icon icon icon
icon icon icon

Chandrababu: మ్యానిఫెస్టో మీ ముందుపెట్టాం.. ఆశీర్వదించండి: ప్రజలకు చంద్రబాబు విజ్ఞప్తి

 ‘రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే మ్యానిఫెస్టోను మీ ముందు పెట్టాం. తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.

Updated : 30 Apr 2024 16:44 IST

అమరావతి: ‘రాష్ట్ర ప్రజల సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే మ్యానిఫెస్టోను మీ ముందు పెట్టాం.  తెదేపా, భాజపా, జనసేన అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించండి’ అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. కూటమి మ్యానిఫెస్టో విడుదల సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పథకాలకు ఎక్కడినుంచి నిధులు వస్తాయని అంటున్నారు. జగన్‌ ఎక్కడి నుంచి తెచ్చారు.. సాక్షి నుంచి తెచ్చారా? భారతి సిమెంట్‌ అమ్మి తెచ్చారా? 2019లో వనరులు సమర్థవంతంగా వినియోగించుకొని సంపద సృష్టించాం. ఆరోజు వచ్చిన కియా మోటార్స్‌ ఉదాహరణగా తీసుకోండి. గొల్లపల్లి రిజర్వాయర్‌ కట్టి కియా మోటార్స్‌ ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు 12 లక్షల కార్లు ఉత్పత్తి అయి ప్రపంచం మొత్తం తిరుగుతున్నాయి. 12వేల మంది ప్రత్యక్షంగా పనిచేస్తున్నారు. దాదాపు 30వేల కుటుంబాలు ఉపాధి పొందుతున్నాయి. ప్రభుత్వానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్ల ఆదాయం వస్తోంది. ఆ డబ్బులతో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాం. ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ అయినా వచ్చిందా? 

అమరావతిలో రూ.3 లక్షల కోట్ల ఆస్తి ఆవిరి..

అమరావతిలో రూ.3 లక్షల కోట్ల ప్రజల ఆస్తి ఆవిరి అయిపోయింది. వైకాపా వచ్చాక రూ.13 లక్షల కోట్లు అప్పు చేశారు. దానికి వడ్డీ కట్టాలి. వైకాపా అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, విధ్వంసం వల్ల రాష్ట్రం సర్వనాశనమైంది. 1994- 1995లో ఉమ్మడి రాష్ట్రంలో మూడు నెలలకు ఓసారి జీతాలిచ్చే పరిస్థితి ఉండేది. సంపద సృష్టించాం.. ప్రజల ఆదాయం పెంచాం. 2004 కల్లా మిగులు బడ్జెట్‌ తెచ్చాం. మూడు పార్టీలకు కమిట్‌మెంట్‌ ఉంది.

అందరూ కలిసి జగన్‌ను బస్‌ డ్రైవర్‌ సీట్లో కూర్చోబెట్టారు. కానీ, రివర్స్‌లో వెళ్లాడు. డ్రైవింగ్‌ రానివారు రివర్స్‌లో వెళ్తే ఏమవుతుందో ఈ రాష్ట్రంలో అదే జరిగింది. బుద్ధి ఉన్నవారు ఎవరైనా రివర్స్‌ టెండరింగ్‌ పెడతారా? కమిట్‌ మెంట్‌ లేని రాజకీయాలతో ఈ రాష్ట్రం నాశనమైంది. రాష్ట్ర విభజన సమయంలో మనకు, తెలంగాణకు తలసరి ఆదాయంలో తేడా రూ.35వేలు. నేను ఐదేళ్లు కష్టపడి రూ.27వేలకు తగ్గించా. అక్కడ జనాభా తక్కువ.. ఆదాయం ఎక్కువ. ఇక్కడ జనాభా ఎక్కువ.. ఆదాయం తక్కువ. తలసరి ఆదాయం పెంచాలంటే చాలా ఎఫర్ట్‌ పెట్టాలి. ఇప్పుడు తెలంగాణకు మనకు తలసరి ఆదాయంలో తేడా రూ.45 వేలకు చేరింది. ప్రజలకు ఆదాయం లేకపోతే ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది. సంపద సృష్టించడం.. పేదలకు పంచడం మాకు తెలుసు’’ అని చంద్రబాబు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img