logo

పాతదారికే పూత

గుంటూరు-హైదరాబాద్‌ మార్గంలో కీలకమైన రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. గుంతలు పడి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు....

Published : 23 May 2022 05:11 IST

కీలక రోడ్డుకు ఒక పొర తారుతో మరమ్మతులు

న్యూస్‌టుడే, సత్తెనపల్లి గ్రామీణం

గుంటూరు-హైదరాబాద్‌ మార్గంలో కీలకమైన రహదారి విస్తరణకు నోచుకోవడం లేదు. గుంతలు పడి అధ్వానంగా మారడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మరమ్మతులు చేపడతామంటే నిబంధనల ప్రకారం విస్తరణ జాప్యం కానుంది. ఈ క్రమంలో దీనికి అధికారులు పైపై పూతకు రంగం సిద్ధం చేశారు. నిత్యం వేల వాహనాలు తిరిగే పేరేచర్ల -కొండమోడు రోడ్డు పరిస్థితి.

ఉమ్మడి జిల్లాలో ముఖ్యమైన మార్గాల్లో పేరేచర్ల-కొండమోడు రహదారి ఒకటి. 49 కిలోమీటర్ల ఈ రోడ్డును రహదారులు భవనాల శాఖ నుంచి జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)కు బదలాయించి మూడేళ్లు గడిచినా విస్తరణకు నోచుకోలేదు. ఎన్‌హెచ్‌ఏఐకు అప్పగించే ముందు ఆర్‌అండ్‌బీ శాఖ కనీస మరమ్మతులు చేయలేదు. ప్రయాణం నరకయాతనగా మారడంతో వాహన చోదకులు, ప్రయాణికుల ఫిర్యాదులు, ప్రజాప్రతినిధుల సూచనల మేరకు మరమ్మతులకు ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు మొగ్గు చూపారు. మార్గదర్శకాల మేరకు మరమ్మతులు చేపట్టిన ఏడాది లోపు రహదారి విస్తరణకు నిధులు సమకూరవు. ఫలితంగా పేరేచర్ల-కొండమోడు నాలుగు వరుసల రహదారి ఏర్పాటులో అనిశ్చితి నెలకొంది.

గతంలో రూ.735 కోట్ల మంజూరు

గుంటూరు ప్రాంతం నుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలతో పేరేచర్ల-కొండమోడు మార్గం నిత్యం రద్దీగా ఉంటుంది. నాలుగు వరుసల రోడ్డుకు గత ప్రభుత్వ హయాంలో రహదారుల అభివృద్ధి సంస్థ రూ.738 కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌లోని ఒక సంస్థ సర్వే నిర్వహించి డీపీఆర్‌ను అప్పటి ప్రభుత్వానికి అందించింది. సత్తెనపల్లి పట్టణానికి 9.58 కిలోమీటర్ల బైపాస్‌ రోడ్డు, కంటెపూడి, ధూళిపాళ్ల, రాజుపాలెం వద్ద సర్వీసు రోడ్ల ఏర్పాటుకు ప్రతిపాదించింది. భూసేకరణలో అభ్యంతరాల స్వీకరణకు సదస్సులు నిర్వహించింది. 2019లో ఏర్పడిన ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు రద్దు చేయగా, నిధులు వెనక్కి మళ్లాయి.

టెండర్ల ప్రక్రియ పూర్తి

రహదారి విస్తరణలో నెలకొన్న జాప్యంతో పూర్తిగా ఛిద్రమైన సత్తెనపల్లి-కొండమోడు రహదారిపై గుంతలు పూడ్చి ఒక పొర తారుతో సరిపుచ్చాలని అధికారులు భావిస్తున్నారు. ఆయా పనులకు రూ.11 కోట్లు నిధులు మంజూరు కాగా ఇటీవల టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఈ విషయమై ఎన్‌హెచ్‌ఏఐ ఏఈఈ ప్రకాశం ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ నాలుగు వరుసల రహదారి విస్తరణ ప్రక్రియలో సర్వే, భూసేకరణ, ప్రజాభిప్రాయ సేకరణ, డీపీఆర్‌ తయారీ జరగాలని తెలిపారు. దీనికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పారు. సత్తెనపల్లి నుంచి రాజుపాలెం మీదుగా కొండమోడు వరకు 25 కిలోమీటర్ల రహదారికి ఒక పొర తారుతో రోడ్డు పనులు త్వరలో చేపడతామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని