logo

కార్పొరేట్‌ సంస్థలే లక్ష్యంగా మోసాలు

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డిని అంటూ కార్పొరేట్‌ సంస్థల యజమానులే లక్ష్యంగా ఓ యువకుడు చేస్తున్న మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. ఏపీ సన్‌రైజర్స్‌ క్రికెటర్‌ రికీ భుయ్‌కు స్పాన్సర్‌ చేయాలంటూ బర్జర్‌

Published : 03 Jul 2022 06:26 IST

ముఖ్యమంత్రి పీఏ పేరుతో ఈ-మెయిల్‌

విజయవాడ, న్యూస్‌టుడే : ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పీఏ కె.నాగేశ్వర్‌రెడ్డిని అంటూ కార్పొరేట్‌ సంస్థల యజమానులే లక్ష్యంగా ఓ యువకుడు చేస్తున్న మోసాలు ఒక్కోటిగా వెలుగు చూస్తున్నాయి. ఏపీ సన్‌రైజర్స్‌ క్రికెటర్‌ రికీ భుయ్‌కు స్పాన్సర్‌ చేయాలంటూ బర్జర్‌ పెయింట్స్‌ కంపెనీని రూ.10.4లక్షలు మోసం చేసిన ఘటన మరువక ముందే ఇంకొన్ని వెలుగుచూశాయి. గత నెల 17న జోయలుక్కాస్‌ సీఎండీకి ఫోన్‌ చేసి క్రికెటర్‌ రికీ భుయ్‌కు స్పాన్సర్‌ చేయాలంటూ కోరారు. అపరిచిత వ్యక్తి మాటలు నమ్మి జోయలుక్కాస్‌ ప్రతినిధులు రూ.10,40,400లు పంపించారు. మోసాన్ని గ్రహించి వారు, విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌లో గత నెల 30న ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. ఒకే యువకుడు అదే తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 9 మందిని మోసం చేసినట్లు తేలింది.

తాడేపల్లిలో తొలి కేసు: గత నెలలో తాడేపల్లిలోని మణిపాల్‌ ఆసుపత్రి ఎండీకి కూడా ఇదే తరహాలో.. క్రికెటర్‌కు రూ.10,40,600లు స్పాన్సర్‌ చేయమంటూ సీఎం పీఏ పేరిట వాట్సాప్‌ మేసెజ్‌ వచ్చింది. అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులకు గత నెల 28న ఫిర్యాదు చేశారు. పోలీసుల విచారణలో శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలానికి చెందిన నాగరాజు (35) ఈ మోసానికి పాల్పడినట్లుగా గుర్తించారు. అతడిని తాడేపల్లిలోని పాత టోల్‌గేట్‌ కూడలిలో శుక్రవారం అరెస్టు చేసి న్యాయస్థానంలో హాజరు పరచగా రిమాండ్‌ విధించారు.

నమ్మకంగా మాట్లాడుతూ:  పీఏ టు జగన్‌మోహన్‌రెడ్డి పేరుతోనే ఈ మెయిల్‌ సృష్టించి, దాని ద్వారా కార్పొరేట్‌ కంపెనీ ప్రతినిధులతో లావాదేవీలు జరిపేవాడు. జూన్‌ 29న సెక్రటేరియట్‌లో దీనికి సంబంధించిన వేడుక ఉందని, దానికి హాజరు కావాలని జోయలుక్కాస్‌ ప్రతినిధులకు నమ్మకంగా చెప్పటంతో వారు నమ్మారు. ఏ విధమైన కార్యక్రమాలు జరగకపోవటంతో వారు అనుమానించి పోలీసులను అశ్రయించారు. బర్జర్‌ పెయింట్స్‌ ప్రతినిధి జి.రామకృష్ణ ఫిర్యాదు మేరకు సైబర్‌ క్రైం పోలీసులు కేసు నమోదు చేయగా విజయవాడ జోయలుక్కాస్‌ రిటైల్‌ మేనేజర్‌ రాజేష్‌ కృష్ణన్‌ ఫిర్యాదుతో విజయవాడ కృష్ణలంక పోలీసులు కేసు నమోదు చేశారు.  విజయవాడ, తాడేపల్లిలోని మూడు కేసులే కుండా మరో 6 చోట్ల ఇదే తరహాలో నాగరాజు మోసం చేశాడని పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని