logo

ధర బాగుంది... దిగుబడి లేకుంది

కోనసీమ రైతులను అంతరపంటలు ఆదుకుంటాయనుకుంటే అవి కాస్తా...అక్కరకు రావటంలేదు. కొబ్బరిధరలు పతనమైనప్పుడు అంతర పంటల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చనేది రైతుల ఆశ.

Published : 07 Jun 2023 05:20 IST

పక్వానికి వచ్చిన కోకోకాయల చెట్టు

న్యూస్‌టుడే, అంబాజీపేట: కోనసీమ రైతులను అంతరపంటలు ఆదుకుంటాయనుకుంటే అవి కాస్తా...అక్కరకు రావటంలేదు. కొబ్బరిధరలు పతనమైనప్పుడు అంతర పంటల ద్వారా ఆదాయం ఆర్జించవచ్చనేది రైతుల ఆశ. అందుకే కొబ్బరితోటల్లో అంతరపంటగా కోకో సాగు చేస్తుంటారు. ప్రస్తుతం కోకో ధర ఆశాజనకంగానే ఉంది. దానికి తగ్గట్లు దిగుబడులు లేవు. దీంతో అంతరపంటగా కోకో సాగుచేసిన కర్షకులు కలత చెందుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో కొబ్బరితోటల్లో అంతర పంటగా కోకోపంటను 1,229.9 హెక్టార్లలో సాగు చేస్తున్నారు. దీని ద్వారా 491.9 మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తి అవుతోంది. జిల్లాలోని అన్ని మండలాల్లో కొబ్బరి తోటల్లో కోకోపంటను అంతరపంటగా సాగు చేస్తున్నారు.

ఇదీ లెక్క...

ఎకరానికి 250 మొక్కలు నాటిన కోకో తోట నుంచి 300-400 కిలోల గింజల దిగుబడి రావాలి. ప్రస్తుతం ఎకరాకు 150 కిలోలు  మాత్రమే దిగుబడి వస్తోంది. 10 ఎకరాలు కోకో పంటను సాగుచేస్తున్న రైతుకు ఏడాదికి రూ.5 లక్షలు సాగు వ్యయం అవుతుంది. ఈ 10 ఎకరాల నుంచి 4 టన్నులు అంటే 4,000 కిలోల కోకో గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. ఈ 4,000 కిలోలకు కిలో రూ.220 చొప్పున లెక్కకట్టినా రూ.8,80,000 ఆదాయం వస్తుంది. ఇందులో రూ.అయిదు లక్షలు ఖర్చుపోను రూ.3.80 లక్షలు ఆదాయం వస్తుంది. అందుకు అన్నిరకాల  పరిస్థితులు అనుకూలించాలి.


10 ఎకరాలు సాగు చేశా..
- కొప్పిశెట్టి ఆనంద వెంకట ప్రసాద్‌, శ్రీవ్యాఘ్రేశ్వర ఐక్యరైతు సంఘం అధ్యక్షుడు, గొల్లగుంట

దిగుబడులు బాగుండి. ధర ఆశాజనకంగా ఉంటేనే కోకోరైతుకు రాబడి వస్తుంది. నేను పదెకరాలు సాగు చేశా. ధర గతంకంటే ఆధికంగా ఉంది. ఇదే సమయంలో దిగుబడులు మాత్రం సన్నగిల్లాయి. కోకో సాగుకు కూలీల సమస్య వేధిస్తోంది. రూ.700 చెల్లించినా కూలీలు రావటం లేదు. ఉపాధి హామీ పథకాన్ని కోకోపంటకు అనుసంధానం చేసేలా చర్యలు తీసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని