logo

వైకాపాలో ఎవరి కుంపటి వారిదే!

ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి.

Published : 18 Apr 2024 06:37 IST

రాజమహేంద్రవరం గ్రామీణంలో వేణుకు మద్దతుగా ప్రచారంలో షర్మిలారెడ్డి

న్యూస్‌టుడే, టి.నగర్‌ (రాజమహేంద్రవరం): ఒకపక్క సార్వత్రిక ఎన్నికల ముహూర్తం దగ్గరపడుతున్నా జిల్లా వైకాపా నేతల్లో కలహాల కుంపట్లు రాజుకుంటునే ఉన్నాయి. రాష్ట్రంలో తూర్పు సెంటిమెంటుగా భావించే సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరంలో నాయకులు ఎడముఖం పెడముఖంగా ఉంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి సైతం కలగజేసుకుని సరిదిద్దే ప్రయత్నాలు చేసినా పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. తాజాగా ముఖ్యమంత్రి జగన్‌ అర్బన్‌, గ్రామీణ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఆయన వద్దే మళ్లీ పంచాయితీ ఉందని ఆ పార్టీ నేతలు గుసగుసలాడుకుంటున్నారు.

సీఎం పర్యటన వివరాలు వెల్లడిస్తున్న భరత్‌, వేణు. సమావేశంలో కనిపించని జిల్లా అధ్యక్షుడు రాజా

రాజమహేంద్రవరంలో ప్రస్తుత ఎంపీ భరత్‌.. అర్బన్‌లో ఎమ్మెల్యే స్థానానికి పోటీలో ఉన్నారు. స్థానికంగా ఆ పార్టీలో ఆది నుంచి ఉన్న జక్కంపూడి వర్గంతో ఆయనకు పొసగడం లేదు. అయిదేళ్లుగా ఆ దూరం పెరుగుతునే ఉంది. నగరంలో జక్కంపూడి వర్గంలో క్షేత్రస్థాయి నేతలు సైతం ఎన్నికల వేళ మిన్నకుండిపోయారు. భరత్‌రామ్‌ ప్రచారంలో వీరెక్కడా కానరావడం లేదు. ప్రధానంగా పేపరు మిల్లు విషయంలో ఈ రెండువర్గాల మధ్య గొడవలు తారస్థాయికి చేరాయి. ఏపీఐఐసీ మాజీ ఛైర్మన్‌ శ్రీకాఘోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, ఎమ్మెల్యే జక్కంపూడి రాజాలు మిల్లు రావై అధిష్ఠానం చెప్పినా నేతల్లో కుదరని సయోధ్యజకీయాల్లో కీలక భూమిక పోషించగా.. ఎంపీ భరత్‌ ఏకంగా మిల్లులో కార్మిక నేతను తనవైపు తిప్పుకున్నారు. డబ్బులు తీసుకొని సీనియారిటీ ఉన్న మిల్లు కార్మికులను పక్కన పెట్టి కొత్తవారికి పర్మినెంటు చేసే ప్రక్రియలో నేతలు కుమ్మకైన సంఘటనలో రూ.లక్షలు చేతులు మారాయనే ఆరోపణలు అప్పట్లో వెల్లువెత్తాయి. దీంతో వైకాపా నేతల మధ్య గొడవలు కాస్తా.. వ్యక్తిగత కక్షలు వరకూ వెళ్లాయి. ఎలాగైనా నగరంలో తమ గత వైభవాన్ని నిలబెట్టుకోవాలని జక్కంపూడి వర్గం చూస్తోంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా ఈ రెండు వర్గాల నాయకులు నువ్వెంతంటే నువ్వెంత అంటూ సవాళ్లు విసురుకొంటున్నాయి.

వీరూ నగరానికి దూరమే

  • హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా ఉన్న  షర్మిలారెడ్డి సైతం నగర రాజకీయాల్లో తలదూర్చడం లేదు. రుడా ఛైర్‌పర్సన్‌ పదవీకాలం పొడిగింపు విషయంలో ఎంపీ అడ్డుపడ్డారని ఆమె కోపంగా ఉన్నారు. రుడా ఛైర్‌పర్సన్‌గా పదవిని పొడిగిస్తూ ఉత్తర్వులు వెలువడిన ఒక్కరోజులో ఎంపీ చక్రం తిప్పడాన్ని ఆమె అవమానంగా భావించారు. గ్రామీణంలో పోటీచేస్తున్న మంత్రి వేణుకు మద్దతుగా ప్రచారంలో పాల్గొంటున్నారే తప్పా నగరంలో ఎక్కడా కనిపించడం లేదు.
  • గ్రామీణ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మంత్రి వేణుతో కూడా ఎంపీకి విభేదాలు తలెత్తాయని శ్రేణుల్లో వినిపిస్తోంది. టిడ్కో గృహాలు రాజమహేంద్రవరం గ్రామీణంలో ఉండడంతో వాటిని నగర లబ్ధిదారులకు అందించే విషయంలో ఇద్దరికీ సయోధ్య కుదరక వాయిదా వేశారు. చివరికి కోడ్‌ ప్రకటించే ఒక్కరోజు ముందు ఇళ్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో మంత్రి వేణు, ఎంపీ మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోంది.

ద్వితీయశ్రేణి నాయకులతో భేటీ అయినా...

ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో  మిథున్‌రెడ్డి రాజావర్గంతో భేటీ అయ్యారు. ఎన్నికలకు సహకరించాలని.. తెదేపాకు కంచుకోటగా ఉన్న అర్బన్‌లో వైకాపా గెలవడానికి కృషి చేయాలని చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. షెడ్యూల్‌ ప్రకటించిన తర్వాత నేరుగా ముఖ్యమంత్రి తాడేపల్లిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజాతో సహా శివరామసుబ్రహ్మణ్యం, ద్వితీయ శ్రేణి నాయకులతో సమావేశమయ్యారు. అవసరమైతే ఇతర నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ప్రచారాలు చేస్తామని, అర్బన్‌లో మాత్రం తిరగమని కొందరు ద్వితీయశ్రేణి నాయకులు తేల్చి చెప్పేసినట్లు భోగట్టా. అప్పట్నుంచి షర్మిలారెడ్డి గ్రామీణ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. శివరామ సుబ్రహ్మణ్యం సైతం ఇదే బాటలో వెళ్తున్నారు.


జిల్లా అధ్యక్షుడు ఎక్కడ..?

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌ జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా కనబడలేదు. వాస్తవానికి పర్యటన వివరాలు పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రకటించాల్సి ఉన్నా మంత్రి వేణు, ఎంపీ మాత్రమే ఆ సమావేశంలో కనిపించారు. సీఎం పర్యటనకు ముందు పార్టీ కార్యాలయం నుంచి కొంతమంది అసంతృప్తి నాయకులకు మళ్లీ ఫోన్‌లు వచ్చాయని తెలుస్తోంది. ఎన్నికలకు కలిసి పనిచేయాలని, గొడవలుంటే తర్వాత చూద్దామని సర్ధిచెప్పినట్లు భోగట్టా. మరికొంతమంది నేతలకు స్వీటు వార్నింగ్‌ కూడా ఇచ్చినట్లు వినికిడి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని