logo
Published : 25 Jun 2022 02:04 IST

ఇంటింటా.. సౌర విద్యుత్తు ఉత్పత్తి

 స్త్రీనిధి ద్వారా ఏర్పాటుకు సన్నాహాలు
పద్దెనిమిది మండలాలకు 1000 యూనిట్లు
న్యూస్‌టుడే, తాండూరుగ్రామీణ

ఇంటింటిలో సౌర విద్యుత్‌ ఉత్పత్తి చేయనున్నారు. తొలిసారిగా ప్రారంభించనున్న ఈ ప్రక్రియలో ఆర్థికభారం లేకుండా రాయితీలు, రుణాలు అందించి ప్రోత్సహించనున్నారు. గృహ అవసరాలకుపోనూ మిగులు కరెంట్‌ను ట్రాన్స్‌కోకు విక్రయించి ఆదాయం పొందే వెసులుబాటు కల్పించనున్నారు. జిల్లాలో కార్యాచరణపై ‘న్యూస్‌టుడే’ ప్రత్యేక కథనం.
గ్రామాలు, పట్టణాలు తేడా లేకుండా అన్నిచోట్ల విద్యుత్తు వినియోగం పెరిగింది. పరిశ్రమలు, కర్మాగారాలు, వ్యాపార సముదాయాలు, గృహ అవసరాలకు కరెంట్‌ తప్పనిసరి. పెరిగిన వినియోగంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై నెలనెలా బిల్లు భారంగా పరిణమిస్తోంది. దీనిని అధిగమించేందుకు సంగారెడ్డి జిల్లాలోని రెడ్‌కో సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో జిల్లాలో సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయనున్నారు. పద్దెనిమిది మండలాల్లో తొలివిడతగా వెయ్యి చోట్ల కరెంట్‌ ఉత్పత్తి చేసేందుకు ఖరారు చేశారు. లబ్ధిదారుల ఇంటిపై పలకలను అమర్చనున్నారు. వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే కరెంట్‌ను గృహ అవసరాలకు వినియోగించేలా ఏర్పాట్లు చేయనున్నారు. అవసరాలకు సరిపోయాక మిగులును విద్యుత్‌ ఉపకేంద్రాలకు అందించి ఒక్కో యూనిట్‌కు రూ.4.50 చొప్పున ఆదాయం పొందే వీలుంటుంది. దీంతో లబ్ధిదారులు నెలనెలా ట్రాన్స్‌కోకు చెల్లించే బిల్లు నుంచి ఉపశమనం లభించనుంది. దీనికి తోడు అదనంగా నెలనెలా ఆదాయం పొందే ఆస్కారముంటుంది. ఇక అంతరాయానికి, కోతలకు అడ్డుకట్టపడనుంది.

మహిళా సంఘాలకు ప్రాధాన్యం
యూనిట్ల మంజూరులో స్వయం సహాయక సంఘాల మహిళలకు తొలిప్రాధాన్యం ఇవ్వనున్నారు. వీటిల్లో నమోదైన సభ్యులకు యూనిట్లను కేటాయించనున్నారు. ఒక్కో యూనిట్‌ విలువ రూ.1.90 లక్షలు ఉండగా, ఇందులో రూ.60వేలు రాయితీ వర్తింపజేయనున్నారు. మిగిలిన రూ.1.30 లక్షలను స్త్రీనిధి ద్వారా రుణం మంజూరు చేయనున్నారు. దీనికి సంబంధించి అరవై నెలల వాయిదాలు చెల్లించాల్సి ఉంటుంది. సొంత ఇల్లు ఉన్న మహిళలకు యూనిట్లు అందించనున్నారు. అనంతరం మిగతా వారికి మంజూరు చేయాలని అధికారులు నిర్ణయించారు.
27 నుంచి దరఖాస్తులు: యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న మహిళలు ఈనెల 27వ తేదీ నుంచి మహిళా సమాఖ్య కార్యాలయాలు, సీసీలు, ఏపీఎంలకు దరఖాస్తులను సమర్పించాలని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. డ్వాక్రా సభ్యురాలి ఫొటో, ఆధార్‌, బ్యాంకు ఖాతా నకలు ప్రతులను దరఖాస్తుతో జత చేయాలని సూచించారు. వీటిని పరిశీలించి సొంతిల్లున్న మహిళల ఇంటిపై రెడ్‌కో సంస్థ ద్వారా యూనిట్లను జులైలో ఏర్పాటు చేయిస్తామన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి: తుమ్మల వేణు, జిల్లా రీజినల్‌ మేనేజరు, స్త్రీనిధి
స్వయం సహాయక సంఘాల్లోని మహిళలు సౌర విద్యుత్‌ ఉత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసుకొని రాయితీని సద్వినియోగం చేసుకోవాలి. కరెంటను ఉచితంగా పొందడంతోపాటు మిగిలిన దానిని ట్రాన్స్‌కోకు అందించడం ద్వారా నెలనెలా ఆదాయం పొందవచ్చు. సొంత ఇల్లు ఉన్న మహిళలు దరఖాస్తు సమర్పిస్తే సిబ్బంది వచ్చి సౌర పలకలు సామగ్రిని అమర్చుతారు.


జిల్లాలో ఇలా
స్వయం సహాయక సంఘాలు: 15,766
నమోదైన సభ్యులు:1,69,706
యూనిట్ల విలువ: రూ.19 కోట్లు
రాయితీ: రూ.6 కోట్లు

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని