులు సేదతీరేందుకు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పగోడాలు, తాటిచెట్టు బోదెలతో నిర్మించిన పాకలు, ఇతర వసతులు శిథిల దశకు చేరుకున్నాయి. పైకప్పులు దెబ్బతిని చిల్లులు పడ్డాయి. అక్కడ ప్లాస్టిక్‌ ఇతర వ్యర్థాలు, చిల్లచెట్లు పెద్ద ఎత్తున పేరుకుపోయాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో కమ్యూనిటీ బేస్డ్‌ ఎకో టూరిజంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దాలన్న ప్రతిపాదన నేపథ్యంలో.. పర్యావరణానికి విఘాతం కలగకుండా పర్యాటకులకు అనువైన ఏర్పాట్లు ఏమేం చేయవచ్చో బృందం గుర్తించింది. ఇక్కడి ఆహ్లాదకర పరిస్థితులు... పర్యాటకుల తాకిడికి అనువుగా చేయాల్సిన ఏర్పాట్లపై కలెక్టర్‌కు నివేదిక అందించనున్నట్లు జిల్లా పర్యాటక అధికారి పోశయ్య తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని