logo

జిల్లా ప్రగతికి కృషి చేద్దాం

గుంటూరు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు.

Published : 27 Jan 2023 04:47 IST

74వ గణతంత్ర వేడుకల్లో కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి
కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే


జాతీయజెండా ఆవిష్కరిస్తున్న జిల్లా పాలనాధికారి వేణుగోపాల్‌రెడ్డి

గుంటూరు జిల్లాను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. 74వ గణతంత్ర వేడుకలను గురువారం పోలీసు కవాతు మైదానంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జాతీయ పతాకాన్ని ఎగురవేసి జెండా వందనం చేశారు. అనంతరం జిల్లా ప్రగతి నివేదికను వివరించారు.

వ్యవసాయం: వైఎస్సార్‌ రైతు భరోసా పథకం, పీఎం కిసాన్‌ పథకాల ద్వారా 2022-23 సంవత్సరానికి 1,19,631 మంది రైతులకు రూ.51.61 కోట్లను పెట్టుబడి సాయంగా అందించామన్నారు. సున్నా వడ్డీ పథకం ద్వారా పంట రుణాలు సకాలంలో చెల్లించిన 15,220 మంది రైతులకు రూ.2.75 కోట్లు వడ్డీ రాయితీ ఇచ్చామన్నారు. గతేడాది కురిసిన వర్షాలతో నష్టపోయిన 460 మందికి రూ.38 లక్షల పెట్టుబడి రాయితీ అందించామన్నారు.

బ్యాంకులు: జిల్లా వార్షిక రుణ ప్రణాళిక 2022-23లో ప్రాధాన్య రంగాలకు రూ.16,932 కోట్ల రుణాలు లక్ష్యంగా నిర్దేశించామన్నారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యం రూ.4,893 కోట్లు కాగా.. సెప్టెంబర్‌ నాటికి రూ.3,190 కోట్లు, దీర్ఘకాలిక వ్యవసాయ రుణాల లక్ష్యం రూ.1,675 కోట్లు కాగా.. సెప్టెంబర్‌ వరకు రూ.2,090 కోట్ల రుణాలను అందజేశారన్నారు.  

వైద్యారోగ్య శాఖ: ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని జిల్లాలోని 211 గ్రామాల్లో అమలు చేస్తున్నామన్నారు. ప్రధానమంత్రి మాతృవందన యోజనతో 5300 మందికి రూ.2.98 కోట్లు వారి ఖాతాల్లో జమ చేశామన్నారు. ఆరోగ్యశ్రీలో 3,255 జబ్బులకు రూ.431 కోట్లతో 1.79 లక్షల మందికి శస్త్రచికిత్సలు చేశామని తెలిపారు. ఆరోగ్య ఆసరా ద్వారా 70,591 మందికి రూ.42 కోట్లను రోగులకు శస్త్ర చికిత్స అనంతరం జీవనోపాధి భృతిగా అందించామన్నారు.

విద్యాశాఖ: మనబడి నాడు నేడు ఫేజ్‌-2లో జిల్లాలో 563 ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల రూపురేఖలను పూర్తిగా మార్చేందుకు రూ.208 కోట్లతో 838 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. జగనన్న విద్యాకానుక  కిట్లను జిల్లాలోని 1,097 పాఠశాలల్లోని 1,13,521 మంది విద్యార్థులకు అందించామన్నారు.  

జిల్లాగ్రామీణాభివృద్ధి సంస్థ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ: జిల్లాలో కొత్తగా 8,300 పింఛన్లు మంజూరు చేశామన్నారు. పేదలందరికీ ఇళ్ల పథకంలో 18,360 మందికి రూ.902 కోట్లను మంజూరు చేశామన్నారు. స్త్రీ నిధి ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని 17,167 మంది స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ.68 కోట్లు రుణంగా అందించామన్నారు.


ఆకట్టుకున్న విద్యార్థుల నృత్య ప్రదర్శన

పంచాయతీరాజ్‌ శాఖ: జిల్లాలో ప్రాధాన్య భవనాల నిర్మాణం మొత్తం 825 పనులకు రూ.188 కోట్లు మంజూరయ్యాయని, ఇప్పటి వరకు 139 పనులు పూర్తయ్యాయన్నారు.  

గడప గడపకు మన ప్రభుత్వం: ఈ కార్యక్రమం ద్వారా ప్రజాప్రతినిధులు పర్యటించి ప్రజల అవసరాలను గుర్తించిన 653 పనులను రూ.42 కోట్లు మంజూరయ్యాయన్నారు.  

కారుణ్య నియామకాలు: వివిధ శాఖల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 81 మందికి, మరణించిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులైన 26 మందికి, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు కల్పించామన్నారు.  

గృహనిర్మాణ శాఖ: జిల్లాలో 209 వైఎస్‌ఆర్‌ జగనన్న కాలనీలో లేఔట్లలో 67,678 గృహాలను చేపట్టామని, రూ.1,218 కోట్లను కేటాయించామన్నారు. జిల్లాలో 13,381 గృహాలను ఉగాది నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నామని వివరించారు. కార్యక్రమంలో ఎస్పీ ఆరిఫ్‌ హాఫీజ్‌, జిల్లా సంయుక్త కలెక్టర్‌ జి.రాజకుమారి, నాలుగో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి రాంగోపాల్‌, గుంటూరు నగర కమిషనర్‌ కీర్తి చేకూరి, తెనాలి సబ్‌ కలెక్టర్‌ గీతాంజలి శర్మ, ఏఎస్పీలు అనీల్‌, సుప్రజ, శ్రీనివాసరావు, కోటేశ్వరరావు, డీఆర్‌వో కె.చంద్రశేఖర్‌రావు, జిల్లాపరిషత్తు ఛైర్‌పర్సన్‌ కత్తెర క్రిస్టినా, ఎమ్మెల్యేలు కిలారి వెంకటరోశయ్య, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని