logo

కలెక్టర్‌ చెప్పినా ఖాతరు లేదు!

రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం..

Published : 28 Mar 2024 03:25 IST

ఇదీ జలవనరులశాఖ అధికారుల తీరు
సాగునీరు అందక అన్నదాత ఆవేదన

గ్రాంటులో బీటలు తీసిన పొలాలను చూపుతున్న కౌలురైతులు

న్యూస్‌టుడే, తాళ్లరేవు: రూ.వేలకు వేలు పెట్టుబడులు పెట్టాం.. చుక్క నీరు లేదు.. చావే శరణ్యం.. కష్టకాలంలో ఉన్నాం ఆదుకోండి మహా ప్రభో అంటూ కార్యాలయాల చుట్టూ తిరిగాం.. అధికారులకు వేదన వినిపించాం.. పట్టించుకునేవారే లేరని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జలవనరుల శాఖ అధికారుల తీరుపై కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి.మల్లవరం పంచాయతీ పరిధిలోని గ్రాంటు, చినతిప్ప ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రాంటు పరిధిలోని రాజుల బోది, పెదమడి, 7, 8 తూముల సమీపంలోని 200 ఎకరాలకు చుక్కనీరు అందక వరి పొలాలు బీటలు తీశాయి. ఎకరానికి రూ.30 నుంచి 40 వేలు వరకు పెట్టుబడి పెట్టామని.. పొట్ట, ఈనిక దశలో ఉన్న చేలకు నీరందక చీడ, పీడలతో దెబ్బతింటున్నాయన్నారు. ఏటా సాగునీటి ఇబ్బందులతో పంట దిగుబడి తగ్గి నష్టపోతున్నామన్నారు. ప్రస్తుతానికి తాళ్లరేవు మండలం పత్తిగొంది నుంచి గ్రాంటు వరకు ప్రధాన పంట కాలువలో చుక్కనీరు లేదు. సమస్యను అధిగమించే పరిస్థితి కానరాకపోవడంతో రైతులంతా మంగళవారం కాకినాడ వెళ్లి జిల్లా కలెక్టర్‌ కృతికాశుక్లాకు వినవించుకున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు గ్రాంటులోని వరి పొలాలకు నీరు చేరుతుందని జలవనరుల శాఖ ఎస్‌ఈ, ఈఈ వారికి హామీ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారుల కోసం రైతులు ఎదురు చూసి నిరాశ చెందారు. జిల్లా కలెక్టర్‌ ఆదేశాలను జలవనరుల శాఖ అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా ఉన్న ఒఎన్జీసీ పైపులైన్‌ పంట పొలాల మీదుగా వెళుతోందని.. పంట చేతికి వచ్చే వరకు ఈ పైపులైన్‌ ద్వారా పొలాలకు సాగునీరు అందించేలా సంబంధిత అధికారులు చొరవ చూపాలని కోరుతున్నారు. విషయాన్ని ఈఈ వద్ద ప్రస్తావించగా.. ఇతరత్రా విధులతో ఉన్నతాధికారులు బుధవారం పరిశీలించలేకపోయారని, గురువారం వెళ్లి పరిస్థితి సమీక్షిస్తామన్నారు.


చేను చూస్తే చావాలనిపిస్తోంది..
- గుత్తుల కృష్ణ, కౌలు రైతు

గ్రాంటు ఆయకట్టు చినతిప్ప బోదికి సాగునీరు ఇచ్చి 40 రోజులయింది. ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి పెట్టా. బుధవారం ఉదయానికి నీరు అందిస్తామని జల వనరుల శాఖ అధికారులు చెప్పినా మధ్యాహ్నం మూడు గంటలైనా పొలాల వద్దకు ఎవరూ రాలేదు. చేను పరిస్థితి చూస్తుంటే ఏదైనా తాగి చావాలనిపిస్తోంది.


ఏటా ఇదే పరిస్థితి..
- వాసంశెట్టి నాగేశ్వరరావు, కౌలు రైతు

ఏటా పంట ఆఖరి దశలో సాగునీరు అందక పొలాలు బీళ్లుగా మారుతున్నాయి. పొట్ట, ఈనిక దశలో పుష్కలంగా నీరు అందక చీడ పీడల బారినపడి దిగుబడి తగ్గిపోతోంది. చేసిన అప్పులు తీర్చలేని పరిస్థితి ఎదురవుతోంది. నష్టపోయిన ప్రతి ఎకరానికి బీమా పరిహారం అందజేస్తేనే మాకు మేలు జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని