logo

శివాలెత్తిన ఎస్సై నాగశివారెడ్డి

ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్‌ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌ను అసభ్య పదజాలంతో దూషించారు.

Published : 24 Apr 2024 06:59 IST

పర్చూరు మండల తెదేపా అధ్యక్షుడు షంషుద్దీన్‌పై అనుచిత వ్యాఖ్యలు
ఆర్వోకి, ఎస్పీకి ఎమ్మెల్యే ఏలూరి ఫిర్యాదు
ఎస్పీ షోకాజ్‌ నోటీసు జారీ.. విధుల నుంచి తొలగింపు

ఎస్సై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎమ్మెల్యే ఏలూరి, తెదేపా నాయకులు

పర్చూరు (మార్టూరు), బాపట్ల, న్యూస్‌టుడే: ఎమ్మెల్యే ఏలూరి నామినేషన్‌ పత్రాలు అందజేసేందుకు మంగళవారం పర్చూరు ఆర్వో కార్యాలయానికి వచ్చిన సందర్భంలో అక్కడ విధుల్లో ఉన్న ఎస్సై నాగశివారెడ్డి తెదేపా పర్చూరు మండల అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌ను అసభ్య పదజాలంతో దూషించారు. ఇక్కడకు ఎందుకొచ్చావంటూ తొలుత షంషుద్దీన్‌ను ఎస్సై ప్రశ్నించడంతో ఇద్దరి మధ్య మాటామాట పెరిగి వివాదానికి  దారితీసింది. ప్రజలను బూతులు తిట్టే అధికారం ఎవరిచ్చారు.. రాజ్యాంగంలోని ప్రజల హక్కులను కాలరాస్తారా.. తెదేపా కార్యకర్తలను దూషిస్తూ.. వైకాపా శ్రేణులకు ఏజెంటుగా పని చేస్తున్నారా.. అంటూ ఎస్సై నాగశివారెడ్డిని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నించారు. ఎస్సై దురుసు ప్రవర్తనపై ఆర్వో గంధం రవీందర్‌కి లిఖిత పూర్వకంగా లేఖ పంపారు. జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌కి ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయం తెలుసుకున్న తెదేపా, జనసేన, భాజపా శ్రేణులు భారీసంఖ్యలో తహసీల్దార్‌ కార్యాలయం వద్దకు చేరుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

విచారణకు ఎస్పీ ఆదేశం

తెదేపా నేతను అసభ్యంగా దూషించిన వ్యవహారంలో ఎస్సై నాగ శివారెడ్డిపై విచారణకు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఆదేశించారు. విచారణాధికారిగా బాపట్ల డీఎస్పీ సీహెచ్‌ మురళీకృష్ణను నియమించారు. ఎస్సైను పోలీసు ప్రధాన కార్యాలయానికి పిలిపించి వివరణ కోరారు. షోకాజ్‌ నోటీసు జారీ చేసి ఆర్వో కార్యాలయం వద్ద బందోబస్తు విధుల నుంచి తప్పించి అన్నంభొట్లవారిపాలెం చెక్‌పోస్టు విధులకు పంపుతూ ఎస్పీ ఆదేశాలు జారీచేశారు. బల్లికురవ ఎస్సైగా పని చేసిన సమయంలో నాగశివారెడ్డి స్టేషన్‌లో వైకాపా నాయకులతో సత్కారం అందుకోవడం, బల్లికురవలోని ఓ బడ్డీకొట్టులో మద్యం అమ్ముతున్నాడని ఓ వృద్ధుడ్ని కొట్టిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేయడం.. తదితర అంశాల నేపథ్యంలో అతడ్ని గతంలో జిల్లా ఎస్పీ వీఆర్‌కి పంపారు. ఈక్రమంలో పర్చూరు ఆర్వో కార్యాలయం వద్ద విధుల్లో ఉంటూ తెదేపా నాయకుడిపై అసభ్య పదజాలంతో దూషించడంతో ఎస్సై వ్యవహారశైలి మరోమారు వివాదాస్పదమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని