logo

రూ.1.3 లక్షలకు నకిలీ ఇంజినీరింగ్‌ పట్టా

బీటెక్‌లో 11 బ్యాక్‌లాగ్‌లున్న వ్యక్తి ఎలాగైనా అమెరికాకు వెళ్లి సంపాదించాలనుకున్నాడు. మరో వ్యక్తి ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరిట నకిలీ ఇంజినీరింగ్‌ పట్టా కొనుగోలు చేసి పోలీసులకు చిక్కాడు. మరో నిందితుడు అమెరికాలో ఉన్నాడు.

Updated : 11 Aug 2022 05:06 IST

ఒకరి అరెస్టు, అమెరికాలో మరో నిందితుడు


 దయాకర్‌రెడ్డి                            ముద్దం స్వామి

ఈనాడు, హైదరాబాద్‌; నాగోలు, న్యూస్‌టుడే: బీటెక్‌లో 11 బ్యాక్‌లాగ్‌లున్న వ్యక్తి ఎలాగైనా అమెరికాకు వెళ్లి సంపాదించాలనుకున్నాడు. మరో వ్యక్తి ద్వారా ఉస్మానియా విశ్వవిద్యాలయం పేరిట నకిలీ ఇంజినీరింగ్‌ పట్టా కొనుగోలు చేసి పోలీసులకు చిక్కాడు. మరో నిందితుడు అమెరికాలో ఉన్నాడు. వివరాలను రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేశ్‌ భగవత్‌ విలేకర్లకు బుధవారం వెల్లడించారు. నాచారంలో ఉంటున్న జంగా దయాకర్‌రెడ్డి(25) 2018లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసినా.. 11 బ్యాక్‌లాగ్‌లు ఉన్నాయి. అమెరికాలో ఉద్యోగం చేస్తూ సంపాదించాలనుకున్న తన కల నెరవేర్చుకునేందుకు నకిలీ ధ్రువపత్రాలు కొనాలనుకున్నాడు. మిత్రుల ద్వారా వనస్థలిపురానికి చెందిన వీసా స్లాట్‌ బుకింగ్‌ ఏజెంటు ముద్దం స్వామిని ఫోన్‌లో సంప్రదించగా.. రూ.1.5 లక్షలిస్తే ఓయూ ఇంజినీరింగ్‌ పట్టా ఇప్పిస్తానని చెప్పాడు. గతేడాది ఆగస్టులో దయాకర్‌ రూ.1.3 లక్షల్ని ఫోన్‌పేలో పంపాడు. కొన్నిరోజుల అనంతరం సర్టిఫికెట్‌ కోసం సంప్రదించగా యూఎస్‌ఏ వెళ్లానని చెప్పిన స్వామి.. క్యాబ్‌ డ్రైవర్‌ ద్వారా ఇంటికి నేరుగా పట్టా పంపించాడు. ఈ నకిలీ సర్టిఫికెట్‌తో దయాకర్‌ మాస్టర్స్‌ ఇన్‌ బిజినెస్‌ అనలిటిక్స్‌లో చదివేందుకు అమెరికాలోని లూయిస్‌, డేటన్‌ యూనివర్సిటీల్లో దరఖాస్తు చేసుకోగా రెండు చోట్లా ప్రవేశం వచ్చింది. వీసా కోసం ముంబయి, దిల్లీ, హైదరాబాద్‌ కాన్సులేట్‌లో సంప్రదించగా అన్నిచోట్లా తిరస్కరణకు గురైంది.

వాటర్‌ మార్క్స్‌తో సహా..

ఇదే సమయంలో ఓయూ పేరుతో తయారు చేసిన నకిలీ ధ్రువపత్రాలతో ముద్దం స్వామి అమెరికాలోని పేస్‌ యూనివర్సిటీలో ఎంబీఏ చదువుతున్నట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఠాణాలో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా స్వామి ఇంకా ఎవరెవరికి నకిలీ పట్టాలు ఇచ్చాడని ఆరా తీసిన ఎస్‌వోటీ ఎల్బీనగర్‌, నాచారం పోలీసులు దయాకర్‌ను అరెస్టు చేశారు. ‘‘ధ్రువపత్రాలపై వాటర్‌ మార్క్‌ సైతం ఉన్నాయి. ఓయూలో తయారీ సందర్భంగా తిరస్కరించిన వాటితో సర్టిఫికెట్లు తయారు చేశారా? అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నాం’’ అని మహేష్‌ భగవత్‌ తెలిపారు. ఎస్‌వోటీ డీసీపీ మురళీధర్‌, ఎల్బీనగర్‌ ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ సుధాకర్‌ను కమిషనర్‌ అభినందించి రికార్డు ఇచ్చారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని