logo

పోలీసు.. వైకాపాకు వత్తాసు

సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్‌పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్‌పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది.

Published : 18 Apr 2024 05:06 IST

అధికార పార్టీ నేతలకు మేలు చేసేలా నిర్ణయాలు
ఎంసీసీ బృందాలపై విమర్శలు
సీఐ.. ఎస్సైలకు  చెక్‌పోస్టు విధులు

ఈనాడు-బాపట్ల: సాధారణంగా ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసే తనిఖీ కేంద్రాలు(చెక్‌పోస్టులు) వద్ద ప్రత్యేకంగా సిబ్బందికి విధులు కేటాయిస్తారు. కానీ జిల్లాలో పోలీసుస్టేషన్లలో ఉండాల్సిన సీఐ, ఎస్సైలకు చెక్‌పోస్టు డ్యూటీలకు పంపడం చర్చనీయాంశమవుతుంది. వారికి రోజు మార్చి రోజు ఆ డ్యూటీలు వేయడంతో స్టేషన్‌ పరిధిలో జరిగే ఘటనలపై వారు దృష్టిసారించలేకపోతున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గతంలోనే పోలీసు ఉన్నతాధికారులు చెక్‌పోస్టుల వద్ద పహారా కోసం అధికారులు, సిబ్బందిని ప్రత్యేకంగా నియమించారు. వారిని కాదని శాంతిభద్రతల విభాగంలో ఉండే పోలీసుల్ని పంపడంపై విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో లా అండ్‌ ఆర్డర్‌లో పని చేసే రెగ్యులర్‌ ఎస్సై, సీఐలను రోజు మార్చి రోజు చెక్‌పోస్టు డ్యూటీలకు పంపుతున్నారు. ఇదే అదనుగా ఆయా స్టేషన్ల పరిధిలో అధికారులు లేకుండా చూసి కొందరు వైకాపా అభ్యర్థులు ఓటర్లకు తాయిలాలు పంపిణీ చేస్తున్నారని తెలిసింది. ఒకవేళ ఎవరైనా తాయిలాలు పంపిణీ చేస్తున్నారని స్టేషన్‌కు సమాచారమిచ్చినా ఎస్సై, సీఐలు లేరని చెప్పి పంపిణీ క్రతువు ముగిశాక ఆలస్యంగా చేరుకునే ప్రమాదం లేకపోలేదు. ఒక పథకం ప్రకారం వ్యూహాత్మకంగానే లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులు ప్రత్యేకించి ఆయా స్టేషన్ల సీఐ, ఎస్సైలకు ఈ డ్యూటీలు వేయడం గమనార్హం. ఇలా చేయడం అంటే కొందరు అభ్యర్థులకు మేలు చేయటమేనని వినికిడి. ఇప్పటికే జిల్లాలో కొందరి పోలీసుల పనితీరుపై అనేక విమర్శలు వస్తున్నాయి. అయినా తీరు మార్చుకోవడం లేదు. ఆ మధ్య బల్లికురవ ఎస్సై స్టేషన్‌లోనే అధికార వైకాపా నాయకులతో శాలువా కప్పించుకున్నారు. దీన్నిబట్టి అధికార వైకాపాతో పోలీసులు ఎలా అంటకాగుతున్నారో ఆ ఉదంతం చెప్పకనే చెబుతోంది.

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారా? లేదా? ఏమైనా ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారా? ప్రచారాలకు వినియోగించే వాహనాలకు అనుమతులు ఉన్నాయా లేవా అనేవి పరిశీలించడానికి ఎంసీసీ బృందాలు ఉన్నాయి. ఆ బృందాల్లో పోలీసులు ఉంటారు. ఎవరైనా తాయిలాలు పంపిణీ చేసినా, వాహనాలు అనుమతులు తీసుకోకుండా ప్రచారం చేస్తున్నా వాటిని గుర్తించి సీజ్‌ చేయాల్సింది ఎంసీసీ బృందాలే. అయినా ఇటీవల పర్చూరు నియోజకవర్గం పూనూరులో ఓ ఆటోకు ఫ్లెక్సీ ఉందని దానికి అనుమతులు ఉన్నాయోలేవో పరిశీలించి చర్యలు తీసుకుంటామని ఆ వాహనాన్ని సీజ్‌ చేయాలని ఎంసీసీ బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనధికార ఆటోను గుర్తించి కూడా పక్కన పెట్టించకుండా వాహనాన్ని వదిలేసి పోలీసులకు ఫిర్యాదు చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది అధికార పార్టీకి సంబంధించిన ఆటో కావడం వల్లే ఎంసీసీ బృందం దాన్ని ఆపకుండా మొక్కుబడిగా పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. పోలీసుల నుంచి ఎంసీసీ బృందాల వరకు అధికార వైకాపా వారి విషయంలో చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వైఖరిపై తెదేపా జిల్లా అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు రాష్ట్ర ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధమవుతున్నారు. తాజాగా అద్దంకి నియోజకవర్గం మేదరమెట్లలో కూడా తెదేపా సానుభూతిపరుడి ఇంట్లో డబ్బుల కట్టలు ఉన్నాయని పోలీసులు వచ్చి హడావుడి చేశారు. విపక్షాలను అణగదొక్కటమే లక్ష్యంగా పోలీసులు తీరు ఉందని తెదేపా వర్గాలు ఆరోపించాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని