logo

మత్స్యకార కుటుంబాల కల.. మాటలతో వైకాపా వల

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ  శివారులో హార్బర్‌.. 20 వేల మత్స్యకార కుటుంబాల కల. ఇది అందు బాటులోకి వస్తే కష్టాలన్నీ తీరిపోయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. వైకాపా సర్కారు దీనిపై ఎన్నో గొప్పలు చెప్పింది.

Published : 28 Apr 2024 04:09 IST

పూర్తికాని ఉప్పాడ హార్బర్‌ నిర్మాణం
గ్రాఫిక్స్‌ చూపిస్తూ అబద్ధాల ప్రచారం
న్యూస్‌టుడే, యు.కొత్తపల్లి

అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత శంకుస్థాపన చేశారు.. రెండేళ్లలో నిర్మాణం పూర్తిచేస్తామని చెప్పారు.. ఇదిగో వచ్చేస్తోందంటూ మూడుసార్లు గడువులు నిర్దేశించారు..  నాలుగేళ్లుగా అదిగో.. ఇదిగో అంటూ ఊరిస్తూ వచ్చారు.. అయిదేళ్ల పాలనా కాలం    ముగిసినా నిర్మాణం 60 శాతమూ పూర్తిగాని పరిస్థితి.

కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ  శివారులో హార్బర్‌.. 20 వేల మత్స్యకార కుటుంబాల కల. ఇది అందు బాటులోకి వస్తే కష్టాలన్నీ తీరిపోయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ఆశపడ్డారు. వైకాపా సర్కారు దీనిపై ఎన్నో గొప్పలు చెప్పింది. చివరకు నిర్మాణం పూర్తికాకపోయినా తగ్గేదేలె.. అంటూ డ్రోన్‌ విజువల్స్‌తో గ్రాఫిక్స్‌ చూపిస్తూ అభివృద్ధి చేశామంటూ ప్రచారం చేసుకుంటోంది.

కానుకగా ఇస్తామని కథలు చెప్పి.

పనులు ఆగిన తీరుపై సెప్టెంబరు 2023లో ‘ఈనాడు’లో ‘బిల్లు రాక..పనులు పడక’ శీర్షికన కథనం ప్రచురించడంతో పాలకులు, అధికారులు సమావేశం నిర్వహించి 2023 డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తిచేసి హార్బర్‌ను  మత్స్యకారులకు  కానుకగా ఇస్తామని గొప్పలు చెప్పారు. మూడోసారి ఇచ్చిన గడువు కూడా పూర్తయి మూడు నెలలు  గడుస్తున్నా ప్రస్తుతం సగం నిర్మాణమే పూర్తయింది. వైకాపా ప్రభుత్వ పాలనా కాలమూ ముగిసింది.

హార్బర్‌ నిర్మాణ ప్రాంతం

ప్రారంభించిన మూడు నెలలకే పడక

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హార్బర్‌ కోసం రూ.422 కోట్ల నిధులు కేటాయించామని గొప్పలు చెప్పింది.

2020 డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా వర్చువల్‌ విధానంలో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆర్భాటంగా పనులు ప్రారంభించి మూడు నెలలకే నిలిపేశారు. ఏడాది తర్వాత మరో సంస్థ నిర్మాణ పనులు పునః ప్రారంభించింది. కేవలం 18 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. దాదాపు 50 శాతం పూర్తి చేశారు. సుమారు రూ.200 కోట్ల వరకు నిర్మాణ సంస్థ పెట్టుబడి పెట్టి పనులు చేసింది. ఒక్క రూపాయి కూడా బిల్లు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపేసింది.

అసంపూర్తిగా భవన నిర్మాణాలు

సాగుతోందిలా..

నూతన హార్బర్‌ పూర్తి కాకుండానే వైకాపా ప్రభుత్వం మాత్రం పూర్తిచేసినట్లు ప్రచారం చేసుకుంటోందని వివిధ సంఘాల ప్రతినిధులు విమర్శిస్తున్నారు. ప్రస్తుతం పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. దీనికి కారణం బిల్లుల మంజూరులో జాప్యంగా తెలుస్తోంది. ఇదే కొనసాగితే మరో అయిదేళ్లు పోయినా హార్బర్‌ నిర్మాణం పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీని నిర్మాణం చేపట్టి నాలుగేళ్లు గడుస్తున్నా నేటికి పూర్తికాలేదని.. స్థానిక పాలకులు, అధికారులు మాత్రం పలుమార్లు ఇక్కడ సమావేశాలు నిర్వహించి అదిగో.. ఇదిగో అంటూ అరచేతిలో అంతా చూపించారని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని