logo

ఫోన్‌ పోయిందా.. ఇట్టే దొరుకుతుంది

ఆండ్రాయిడ్‌ చరవాణి లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి నేటి తరానిది. కనీసం ఎంత లేదన్న రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో ఖర్చు పెట్టి వీటిని కొంటున్నారు.

Updated : 09 Jun 2023 06:15 IST

సీఈఐఆర్‌ వెబ్‌సైట్ లో నమోదుతో రికవరీ
అవకాశం కల్పిస్తున్న పల్నాడు జిల్లా పోలీసులు

సీఈఐఆర్‌ వెబ్‌ సైట్‌

నరసరావుపేట టౌన్‌, న్యూస్‌టుడే: ఆండ్రాయిడ్‌ చరవాణి లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితి నేటి తరానిది. కనీసం ఎంత లేదన్న రూ.10 వేల నుంచి రూ.లక్షల్లో ఖర్చు పెట్టి వీటిని కొంటున్నారు. విలువైన వస్తువు కావడంతో చాలా భద్రంగా చూసుకుంటారు. దురదృష్టవశాత్తు పొగొట్టుకున్నా, చోరీకి గురైనా ఇక మానసిక వేదనే. కొంత మంది చరవాణి కంటే కూడా అందులో నిక్షిప్తం చేసుకున్న డేటా కోసం విలవిలలాడుతుంటారు. ప్రయాణాలు, జనరద్దీలో పొరపాటున జారిపోవడం, దొంగలు అపహరించడం వంటి సంఘటనలు ఎదురువుతున్నాయి. పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా తేలిగ్గా తీసుకుంటున్నారు. దొరికితే ఇస్తామంటూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పల్నాడు పోలీసులు ఇలాంటి చరవాణుల జాడ పసిగట్టి బాధితులకు చేర్చేందుకు ఓ వెబ్‌సైట్‌ అందుబాటులోకి తెచ్చారు. కేంద్ర ప్రభుత్వ టెలికాం మంత్రిత్వ శాఖ సహకారంతో సెంట్రల్‌ ఎక్విప్మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌  www.ceir.gov.in  అనే వెబ్‌సైట్‌ ద్వారా పల్నాడు జిల్లాలో పోయిన, పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకుని ప్రజలకు అందించేందుకు పోలీసు శాఖ శ్రీకారం చుట్టింది. చరవాణి పని చేస్తుంటే 24 గంటల వ్యవధిలో వెతికి పట్టుకుంటారు. చరవాణిలోని వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కాకుండా స్తంభింపజేస్తారు.

బాధితులు చేయాల్సింది ఇలా..

బాధితులు ముందుగా వారికి సంబంధించిన పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి.www.ceir.gov.in అనే వెబ్‌సైట్ లో లాగిన్‌ కావాలి. అందులో రిక్వెస్ట్‌ ఫర్‌ బ్లాకింగ్‌ లాప్ట్‌ /స్టోలెన్‌ అనే లింక్‌ పై క్లిక్‌ చేసి, చరవాణి నెంబరు, ఐఎంఈఐ నెంబర్‌, కంపెనీ పేరు, మోడల్‌, చరవాణి కొనుగోలు రసీదు అప్‌ లోడ్‌ చేయాలి. చరవాణి ఏ రోజు, ఎక్కడ పోయిందన్న చిరునామాతో పాటు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారు పేరు, చిరునామా, గుర్తింపు కార్డు (ఆధార్‌, ఓటర్‌ ఐడీ, పాన్‌, ఇతర ప్రభుత్వ గుర్తింపు పొందినవి) ఈ మెయిల్‌ ఐడీ, ఓటీపీ కోసం మరో చరవాణి నంబర్‌ ఇవ్వాలి. ఈ ప్రక్రియ అయ్యాక ఒక ఐడీ నెంబర్‌ వస్తుంది. దీంతో సంబంధిత ఐడీ చరవాణి స్టేటస్‌ తెలుసుకోవచ్చు. ఈ సీఈఐఆర్‌ వ్యవస్థతో పోయిన ఏ కంపెనీ చరవాణినైనా 24 గంటల్లోపు పని చేయకుండా చేయవచ్చు. చరవాణి దొరికిన తర్వాత వినియోగదారు అదే వెబ్‌సైట్ లోకి వెళ్లి అక్‌ /ఫౌండ్‌ మొబైల్‌ అనే లింక్‌పై క్లిక్‌ చేసి, ఐడీ నమోదు చేయగానే ఫోన్‌ అన్‌ బ్లాక్‌ అవుతుంది.


సద్వినియోగం చేసుకోవాలి

చరవాణి పోయిన వెంటనే వారి పరిధిలోని పోలీసులకు సమాచారం అందించి సీఈఐఆర్‌ అప్లికేషన్‌ను సద్వినియోగం చేసుకోవాలి. చరవాణి వినియోగిస్తున్న వారికి సీఐఈఆర్‌ వెబ్‌సైట్‌ గురించి తెలిసేలా పోలీసు అధికారులు, సిబ్బంది అవగాహన కల్పిస్తారు. 24 గంటల్లో వెతికి పట్టుకోవచ్చు. వ్యక్తిగత సమాచారం (డేటా) దుర్వినియోగం కాకుండా బ్లాక్‌ చేసుకోవచ్చు. పల్నాడు ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.

వై.రవిశంకర్‌రెడ్డి, ఎస్పీ, పల్నాడు జిల్లా


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని