logo

ప్రచారం.. కావాలి పర్యావరణ హితం

రాష్ట్రంలో  ప్లాస్టిక్‌ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది.

Published : 29 Mar 2024 03:08 IST

అమలాపురం పురపాలికలో వ్యర్థాలు

అమలాపురం కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో  ప్లాస్టిక్‌ నిషేధం అమల్లో ఉన్నా.. అది దస్త్రాలకే పరిమితమవుతోంది. ప్లాస్టిక్‌ బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధిస్తామని వైకాపా ప్రభుత్వం గొప్పలుచెప్పి మాటలతో సరిపెట్టింది. దాంతో ఎటుచూసినా ప్లాస్టిక్‌ వ్యర్థాలే.

ఎన్నికల సమయంలో మరీ ఎక్కువ..

కేంద్ర ఎన్నికల సంఘం ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా కాగితం, వస్త్రంతో తయారు చేసిన సామగ్రిని వినియోగించాలని రాజకీయ పార్టీలకు ఇదివరకే సూచన చేసింది. పర్యావరణహితంగా వివిధ దేశాల్లో రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి. మనలోనూ ఆ చైతన్యం రావాల్సిన అవసరం ఎంతైనాఉంది. ఎన్నికల సమయంలో పార్టీల జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలు నిషేధిత, ప్రకృతికి హానికరమైన ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వస్తువులతో తయారు చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం ముగిసిన తరువాత వీటిని ఎక్కడపడితే అక్కడే వదిలేస్తున్నారు. దీంతో ఇవి నిర్వీర్యం కాకుండా భూసమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.

వీరిని స్ఫూర్తిగా తీసుకుందాం

  • మానవాభివృద్ధి సూచికలో మొదటి స్థానంలో ఉన్న నార్వేలో రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం ఖర్చు చాలా తక్కువ. ర్యాలీలతో ప్రజల్ని కలిసి దేశానికి ఏం చేస్తారో చెబుతారు. బహిరంగ సభల్లో ఫ్లెక్సీలు, బ్యానర్లు ఉండవు.
  • అమెరికా ఎన్నికల్లో ఈ-మెయిల్స్‌ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తారు. పత్రికలు, రేడియో, టెలివిజన్‌ ద్వారా ప్రచారం, ప్రజలతో ముఖాముఖి ఉంటాయి. 
  • ఆస్ట్రేలియాలో ఓటరు చైతన్య కార్యక్రమాలు కాగితాల్లోనే ఉంటాయి. ః జర్మనీలో ఇంటింటికీ ప్రచారంతోపాటు సోషల్‌ మీడియాను ప్రచార అస్త్రంగా వినియోగించుకుంటారు. ఫ్లెక్సీలు ఎక్కడా ఉండవు.

భూతాపానికి కారకాలు..

భూతాపానికి నిషేధిత ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వస్తువులు కూడా కారణం అవుతున్నాయి. సాధారణ వేడి కంటే ఎక్కువ డిగ్రీల సెల్సియస్‌లలో ఉష్ట్రోగ్రతల నమోదుకు ఫ్లెక్సీలు, బ్యానర్లు, ప్లాస్టిక్‌ జెండాలు కారణమవుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గతంలో ఇలా..

గత 2004 ఎన్నికల ముందు రాజకీయ పార్టీలు తమ ప్రచారానికి కాగితం, వస్త్రంతో తయారు చేసిన సామగ్రి వినియోగించేవి. 2004 తర్వాత ఎన్నికల ప్రచారంలో వాడేవాటిలో జెండాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లన్నీ కృత్రిమంగా తయారైనవి ఉంటున్నాయి. విష రసాయనాల ప్రభావం నేరుగా ప్రజలపై పడుతోంది. ఎన్నికల సమయంలో జెండాలు, బ్యానర్లు, ఫ్లెక్సీలను వేల మెట్రిక్‌ టన్నుల్లో ముద్రిస్తున్నారు. ఇవి పర్యావరణానికి తీవ్ర హాని చేకూర్చేవే.

టన్నులకొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు

జిల్లాలో మూడు పురపాలికలు, ఒక నగర పంచాయతీ, 385 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 25 లక్షల మంది జనాభా నిత్యం ఏదో ఒక ప్లాస్టిక్‌, పాలిథిన్‌ వస్తువులు వాడుతుండడంతో జిల్లాలో గృహాలు, వాణిజ్య సముదాయాలు, పరిశ్రమల నుంచి రోజుకు 1,000 మెట్రిక్‌ టన్నుల వ్యర్థాలు వస్తున్నాయి. వాటిలో 40 నుంచి 45శాతం ప్లాస్టిక్‌వేఉంటున్నాయి. నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువుల తయారీ, అమ్మకంపై అధికారుల నిఘా లేక బహిరంగ మార్కెట్లో నిషేధిత ప్లాస్టిక్‌ వస్తువులు విచ్చలవిడిగా లభిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని