logo

పనిచేయని ఏసీలు, ఫ్యాన్లు.. సూపర్‌ఫాస్ట్‌ రైలులో ప్రయాణికుల ఉక్కిరిబిక్కిరి!

షాలిమార్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వారాంతపు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.

Updated : 29 Mar 2024 08:22 IST

రాజమహేంద్రవరంలో 5:30 గంటలు నిలిపివేత
అసౌకర్యంపై ప్రయాణికుల ఆందోళన

స్టేషన్‌ మాస్టర్‌ కార్యాలయం వద్ద సిబ్బందిని నిలదీస్తున్న ప్రయాణికులు

రాజమహేంద్రవరం(వి.ఎల్‌.పురం), న్యూస్‌టుడే: షాలిమార్‌ నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే వారాంతపు సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు(22849)లో సాంకేతిక సమస్య తలెత్తి అందులోని ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. సమస్యను పరిష్కరిస్తామని రైలును ఏకంగా 5:30 గంటలపాటు నిలిపివేయడంతో అంతసేపు బోగీల్లో కూర్చోలేక ఇబ్బందిపడ్డారు. చివరికి ఆందోళన చేసి, రైల్వే సిబ్బందిని నిలదీస్తే తాత్కాలిక మరమ్మతులు చేసి రైలును వదిలారు. 19 బోగీ(కోచ్‌)లున్న సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు షాలిమార్‌ నుంచి బయలుదేరి ఉదయం 7.33 గంటలకు రాజమహేంద్రవరం వచ్చింది. ఇందులో 12 ఏసీ కోచ్‌లే ఉన్నాయి. రైలు బయలుదేరినప్పటి నుంచే కొన్ని బోగీల్లో విద్యుత్తు సమస్య ఉత్పన్నమైందని కొందరు ప్రయాణికులు తెలిపారు. రాజమహేంద్రవరం వచ్చేసరికి బోగీల్లో విద్యుత్తు ఉపకరణాలేవీ పనిచేయకపోవడం, టాయిలెట్లలో నీరూ రాకపోవడంతో ప్రయాణికులు సిబ్బందికి ఫిర్యాదు చేశారు. ఈ సమస్యను అంతకుముందే పసిగట్టిన సిబ్బంది కడియం వద్ద ఓసారి రైలు ఆపి మరమ్మతులకు యత్నించారు. పరిష్కారం దొరక్కపోవడంతో రైలును అలాగే పంపి.. రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్‌ చేరుకున్నాక నిలిపివేశారు. రైలింజిన్‌ వెనుకున్న జనరేటర్‌ పవర్‌ కార్‌లో సాంకేతిక సమస్యగా భావించి సిబ్బంది మరమ్మతులు మొదలుపెట్టారు. గంటలు గడిచినా ఎంతకూ మరమ్మతులు పూర్తికాకపోవడంతో బోగీల్లోని ప్రయాణికులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు. బోగీల్లో ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు పనిచేయకపోవడం, చివరికి టాయిలెట్లలో నీరూ రాకపోవడంతో పిల్లలు, వృద్ధులు ఇబ్బందిపడ్డారు. రాజమహేంద్రవరం స్టేషన్‌లోనే 5:30 గంటలపాటు రైలు ఆపేయడంతో అసౌకర్యానికి గురైన ప్రయాణికులు స్టేషన్‌ మాస్టర్‌ వద్దకు వెళ్లి ఆందోళన చేశారు. గమ్యస్థానాలకు ఎప్పుడు చేరుస్తారని నిలదీశారు. చివరికి తాత్కాలికంగా సమస్యను పరిష్కరించడంతో మధ్యాహ్నం ఒంటి గంటకు రైలు సికింద్రాబాద్‌కు బయలుదేరింది.

రైలు ఇంజిన్‌ వెనుక పవర్‌కార్‌లో జనరేటర్‌ను పరిశీలిస్తున్న సిబ్బంది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని