logo

సమస్యలు విలీనమై.. బడికి దూరమై..

పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు.

Published : 19 Apr 2024 06:08 IST

ప్రైవేటు బాట పడుతున్న బడి పిల్లలు
పేద విద్యార్థులకు అందుబాటులో లేని పాఠశాలలు
సుదూరాలకు పంపలేకపోతున్న తల్లిదండ్రులు
ఈనాడు-బాపట్ల, న్యూస్‌టుడే - వేమూరు, కొల్లూరు

3, 4, 5 తరగతుల పిల్లలకు సబ్జెక్టు టీచర్లతో బోధన చేయించి పాఠశాల విద్యలో నాణ్యతను పెôచుతాం.

పాఠశాలల విలీనం సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ చెప్పిన మాటలివి.


పాఠశాలల విలీనం వల్ల లాభం లేకపోగా టీచర్లకు, పిల్లలకు బాగా అన్యాయం జరిగింది. కొందరు టీచర్లు దూరాన ఉన్న ఉన్నత పాఠశాలలకు వెళ్లలేక పదోన్నతులు వదులుకోవడంతో నష్టపోయారు. అదేవిధంగా పిల్లల పరంగా చూస్తే సర్కారీ బడులకు దూరమయ్యారు. అందుబాటులో బడి లేక  ప్రైవేటు పాఠశాలలను ఆశ్రయించాల్సి రావడంతో విద్యార్థుల తల్లిదండ్రుల జేబు గుల్లవుతుంది. ప్రైమరీలో ప్రవేశాలు తగ్గటంతో స్కూళ్లు మూతపడే ప్రమాదం ఏర్పడింది. విలీనం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని ఉపాధ్యాయవర్గాలు చెబుతున్న మాట.


పాఠశాలల విలీనం పేరుతో కాలనీలో ఉన్న స్కూల్‌ను తీసుకెళ్లి ఎక్కడో సుదూరాన ఉన్న ఉన్నత పాఠశాలలో విలీనం చేయడంతో చిన్న పిల్లల్ని అంత సుదూరాలకు పంపలేమని తల్లిదండ్రులు తమ పిల్లల్ని సమీపంలో ఉన్న ప్రైవేటు స్కూళ్లకు పంపుతున్నారు. విలీనంతో ప్రవేశాల సంఖ్య బాగా తగ్గింది. నాణ్యమైన బోధన అటకెక్కింది. ప్రభుత్వం చెప్పినట్లు సబ్జెక్టు టీచర్లు సరిపడా లేక చివరకు ప్రాథమిక పాఠశాలల నుంచి డిప్యూటేషన్‌పై హైస్కూళ్లకు తీసుకెళ్లి వారితోనే బోధన చేయిస్తున్నారు. దీంతో విలీనానికి అర్థం లేకుండా పోయింది. 30 వేల మంది ఉపాధ్యాయులకు పదోన్నతులు వస్తాయని చెప్పి 6-7 వేల మందికే పరిమితం చేశారు. కొందరు ప్రైమరీ టీచర్లు పదోన్నతుల కోసం ఎక్కడో ఉన్న ఉన్నత పాఠశాలకు వెళ్లడానికి ఇష్టపడక పదోన్నతులు సైతం వదులుకున్నారు. జిల్లాలో పాఠశాలల విలీనం ఎన్నో కష్టాలు తెచ్చిపెట్టింది.


వేమూరు మండలంలో జంపని 8వ వార్డు పాఠశాల విద్యార్థులను స్థానిక ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడ నాడు-నేడు పనుల కారణంగా ఉన్న గదులు చాలక వారిని తిరిగి పూర్వ పాఠశాలకు పంపారు. వేమూరులో జేబీ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో అక్కడ ఉన్న 40మంది విద్యార్థులను ఉర్దూ పాఠశాలలో కూర్చోబెడుతున్నారు. అంటే  ఒకే పాఠశాల భవనం పైఅంతస్తులో ఉర్దూ పాఠశాల, కింద గదిలో జేబీ పాఠశాల నడుస్తుంది. ఇక్కడ ఇరుకు గదుల్లో విద్యార్థుల అవస్థలు అన్నీఇన్నీ కావు. ఇదిలా ఉంటే జేబీ పాఠశాల విద్యార్థులు అంబేడ్కర్‌నగర్‌ నుంచి రైలు పట్టాలు దాటి ఇవతలి వైపునకు రావాలి.

వేమూరు ఉర్దూ పాఠశాలలో గదులు చాలక ఇదీ పరిస్థితి


కాలనీలో ఉన్న స్కూళ్లను కాదని..

ఉన్నత పాఠశాలకు 3 కి.మీ. లోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3, 4, 5 తరగతుల విద్యార్థుల్ని ఉన్నత పాఠశాలల్లో చేర్పించడంతో చాలా వరకు ప్రాథమిక పాఠశాలల్లో 1, 2 తరగతులతోనే నెట్టుకొస్తున్నారు. ఆ తరగతుల్లో పిల్లల సంఖ్య బాగా తక్కువగా ఉండటం అంత తక్కువ మంది పిల్లలకు ఒకరిద్దరు టీచర్లు ఉండటంతో కాలనీల్లో ఉన్న ప్రైమరీ పాఠశాలలు చాలా వరకు మూతపడుతున్నాయి. కొన్నిచోట్ల ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల పిల్లలకు చదువులు చెప్పించలేమని నాణ్యమైన చదువులు సాధ్యపడవని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని గతేడాది ప్రైవేటు బడులకు పంపారు. మరోవైపు ప్రభుత్వం గత రెండుసార్లు పాఠశాలల పునఃప్రారంభానికే అమ్మఒడి తల్లుల ఖాతాల్లో జమ చేసింది. విద్యా సంవత్సరం ఆరంభంలోనే పిల్లలకు అమ్మఒడి వస్తోందని ప్రైవేటు పాఠశాలలు అమ్మఒడి సాయానికే తాము చదువు చెబుతామని మీ ఇంటికే బస్సులు పంపి పిల్లల్ని తీసుకెళతామని ఆకర్షించటం వంటివి చేయటంతో జిల్లా కేంద్రం బాపట్ల, రేపల్లె, చీరాల, కొల్లూరు, చెరుకుపల్లి తదితర ప్రాంతాల్లోని ప్రైవేటు పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించారు.

వేమూరు అంబేడ్కర్‌నగర్‌ నుంచి బడికి వెళ్లేందుకు పట్టాలు దాటుతున్న విద్యార్థులు


విలీనంతో పేద పిల్లలకు కలిగిన ఇబ్బందులివీ

పిట్టలవానిపాలెం మండలం చందోలులో ఎంపీపీ పాఠశాలలో ఉన్న 3, 4, 5 తరగతుల పిల్లల్ని దానికి కిలోమీటరున్నర దూరంలో ఉన్న నీలి బంగారయ్య జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయగా అంత దూరం పంపటానికి కొందరు తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అసలే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌ సమస్యలు వస్తున్నాయి. దీంతో చాలా మంది పిల్లల్ని చెరుకుపల్లి ప్రైవేటు కాన్వెంట్‌ల్లో చేర్పించి చదువులు చెప్పించుకుంటున్నారు కొందరు తల్లిదండ్రులు.


కొల్లూరు మండలం పోతార్లంక యూపీ పాఠశాల 6, 7 తరగతులకు చెందిన 20మంది పిల్లలను రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న దోనేపూడి ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అయితే వారు దోనేపూడి రావడానికి రవాణా సౌకర్యం సరిగా లేకపోవడంతో వారి తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. దీంతో తల్లిదండ్రులపై ఫీజుల రూపంలో భారం పెరిగింది.


ఇంటూరులో పంచాయతీ సమితి స్కూల్‌లో విలీనం తర్వాత ఒకే ఒక్క పిల్లోడు మిగలగా అతని కోసం స్కూల్‌ కొనసాగించలేక రికార్డుల్లో మాత్రం అక్కడే ఉన్నట్లు చూపి ఆ విద్యార్థిని సమీపంలో ఉన్న మరో పాఠశాలలో కూర్చొబెడుతున్నారు. అక్కడ ఉన్న టీచర్‌ను పెదపూడి పాఠశాలకు పంపారు.


వ్రేమూరు నియోజకవర్గం జంపని గ్రామంలో 8వ వార్డులో ప్రైమరీ స్కూల్‌ ఉంది. అక్కడ ఉన్న 3, 4, 5 తరగతుల పిల్లల్ని దానికి 500 మీటర్ల దూరంలో ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయగా 8వ వార్డుకు చెందిన పలువురు తల్లిదండ్రులు తమ చిన్నారుల్ని ఎవరి సాయం లేకుండా అంతదూరం పంపలేమని గతేడాది ఆ స్కూల్‌ నుంచి 10 మంది పిల్లల్ని కొల్లూరులో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. ఆ స్కూల్‌ ఈ పిల్లల్ని తీసుకెళ్లటానికి కాలనీకి నిత్యం బస్సు పంపుతోంది. అయితే విలీనం వల్ల ఉన్న ఊళ్లో స్కూల్‌ను కోల్పోవాల్సి వచ్చింది. ప్రైవేటు పాఠశాలలకు పంపినా వారొచ్చే వరకు బిక్కుబిక్కున గడుపుతున్నామని కొందరు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.


చీరాలకు సమీపంలోని వాడరేవులో ఉన్నత పాఠశాల, ప్రైమరీ పాఠశాల పక్క పక్కనే ఉన్నాయి. దీంతో ప్రైమరీ పాఠశాల్లో చదివే 3, 4, 5 తరగతుల పిల్లల్ని అక్కడే ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలోకి విలీనం చేయడంతో ఆ స్కూల్‌లో తరగతి గదులు సరిపడా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడ 600 మంది విద్యార్థులు ఉన్నారు. క్రీడల నిర్వహణకు క్రీడా ప్రాంగణం లేదు. మొత్తంగా ఇక్కడ ఇరుకిరుకు గదులతో పాఠశాల నిర్వహణ గందరగోళంగా మారింది.


అమృతలూరు మండలం తురిమెళ్ల  ప్రాథమిక పాఠశాలను నాడు-నేడులో భాగంగా రూ.అర కోటికి పైగా వెచ్చించి బాగా అభివృద్ధి చేశారు. ప్రైమరీ పిల్లల్ని స్థానికంగా ఉన్న జడ్పీ ఉన్నత పాఠశాలలో విలీనం చేయటంతో 1, 2 తరగతుల్లో కేవలం ఐదుగురు పిల్లలే మిగిలారు. దీంతో ఆ కాలనీలో స్కూల్‌ మూతపడే ప్రమాదం ఉందని కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. కాలనీ నుంచి 700-800 మీటర్ల దూరంలో ఉన్న ఉన్నత పాఠశాలకు పంపలేక తల్లిదండ్రులు అవస్థలు పడుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని