logo

వైకాపా పాలనలో బాదుడే.. బాదుడు

 పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి.

Published : 24 Apr 2024 07:09 IST

పొన్నూరు నియోజకవర్గ ప్రజలపై రూ.32.89 కోట్లు భారం

  • వైకాపా అధికారంలోకి వస్తే విద్యుత్తు బిల్లుల భారం తగ్గిస్తానని జగన్‌మోహన్‌రెడ్డి కోతలు కోశారు.
  • బాదుడే.. బాదుడు అంటూ అప్పటి తెదేపా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత వివిధ రకాల ఛార్జీల పేరుతో ప్రజలపై మోయలేని భారాన్ని మోపారు.

 పొన్నూరు, తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే

 పొన్నూరు నియోజకవర్గంలో సుమారు 55,275 విద్యుత్తు సర్వీసులు ఉన్నట్లు విద్యుత్తుశాఖ అధికారక గణాంకాలు వెల్లడించాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో కంటే యూనిట్లు తగ్గించడంతో పాటు సర్‌ఛార్జీ, ఇతర ఛార్జీలను కలిపి చెల్లించాలని బిల్లుల్లో పొందుపరిచారు. ప్రజలపై మోయలేని భారాన్ని వేశారు. నిరుపేద కుటుంబాలు బిల్లులు చెల్లించలేక నానా అవస్థలు పడ్డారు. అయిదేళ్లలో సుమారు రూ.32.89 కోట్లు భారాన్ని మోపినట్లు విద్యుత్తు శాఖ అధికారక లెక్కలు చెబుతున్నాయి. పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని వైకాపా నేతలు గొప్పలు చెబుతూ దొడ్డి దారిన ప్రజలపై భారాన్ని మోపడం పై విమర్శలు వెలువడుతున్నాయి.

నెలకు రూ.1.50 కోట్ల అదనపు భారం : తెనాలి నియోజకవర్గంలో ప్రస్తుతం మొత్తం విద్యుత్తు కనెక్షన్లు 1,32,139 కాగా ఇందుకు గాను ఈ నెల డిమాండ్‌ రూ.13.51 కోట్లు. తెదేపా ప్రభుత్వ హయాంతో పోల్చి చూస్తే ప్రతి నెల సుమారు రూ.1.50 కోట్ల అదనపు భారం ఖాయంగా ప్రజలపై పడింది. పట్టణంలోని ఓ ప్రైవేటు ఉద్యోగికి ఈ నెల విద్యుత్తు వినియోగానికి రూ.2285 చూపితే దానికి రూ.543 అదనపు ఛార్జీలు కలిపి మొత్తం బిల్లు రూ.2808 అయింది.

 తెనాలిలోని ఒక ప్రయివేటు పాఠశాల భవంతికి తెదేపా ప్రభుత్వ హయాంలో ప్రతి నెల సుమారు రూ.30 వేల నుంచి రూ.32 వేల విద్యుత్తు వాడక బిల్లు వచ్చేది. వైకాపా ప్రభుత్వ హయాంలో అదే బడి, అదే వాడకానికి ప్రతి నెల రూ.40 వేల నుంచి రూ.42 వేల బిల్లు వస్తోందని పర్యవేక్షకుడు వాపోయారు. విద్యుత్తు భారం పెరిగినా తాము వినియోగదారులపైనే వేస్తామని.. కానీ విద్యుత్తు నాణ్యత చాలా ముఖ్యమని గత కొన్నేళ్లుగా అది బాగోలేదని తెనాలిలోని ఒక పరిశ్రమ నిర్వాహక ప్రతినిధి తెలిపారు. విద్యుత్తు సరఫరాలో హెచ్చుతగ్గులు.. ఆకస్మిక విద్యుత్తు కోతలు, శని, ఆదివారాలు పవర్‌ హాలిడే అంటూ అప్పటికప్పుడు చెప్పడం వంటివి పరిశ్రమలను ఇబ్బంది పెట్టాయని, ఈ తీరు ఉత్పత్తులపై ప్రభావం చూపిందని ఆయన వివరించారు.

సమాధానం చెప్పలేదు : కాటూరి శ్రీనివాసరావు, ములుకుదురు

కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నా. తెదేపా అధికారంలో ఉన్నప్పుడు రూ.350 నుంచి రూ.500 లోపు విద్యుత్తు బిల్లులు చెల్లించా. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1200 నుంచి 1500 వరకు బిల్లులు కడుతున్నా. విద్యుత్తు బిల్లులు ఎక్కువ వస్తున్నాయని విద్యుత్తు శాఖ అధికారులకు ఫిర్యాదు చేశా. అధికారులు ఇంటి లోపల తనిఖీ చేసి పరికరాలు లేవని నిర్దారించారు. ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్లి పోయారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన అనంతరం ప్రజలపై అనేక విధలుగా భారం మోపారు.

భారమైన బిల్లులు : సయ్యద్‌ జిలాని, 25వ వార్డు

నేడు ఆదాయం తగ్గిపోయింది. ఖర్చులు బాగా పెరిగిపోయాయి. సామాన్యుడు జీవించలేని పరిస్థితి నెలకొంది. విద్యుత్తు బిల్లులు చెల్లించడం భారంగా మారింది. గతంలో రూ. 400 నుంచి రూ.500 లోపు విద్యుత్తు బిల్లులు చెల్లించా. ఇప్పుడు రూ. 1000 నుంచి రూ.1200 వస్తోంది. సంపాదనలో ఎక్కువ భాగం బిల్లులు చెల్లించాల్సిరావడంతో ఖర్చు భారం పెరగడంతో పొదుపు చేయలేకపోతున్నా.


గతంలో నెలకు రూ.200, ఇప్పుడు రూ.360

- షేక్‌. నూరాని, బాలాజీరావుపేట, తెనాలి

మా రెండు గదుల రేకుల షెడ్డులో రెంటు లైట్లు, రెండు ఫ్యాన్లు ఉన్నాయి. టీవీ కూడా లేదు. అప్పుడప్పుడు మిక్సీ వేస్తాం. గతంలో మాకు నెలకు విద్యుత్తు బిల్లు రూ.200కు లోపు వచ్చేది. కొన్నేళ్లుగా రూ.350 పైన వస్తోంది. మా వాడకం ఏమీ పెరగలేదు. బిల్లు ఇచ్చే అబ్బాయిని ఏంటి నాయనా, అడిగితే ఛార్జీలు పెరిగాయన్నాడు. అన్ని రకాలుగా ఖర్చులు పెరిగాయి కానీ ఆదాయాలు మాత్రం పెరగలేదు.


పెరుగుదల అధికంగా ఉంది

- జి.నారాయణరావు, అమరావతి కాలనీ సంక్షేమ

సంఘ అధ్యక్షుడు, విశ్రాంత ప్రిన్సిపల్‌ మేం గతం నుంచి త్రీ ఫేజ్‌ విద్యుత్తు వాడుతున్నాం. గతంలో నెలకు రూ.900 నుంచి రూ.1000 నడుమ బిల్లు వచ్చేది. నాలుగు సంవత్సరాలుగా రూ.1600 నుంచి రూ.2100 వరకు పెరుగుతూ వస్తున్నాయి. సంవత్సరానికి రూ.100 వరకు పెంచితే అన్నింటి ధరలు పెరుగుతున్నాయి, కరెంట్ ధర కూడా పెరుగుతుంది అనుకునే వారం. కాని ఇలా అధికంగా పెరగటం మాత్రం సరికాదు. అందరికీ ఇబ్బందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని