logo

ఎవరో వస్తారని ఎదురు చూడక..

రెండేళ్లుగా సాగర్‌ కాలువలకు ఎలాంటి పనులు చేయలేదు.. నిధుల్లేక ఎన్నెస్పీ అధికారులు చేపట్టలేదు. గత ఏడాది వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో నీటిని విడుదల చేయగా కాలువలో దట్టంగా పెరిగిన చిల్లచెట్లు, పూడిక ఉండడంతో నీటి సరఫరా సక్రమంగా

Published : 29 Sep 2022 04:40 IST

రైతులే స్వచ్ఛందంగా కాలువలో పూడిక 

తొలగింపునకు శ్రీకారం

పర్చూరు, న్యూస్‌టుడే

నూతలపాడు - చింతగుంటపాలెం మధ్య కాలువలో

పొక్లెయిన్‌తో తొలగిస్తున్న చిల్లచెట్లు, పూడిక

రెండేళ్లుగా సాగర్‌ కాలువలకు ఎలాంటి పనులు చేయలేదు.. నిధుల్లేక ఎన్నెస్పీ అధికారులు చేపట్టలేదు. గత ఏడాది వ్యవసాయ సీజన్‌ ప్రారంభంలో నీటిని విడుదల చేయగా కాలువలో దట్టంగా పెరిగిన చిల్లచెట్లు, పూడిక ఉండడంతో నీటి సరఫరా సక్రమంగా జరగక కట్టలు తెగి, పంట పొలాలను నీరు ముంచెత్తింది. మళ్లీ నీటిని విడుదల చేస్తే గత సంవత్సర పరిస్థితి పునరావృతమవుతుందని ఆలోచించారు. ఈక్రమంలో పర్చూరు మండలంలోని నూతలపాడు రైతులు దీనిపై చర్చించుకున్నారు. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా పొంచి ఉన్న ముంపు ప్రమాదానికి భయపడి సొంత నిధులు వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. నూతలపాడు-చింతగుంటపాలెం మధ్య నూతలపాడు మైనర్‌లో చిల్లచెట్లు తొలగించి, పూడిక తీసేందుకు తలా కాస్తా నిధులు సమకూర్చుకోవాలని తీర్మానించారు. అధికారులకు తమ అభిప్రాయాన్ని చెప్పి వారి సహకారంతో కాలువకు దక్షిణం వైపు ఉన్న రైతులు పొక్లెయిన్‌ ఏర్పాటు చేసుకొని, దాదాపు రెండు కి.మి. పొడవునా సాగర్‌ కాలువ మరమ్మతులు చేయించుకున్నారు. నిబంధనల ప్రకారం పనులు జరిగేలా అధికారులు పర్యవేక్షించారు. నూతలపాడు మైనర్‌ పరిధిలో 25 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా కాలువ పొడవునా ఇదే పరిస్థితి ఉంది. నూతలపాడుకు దిగువన కాలువ అడవిని తలపించేలా ఉంది. మరమ్మతులు చేయించుకునేందుకు రైతులు ప్రయత్నిస్తున్నా పొక్లెయిన్‌ అందుబాటులో లేకపోవడంతో జాప్యం జరుగుతున్నట్లు తెలిసింది.

సాగర్‌ కాలువలో దట్టంగా ఉన్న చిల్లచెట్లు

సాగర్‌ కాలువ అడవిని తలపించేలా ఉంది. చిల్లచెట్లు, పూడిక వల్ల నీటి సరఫరా జరగని పరిస్థితి. కాలువ మరమ్మతులు చేపట్టాలని ఎన్నెస్పీ అధికారుల చుట్టూ అనేక సార్లు తిరిగాం. వ్యవసాయ సీజన్‌ ప్రారంభమైనా పనులు చేపట్టలేదు. కాలువకు గండ్లు పడితే పంట పొలాలు ముంపునకు గురవుతాయని రైతులకు వివరించి స్వచ్ఛందంగా పనులు చేయించుకునేలా ఒప్పించాం. - శ్రీరామచంద్రమూర్తి, నూతలపాడు రైతు

సాగర్‌ కాలువకు గండి పడి గత ఏడాది పంట సాగు సమయంలోనే పొలాలు దెబ్బతిన్నాయి. వేసవిలో కాలువ మరమ్మతులు చేయిస్తారని ఆశించాం. ప్రజాప్రతినిధులు, ఎన్నెస్పీ అధికారులకు పలుమార్లు సమస్య తీవ్రతను వివరించాం. ఫలితం లేకపోవడంతో కాలువ పరిధిలోని రైతులు తలా కాస్తా నిధులు సమకూర్చుకొని పనులు చేయించుకోవాలని నిర్ణయించుకున్నాం. - పోలూరి శ్రీనివాసరెడ్డి, రైతు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు