logo

ఓరి దేవుడా.. వీళ్లు మారరా..?

రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష..  దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ

Updated : 28 Mar 2024 05:09 IST

వైకాపా జమానాలో ఆలయాలు, అర్చకులపై దాడులు
ఈనాడు, కాకినాడ

విచారణ సందర్భంగా అర్చకుడి గాయాన్ని పరిశీలిస్తున్న దేవాదాయశాఖ ఆర్జేసీ విజయరాజు

రెండు చేతులు ఎత్తి భక్తితో మొక్కాల్సిన దేవుడిపైనా ఎందుకో కక్ష..  దైవ సన్నిధిలో భక్తితో మెలగాలన్న కనీస విజ్ఞత మరచి భక్తుల ఎదుటే బూతు పురాణం.. అర్చకులపై దాడి.. గడచిన అయిదేళ్లలో వరస సంఘటనలు ప్రభుత్వ వైఫల్యాన్ని, శాంతిభద్రతల పర్యవేక్షణ లోపాన్ని తేటతెల్లంచేస్తున్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. దేవతా విగ్రహాలు, ఆస్తుల ధ్వంసం.. దాడులు వంటి సంఘటనలు ఎక్కువవ్వడంపై ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. మనోభావాలు దెబ్బతిని భక్తులు, ఆధ్యాత్మిక సంఘాలు ఆందోళనకు దిగుతుంటే పిచ్చోళ్ల పననో.. వయసు మీరి చేశారనో సమస్య తీవ్రతను తగ్గించిచూపే ప్రయత్నాలు జరుగుతుండడం విమర్శలకు తావిస్తోంది.


మ్మడి జిల్లాలో వివిధ మతాలకు చెందిన 9,296 ప్రార్థన మందిరాలున్నాయి. గతంలో 306 ప్రాంగణాల్లో కేవలం 914 సీసీ కెమెరాలు మాత్రమే ఉంటే.. వరుస ఘటనల నేపథ్యంలో పోలీసుశాఖ అప్రమత్తమై 1,977 ప్రాంగణాల్లో 4,781 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించింది. కాకినాడలో వైకాపా నాయకుడు దాడి వ్యవహారంలో అక్కడి సీసీ కెమెరా పనిచేయడం లేదన్న వాదన క్షేత్రస్థాయిలో డొల్లతనాన్ని చెబుతోంది.  నిఘా మరింత కట్టుదిట్టం చేయాల్సిన పరిస్థితులు సూచిస్తోంది.

వరుస ఘటనలతో ఉక్కిరిబిక్కిరి..

సర్పవరంలో విగ్రహాల తయారీ కేంద్రంలో 20 దుర్గామాత విగ్రహాలను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసంచేసిన 2019లో చోటుచేసుకుంది.తర్వాత తాళ్లరేవు మండలం లచ్చిపాలెంలో ఆంజనేయస్వామి విగ్రహం గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం విమర్శలకు తావిచ్చింది. 2021 నవంబరు 25న రంగంపేట మండలం ఒడిశలేరులో రామాయంలో విగ్రహాలు అపహరణకు గురయ్యాయి. 2020 సెప్టెంబరు 23న మండపేటలో మేరీమాత, జీసస్‌ విగ్రహాలు ధ్వంసం చేసిన అంశంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. సామర్లకోటకు చెందిన ప్రవీణ్‌చక్రవర్తి అనే వ్యక్తి పలుచోట్ల విగ్రహాలు ధ్వంసం చేశానని యూట్యూబ్‌లో చేసిన వ్యాఖ్యలు గతంలో పెద్ద దుమారమే రేపాయి. ఇలా పలుచోట్ల ఘటనలు పోలీసులను ఉక్కిరిబిక్కిరి చేశాయి. తాజాగా అర్చకుడిపై దాడి రాజకీయ దుమారం రేపింది. పలు కేసుల్లో సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా చర్యలు తీసుకున్నా.. కొన్నిచోట్ల కెమెరాలు పనిచేయడం లేదన్న వాదన దర్యాప్తుకు కొన్నికేసుల్లో అడ్డంకిగా మారుతోంది.

దేవతా విగ్రహాల ధ్వంసం ఘటనపై పిఠాపురంలో ప్రదర్శన (పాత చిత్రం)


2020 జనవరి 25

పిఠాపురంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి కోర్టు వరకు ఉన్న పలు ఆలయాల్లో ఎనిమిది విగ్రహాలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తంచేసి ఆందోళనకు దిగారు. విధ్వంసానికి మతిస్థితిమితం లేని వ్యక్తి కారణమని తేల్చడంపైనా అప్పట్లో ఆక్షేపణలు వ్యక్తమయ్యాయి.


2021 సెప్టెంబరు 6

అంతర్వేది లక్ష్మీనరసింహ స్వామి దివ్యరథం అగ్నికి ఆహుతి అయ్యింది.. ఇది ప్రమాదవశాత్తూ జరిగిందా..? ఎవరైనా ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టారా..? అన్నదానిపై నేటికీ స్పష్టత రాలేదు. పార్టీలు, ఆధ్యాత్మిక సంస్థలు, సంఘాలు ఆందోళనలు ఉద్ధృతం చేయడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు అప్పట్లో ప్రభుత్వం ప్రకటించింది. ఘటన జరిగి రెండున్నరేళ్లు దాటినా ఉలుకూపలుకూ లేదు.


తాజాగా..

కాకినాడకు చెందిన వైకాపా నాయకుడు చంద్రరావు నగరంలోని పెద్ద శివాలయంలో ఇద్దరు అర్చకులపై దుర్భాషలాడుతూ దాడికి దిగిన వ్యవహారం రాష్ట్రవ్యాప్త చర్చనీయాంశం అయ్యింది. హిందూ ధార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు, పార్టీలు దాడి ఘటనపై ఆక్షేపణ వ్యక్తంచేశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని