logo

పోచారంలో స్వగృహ ఇళ్లు కొనండి

హెచ్‌ఎండీఏ అధికారులు ఓ వైపు పోచారం, బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు లాటరీ తీస్తున్నారు. మరోవైపు ఇళ్లు కొనేందుకు పేర్లు ఇవ్వాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌.. ఉద్యోగులను ఆదేశించారు.

Updated : 28 Jun 2022 08:08 IST

అధికారులకు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆదేశం

మరోవైపు అవే గృహాలకు హెచ్‌ఎండీఏ లాటరీ

ఈనాడు, హైదరాబాద్‌

హెచ్‌ఎండీఏ అధికారులు ఓ వైపు పోచారం, బండ్లగూడలోని రాజీవ్‌ స్వగృహ ఇళ్లకు లాటరీ తీస్తున్నారు. మరోవైపు ఇళ్లు కొనేందుకు పేర్లు ఇవ్వాలంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేష్‌కుమార్‌.. ఉద్యోగులను ఆదేశించారు. దీనిపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. బహిరంగ నోటిఫికేషన్‌ ద్వారా పౌరుల నుంచి హెచ్‌ఎండీఏ వేలాదిగా దరఖాస్తులు స్వీకరించింది. మరోవైపు ఇళ్లు కొనేందుకు ముందుకురావాలని బల్దియా ఉన్నతాధికారులు యంత్రాంగాన్ని ఆదేశిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అధికారుల ద్వంద్వ వైఖరిపై దరఖాస్తుదారుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోటెత్తిన దరఖాస్తులు

రాజీవ్‌ స్వగృహ సద్భావన పేరుతో 2010లో ఘట్‌కేసర్‌ మండలం పరిధిలోని పోచారంలో, ఉప్పల్‌ మండలంలోని నాగోల్‌లో అప్పటి ప్రభుత్వం బహుళ అంతస్తుల సముదాయాలను నిర్మించింది. వేర్వేరు కారణాలతో నిర్మాణాలు నిరుపయోగంగా పడి ఉన్నాయి. వాటికి రంగులద్ది నిర్ణీత ధరతో ప్రజలకు విక్రయించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హెచ్‌ఎండీఏ మే మొదటివారంలో ఇళ్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చంటూ బహిరంగ ప్రకటన చేసింది. మార్కెట్‌తో పోలిస్తే తక్కువ ధరకు వస్తున్నందన.. పౌరులు పెద్దఎత్తున ఒక్కో దరఖాస్తుకు రూ.1000 చెల్లించి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ముందుకొచ్చారు. బండ్లగూడ, పోచారంలలోని మొత్తం 1971 ఫ్లాట్లకు 39 వేల మంది దరఖాస్తు చేశారు. లబ్ధిదారుల ఎంపిక కోసం సోమవారమే హెచ్‌ఎండీఏ, రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ సంయుక్తంగా బహిరంగ లాటరీ విధానాన్ని ప్రారంభించాయి. దాదాపు అన్ని ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక పూర్తయింది.

ఎవరైనా తీసుకోకపోతే..

‘‘లాటరీ పద్ధతిలో ఇళ్లు దక్కించుకున్న వ్యక్తుల్లో పలువురు కొనుగోలుకు ఆసక్తి చూపరు. అప్పుడు ఇళ్లు మిగులుతాయి. అలా కాకుండా ఉండేందుకు ప్రభుత్వ ఉన్నతాధికారి ఉద్యోగులను సిద్ధం చేయాలని పది రోజుల కిందట జీహెచ్‌ఎంసీని ఆదేశించారు. ఆమేరకు బల్దియా ఉద్యోగుల అభిప్రాయం కోరింది. ఐదుగురు ఆసక్తి చూపారు. వాళ్ల పేర్లను జీహెచ్‌ఎంసీ ప్రభుత్వానికి పంపింది. కేవలం ఐదుగురి పేర్లు ఇవ్వడమేంటని ప్రభుత్వ ఉన్నతాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం.. విభాగాధిపతులంతా ఇళ్లు కొనేలా ఉద్యోగులను ప్రోత్సహించాలని జీహెచ్‌ఎంసీ అన్ని విభాగాలకు సర్క్యులర్‌ పంపిందని’’ ఓ ఉన్నతాధికారి ‘ఈనాడు’కు తెలిపారు. ఇళ్లు కొనాలటూ ఆధార్‌ కార్డుల వివరాలూ అడుగుతున్నారని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని