logo

ఈత.. కడుపు కోత

చెరువులు, కుంటలు, క్వారీలు, నిర్మాణ అవసరాల కోసం తవ్విన గుంతల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా శివార్లలో తరచూ జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనల్లో 10 మంది విద్యార్థులు, చిన్నారులు మరణించారు.

Updated : 03 Oct 2022 06:31 IST

నీట మునిగి నగరంలో ఏటా 120 మందికిపైనే బలి
తెలంగాణలో గతేడాది 1636 మంది జల సమాధి
ఈనాడు- హైదరాబాద్‌

* 26 సెప్టెంబరు 2022: షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని సోలీపూర్‌ గ్రామ శివారులో వెంచర్‌లో తవ్విన భారీ గుంతల్లో నిలిచిన నీటిలో మునిగి ముగ్గురు చిన్నారుల మరణం.
* 28 సెప్టెంబరు 2022: మేడ్చల్‌ జిల్లా కీసర మండలం నాట్కాన్‌ చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ముగ్గురు డిప్లోమా విద్యార్థుల మరణం.
* 02 అక్టోబరు 2022: రంగారెడ్డి జిల్లా యాచారం మండలం గొల్లగూడ గ్రామ సమీపంలోని ఎర్రకుంటలో ఈత కొట్టేందుకు దిగి నలుగురు చిన్నారుల మృతి.

చెరువులు, కుంటలు, క్వారీలు, నిర్మాణ అవసరాల కోసం తవ్విన గుంతల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో ముఖ్యంగా శివార్లలో తరచూ జరుగుతున్న ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో మూడు ఘటనల్లో 10 మంది విద్యార్థులు, చిన్నారులు మరణించారు. ఇవే కాదు.. నగరంలో వెలుగులోకి రాని ఘటనలు మరెన్నో ఉంటున్నాయి. అడ్డగోలుగా తవ్వేస్తున్న గుంతలు, క్వారీల దగ్గర సరైన పర్యవేక్షణ లేకపోవడం ఒక కారణమైతే.. ఈత కొట్టాలన్న సరదా ప్రాణాల మీదకు తెస్తోంది. కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం, అవగాహన లేని చోట నీటిలోకి దిగడం విషాదం మిగులుస్తోంది.

విచ్చలవిడిగా తవ్వకాలు..!
నగరంలోని వివిధ ప్రాంతాలు, శివార్లలోని చెరువులు, కుంటలు, నీటి వనరుల్లో వివిధ అవసరాల కోసం విచ్చలవిడిగా తవ్వేస్తున్నారు. వీటిలో పెద్దపెద్ద గోతులు ఏర్పడుతున్నాయి. భారీ వర్షాలకు నీటితో కళకళలాడే సమయంలో ఈ గుంతలు కనిపించడంలేదు. నగర శివార్లలోని క్వారీలు వర్షాల సమయంలో నిండు కుండల్లా కనిపిస్తున్నాయి. నిట్ట నిలువుగా ఉండి ఒకేసారి లోతు పెరుగుతాయి. ఒడ్డునే ఉన్నామని భావిస్తున్న చిన్నారులు, యువకులు పది అడుగుల దూరంగా వెళ్లగానే మునిగిపోతున్నారు. వారిని కాపాడేందుకు వెళ్లి మరికొందరు మరణిస్తున్నారు. తాజాగా కీసర నాట్కాన్‌ చెరువు ఘటనే ఇందుకు ఉదాహరణ. లోతు తెలియక దిగిన ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఒకర్ని కాపాడబోయి ఇంకొకరు మరణించారు.

ఏటా 120 మందిపైనే..!
నగరంలో నీట మునిగిన ఘటనల్లో ఏటా సుమారు 120 మంది వరకూ ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. గతేడాది (2021) తెలంగాణ వ్యాప్తంగా నీటిలో మునిగిన ఘటనలు 1,606 నమోదయ్యాయి. ఇందులో 1,636 మంది మరణించారు. 2020లో 1320 మంది మరణించారు. నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనల్లో ఎక్కువ మంది యువత ఉండడం ఆందోళనకరం. ముఖ్యంగా 20 ఏళ్ల వయసులోపు వారు బలవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని