logo

ఆదుకుంటున్న సీలేరు జలాలు

గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది.

Published : 29 Mar 2024 03:13 IST

గోదావరిలో పడిపోతున్న నీటిమట్టం

పశ్చిమడెల్టా హెడ్‌స్లూయిస్‌ నుంచి విడుదల చేస్తున్న సాగునీరు

నిడదవోలు, న్యూస్‌టుడే: గోదావరిలో కొన్ని రోజులుగా నీటిమట్టం క్రమంగా పడిపోతోంది. రబీ వరిపంట చివరి దశకు చేరుకున్న తరుణంలో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలోని చివరి ఆయకట్టు రైతులు బుధవారం నిరసన చేపట్టారు. ముందుగా సాగు చేసిన వరిపంట చివరి దశకు చేరుకుంటుంది. పలు ప్రాంతాల్లో పంట చిరుపొట్ట దశలో ఉంది. ఈ క్రమంలో చేలకు నీటి అవసరం చాలా ఎక్కువ. ప్రస్తుతం అందిస్తున్న సాగునీరు సరిపోక పలు ప్రాంతాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సీజన్‌లోని పంట ప్రారంభంలో గోదావరిలో సాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయని అంతా భావించారు. డిసెంబరులో తుపాను కారణంగా ఇబ్బందులు తప్పాయి. చివరి దశలో గోదావరిలో ఇన్‌ఫ్లో తగ్గడంతో సీలేరు జలాలే గట్టెక్కిస్తున్నాయి. ప్రస్తుతం మూడు వేల క్యూసెక్కులకు పైగా సీలేరు జలాలే వస్తున్నాయి. పూర్వపు ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని మూడు డెల్టాల్లో 8.96 లక్షల ఎకరాలకు 8,970 క్యూసెక్కుల సాగునీటిని వంద డ్యూటీకి అందిస్తున్నారు.

కోతలు ప్రారంభం..

పలు మండలాల్లో నాలుగైదు రోజులుగా కోతలు ప్రారంభమయ్యాయి. విద్యుత్తు మోటార్ల కింద సాగు చేసిన పంటచేలు కోతకు చేరాయి. జిల్లాలో 4,55,845 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. 239 ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలో 80 లక్షల వరకు గోనె సంచులు అవసరమవుతాయని అంచనా. ఇప్పటికే రాజమహేంద్రవరం డివిజన్‌లో బిక్కవోలు, అనపర్తి, రంగంపేట, రాజానగరం, కొవ్వూరు డివిజన్‌లో కొవ్వూరు, చాగల్లు, తాళ్లపూడి, నిడదవోలు మండలాల్లో అక్కడక్కడ కోతలు ప్రారంభించారు.

మూడు దశల్లో కొనుగోలు కేంద్రాలు..

2023-2024 రబీ సీజన్‌లో జిల్లాలో మూడు దశల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. మొదటి దశలో ఏప్రిల్‌ 1న రంగంపేట, దేవరపల్లి, నిడదవోలు, తాళ్లపూడి, కొవ్వూరు, చాగల్లు మండలాలు, రెండో దశలో ఏప్రిల్‌ 5న రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం, కడియం, బిక్కవోలు, ఉండ్రాజవరం మండలాలు, మూడో దశలో ఏప్రిల్‌ 9న అనపర్తి, గోకవరం, కోరుకొండ, నల్లజర్ల, సీతానగరం, గోపాలపురం, పెరవలి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు తెరిచేలా ఆదేశాలు జారీ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని