logo

హెచ్‌సీయూలో చీటింగ్‌!

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రంలో నకిలీ ప్రిస్క్రిప్షన్లతో రూ.లక్షలు స్వాహా చేసినట్లు తేలినా కనీస చర్యలు కొరవడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల తీరుపై వర్సిటీ వర్గాలలో విమర్శలు వినిపిస్తున్నాయి.

Published : 28 Sep 2022 02:39 IST

ఆరోగ్య కేంద్రంలో 65 నకిలీ ప్రిస్కిప్షన్లతో రూ.లక్షలు స్వాహా

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలోని ఆరోగ్య కేంద్రంలో నకిలీ ప్రిస్క్రిప్షన్లతో రూ.లక్షలు స్వాహా చేసినట్లు తేలినా కనీస చర్యలు కొరవడుతున్నాయి. దీనిపై ఉన్నతాధికారుల తీరుపై వర్సిటీ వర్గాలలో విమర్శలు వినిపిస్తున్నాయి.

లబ్ధిదారులకు తెలియకుండా.. ఆరోగ్య కేంద్రం అవినీతి బాగోతంలో నకిలీ ప్రిస్క్రిప్షన్లు(బిల్లులు) కీలకంగా మారాయి. వర్సిటీ ఉద్యోగులు, ఉద్యోగ విరమణ చేసిన వారి పేర్లు వాడుకుని నిధులు దారి మళ్లించినట్లు తెలుస్తోంది. ఇందుకు ఏకంగా 65 నకిలీ బిల్లులు సృష్టించారు. సంబంధిత వ్యక్తులకు తెలియకుండా వారు, కుటుంబ సభ్యుల పేరిట ఫార్మసీ-2 నుంచి ఔషధాలు తీసుకున్నట్లుగా చూపించారు. ప్రతిఒక్కరి పేరిట కనీసం రూ.3 వేలు మొదలుకుని రూ.17 వేల వరకు మందులు తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయా లబ్ధిదారులెవరూ ఆరోగ్య కేంద్రానికి రాకపోయినా నకిలీ బిల్లులు తయారు చేసినట్లు తెలిసింది.

కమిటీ వ్యవహారం.. అదొక రహస్యం.. వర్సిటీలోని ఫార్మసీ-2 తరఫున తీవ్ర, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉద్యోగులు, పింఛనుదారులు, వారి కుటుంబాలకు నెలవారీగా మందులు అందిస్తుంటారు. ఒక్కసారిగా నెలవారీ ఫార్మసీ బిల్లులు భారీగా పెరగడంతో ఉన్నతాధికారులకు అందిన సమాచారం మేరకు ఆరా తీసి విచారణ చేపట్టాలని నిర్ణయించారు. దీనిపై గతపాలక మండలి సమావేశంలో ఈసీ:188:2022:11 కింద చర్చించారు. విచారణకు కమిటీ వేశారు. తర్వాత పాలకమండలి సమావేశం నాటికి విచారణ కమిటీ నివేదిక ఇవ్వాలని పాలకమండలి సూచించింది. ఆ కమిటీలో సభ్యులెవరు..? ఎక్కడ విచారణ చేస్తోందన్నది ఇప్పటికీ రహస్యమే. ఈ నేపథ్యంలో కమిటీ విచారణ ఏమేరకు పారదర్శకంగా జరుగుతోందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ వ్యవహారంలో ఉన్నతాధికారుల తీరుపై ఇప్పటికే విమర్శలున్నాయి. అవినీతికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోకుండా లబ్ధిదారులకు ఇచ్చే మందులపై పరిమితి విధించడంపై ఉద్యోగులు, పింఛనుదారులు మండిపడుతున్నారు. మరోవైపు కమిటీ విచారణపై ప్రశ్నలు సంధిస్తున్నారు.


దుర్వినియోగం నిజమే: హెచ్‌సీయూ

రోగ్య కేంద్రంలో మందులు జారీలో కొన్నినెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులు గుర్తించినట్లు హెచ్‌సీయూ ప్రకటించింది. ఈమేరకు రిజిస్ట్రార్‌ దేవేశ్‌నిగమ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. అవినీతి జరగలేదంటూ సోమవారం ప్రకటన జారీ చేయగా.. ఆ బాగోతాన్ని కప్పిపుచ్చే వ్యవహారంపై ‘ఈనాడు’లో మంగళవారం వార్త ప్రచురితమైంది. ఎట్టకేలకు వర్సిటీ ఆరోగ్య కేంద్రంలో నిధుల దుర్వినియోగం జరిగినట్లు అంగీకరించింది. నిబంధనల ఉల్లంఘన, దుర్వినియోగం జరిగినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని రిజిస్ట్రార్‌ తెలిపారు. కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేస్తున్నామని, నివేదిక రాగానే తదుపరి పాలకమండలి సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts