logo

అధిక వడ్డీలకు జలగల్లా పీడిస్తూ..

గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ఒకరు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు.

Updated : 06 Aug 2022 06:26 IST

వేధింపులు తాళలేక పరారవుతున్న బాధితులు

కాల్‌మనీ వ్యాపారానికి పెట్టింది పేరైన గుంటూరులో అధిక వడ్డీలతో కొందరు ఫైనాన్స్‌ వ్యాపారులు జలగల్లా పట్టి పీడిస్తున్నారు.  రాజకీయ అండదండలతో పేట్రేగిపోతున్నారు. తీసుకున్న మొత్తం వడ్డీతో సహా చెల్లింపులు చేసినా ఇంకా బకాయి ఉన్నావని బుకాయిస్తున్నారు.. ఆ మొత్తాన్ని చెల్లిస్తావా లేదా అంటూ వేధింపులకు పాల్పడుతున్నారు. రోజు, నెలవారీ కిస్తీలు కడుతున్నా కట్టడం లేదని వారి నెత్తిన మరింత అప్పుల కుంపటి మోపుతున్నారు. కొందరు వ్యాపారుల వద్ద ఇల్లో, స్థలమో, బంగారమో కుదువ పెట్టి అప్పులు పొందిన వారు చివరకు వాటిని వదిలేసుకోవాల్సిందేనని వారి వ్యవహారశైలి తెలిసినవారు అంటున్నారు. అప్పటికీ వదలకపోతే బాధితులు ఊరు వదిలి పారిపోతున్నారు.

ఈనాడు, అమరావతి

ఇవీ సూక్ష్మంగా    ఆగడాలు, మోసాలు..
గుంటూరుకు చెందిన స్థిరాస్తి వ్యాపారి ఒకరు మూడు రోజుల క్రితం హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. అధిక వడ్డీలకు తాళలేక ఆత్మహత్య చేసుకున్నానని తను చనిపోతూ రాసిన సూసైడ్‌ నోట్‌లో ఉంది. ఆ లేఖను ఏపీ సీఎంకు అడ్రస్‌ చేస్తూ ఫైనాన్స్‌ వ్యాపారుల ఆగడాలు ఎలా ఉంటున్నాయో అందులో ఉదహరించారు. ఆ వ్యాపారి ఆత్మహత్యతో గుంటూరులోని ఫైనాన్స్‌ వ్యాపారుల ఆగడాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి.
కొందరి వద్ద అప్పులు తీసుకుంటే బతికున్నంత కాలం చెల్లించినా తీరవని, అంతలా మోసాలకు పాల్పడతారని నగరంలోని పండ్ల మార్కెట్‌కు చెందిన చిరు వ్యాపారి ఒకరు తెలిపారు.
పట్నంబజార్‌లోని పండ్లు, పూలు, డబ్బాలు తయారు చేసేవారిని లక్ష్యంగా చేసుకుని కొందరు వడ్డీ వ్యాపారులు భారీ స్థాయిలో వడ్డీలకు ఇస్తూ అపర కుబేరులుగా మారిపోయారు. పోలీసుల అక్రమ సంపాదనను కొందరు ఫైనాన్స్‌ వ్యాపారులు మార్కెట్లో తిప్పుతూ వారికి వడ్డీ ఆదాయాన్ని రుచిచూపుతున్నారని తెలుస్తోంది.

గుంటూరు పండ్ల మార్కెట్‌కు రోజూ లారీల్లో పెద్దఎత్తున దానిమ్మకాయలు, యాపిల్‌, అరటి ఇలా రకరకాల పండ్లు వస్తాయి. తొలుత లారీ సరకు మొత్తాన్ని ఒకరే కొనుగోలు చేస్తారు. ఉదాహరణకు లారీ దానిమ్మ రూ.4లక్షలు ఉంటుంది. పండ్ల మార్కెట్‌లో మాత్రమే వడ్డీ వ్యాపారం చేస్తారని పేరున్న ఓ కార్పొరేటర్‌ బంధువు తెల్లవారుజామునే రూ.లక్షల కట్టలు, ప్రామిసరీ నోట్లు, స్టాంపు పేపర్లతో అక్కడ వాలిపోతారు. ఆ వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తిరిగి చెల్లించినా ఇంకా బకాయి ఉన్నావని బుకాయిస్తూ మరింతగా అప్పుల భారం మోపడంతో అన్నదమ్ములైన ఇద్దరు పండ్ల వ్యాపారులు తాజాగా నగరాన్ని వీడారని మార్కెట్‌ వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. వీరికి అప్పులిచ్చిన ఫైనాన్స్‌ వ్యాపారి నూటికి 10 నుంచి 15 శాతం చొప్పున వడ్డీ విధించినట్లు చెబుతున్నారు.

ఒకేసారి రూ.లక్షో, రూ.2లక్షలో ఇచ్చి ఆ మొత్తంలో నుంచి నగదు ఇచ్చే సమయంలోనే 10 నుంచి 15 శాతం మొత్తాన్ని మినహాయించుకుని అప్పులిచ్చే విధానం మరికొందరు వ్యాపారులది. ఉదాహరణకు రూ.లక్ష అప్పు కావాలనుకుంటే అందులో పది శాతం అంటే రూ.10వేలు మినహాయించుకుని చేతిలో రూ.90వేలు పెడతారు. ఆ మొత్తాన్ని రోజుకు వెయ్యి చొప్పున వంద రోజుల్లో తీర్చేయాలి. ఆ లోపు తీర్చలేకపోతే తిరిగి రోజుకు వెయ్యి చొప్పున వడ్డీ మోపుతారు. ఈ విధానంలో శ్రీనివాసరావుపేటకు చెందిన ఓ టిఫిన్‌ బండి నిర్వాహకుడు రూ.లక్ష అప్పు పొందారు. వంద రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించినా చెల్లించలేదని రోజువారీ వడ్డీభారం మోపడంతో గత కొద్ది రోజులుగా ఆ వ్యాపారి టిఫిన్‌ బండి సైతం పెట్టడం లేదని, ఇంటికి తాళాలు వేసి కుటుంబంతో సహా కనిపించకుండా పారిపోయారని చెబుతున్నారు.

వేధింపులు మా దృష్టికి వచ్చాయ్‌..
పండ్లమార్కెట్లో కొందరు వ్యాపారులు అవసరానికి అప్పులు తీసుకుని చెల్లింపులు చేసినా చెల్లించలేదని, అధిక వడ్డీలతో ఇబ్బంది పెడుతున్నారని ఒకరిద్దరు ఫైనాన్స్‌ వ్యాపారులపై ఫిర్యాదులు వచ్చాయి. వారిని పిలిచి మాట్లాడి సమస్యను పరిష్కరించాం. ఇటీవల కాలంలో లోన్‌యాప్‌ల నుంచి రుణాలు పొందిన వారికి వేధింపులు బాగా ఉంటున్నాయని ఫిర్యాదులొస్తున్నాయి. ఆర్థిక అవసరాల కోసం అప్పులు తీసుకుని వాటిని తిరిగి చెల్లింపులు చేసేటప్పుడు మధ్యవర్తులను ఉంచుకోవాలి. చేసిన ప్రతి చెల్లింపు వివరాలు రాతపూర్వకంగా ఉంచుకోవాలి. ఆ మొత్తాన్ని వీడియో తీసి దగ్గర పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. -సీతారామయ్య, డీఎస్పీ, గుంటూరు ఈస్ట్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు