logo

‘పేదలకు పనికిరాని స్థలాలు ఇచ్చారు’

ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు.

Published : 01 Apr 2023 05:38 IST

మాజీ మంత్రి ఆలపాటి  

పట్టాభిపురం (గుంటూరు), న్యూస్‌టుడే: ఇళ్ల స్థలాల పేరుతో వైకాపా నేతలు వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ ఆరోపించారు. జిల్లా తెదేపా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్‌ ప్రభుత్వం పక్కా ఇళ్ల నిర్మాణం పేరుతో పేదలకు తీరని ద్రోహం చేస్తుందన్నారు. ఒక్క తెనాలిలోనే వైకాపా నేతలు రూ.150 కోట్లు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇళ్లస్థలాల పంపిణీ అంటూ 48 గజాలు పేదలకు అంటగట్టారు. ఉగాదికి పేదలకు ఇళ్లు ఇస్తామని చెప్పి శ్రీరామనవమి ముగిసినా అతీగతీ లేదు.  కేంద్రం నుంచి వచ్చిన నిధులు తప్ప జగన్‌ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 1987 ఇళ్లను మాత్రమే సిద్ధం చేసి పేదలకు లక్షల్లో ఇళ్లు ఇచ్చామని మోసం చేస్తున్నారు. నివాస ప్రాంతాలకు దూరంగా ఎందుకు పనికిరాని స్థలాలను పేదలకు ఇచ్చారు. సరిగ్గా ఇళ్ల నిర్మాణం చేయకుండా లబ్ధిదారులను డబ్బు చెల్లించమని బ్యాంకు సిబ్బంది ఒత్తిడి చేస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పేదలకు ఇళ్ల నిర్మాణం పేరుతో వైకాపా ప్రభుత్వం కోట్లాది రూపాయలు బ్యాంకుల నుంచి తీసుకుంది. ఆ డబ్బును ఎక్కడ పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. పేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే వరకు ప్రభుత్వం తీరుపై ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైకాపాను ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ సమావేశంలో తెదేపా నాయకులు పిల్లి మాణిక్యరావు, దాసరి రాజామాస్టారు, చిట్టాబత్తిన చిట్టిబాబు, దామచర్ల శ్రీనివాసరావు, నాయుడు ఓంకార్‌, కల్లూరి శ్రీనివాసరావు, బొబ్బిలి రామారావు, రావిపాటి సాయికృష్ణ, మన్నవ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని