logo

కేసులుంటే.. ఉద్యోగం కష్టమే..!

ప్రస్తుతం పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. అలాగే పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం పొందాలంటే అభ్యర్థులకు ఏ పోలీస్‌ స్టేషన్లోనూ కేసు నమోదై ఉండదు.

Updated : 06 Dec 2022 09:23 IST

శ్వాసకోశ పరీక్ష చేస్తున్న పోలీసులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌, తాండూరు: ప్రస్తుతం పలు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వస్తున్నాయి. అలాగే పోలీస్‌ దేహదారుఢ్య పరీక్షలు మొదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగం పొందాలంటే అభ్యర్థులకు ఏ పోలీస్‌ స్టేషన్లోనూ కేసు నమోదై ఉండదు. ఆ విధంగా వారు క్రమశిక్షణతో మెలగాలి. గొడవలు జరిగితే కేసులు నమోదు చేస్తారు. చిన్న కేసు పెడితే ‘ఏమవుతుందిలే’ అని అనుకుంటే భవిష్యత్తులో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలపై ఆశ వదులు కోవాల్సిందేనని పోలీసులు చెబుతున్నారు.  

మద్యం తాగి చిక్కినా..

వాహనం నడుపుతూ మద్యం తాగి చిక్కితే.. కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తారు. ఈ క్రమంలో రూ.2,100 జరిమానా, మద్యం శాతం వంద దాటితే ఒకరోజు నుంచి వారం రోజుల వరకు జైలుశిక్ష విధిస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ పట్టుబడ్డా, డీజే శబ్దాలతో అర్ధరాత్రి ఇబ్బందులు కలిగించినా, మహిళలను వేధించినా, ఈ-పెట్టీ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేస్తున్నారు.  

* తాండూర్‌ ప్రాంతానికి చెందిన ఓ అభ్యర్థి గతంలో కానిస్టేబుల్‌ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఎస్‌బీ పోలీసుల విచారణలో అభ్యర్థిపై ఠాణాలో రెండు కేసులు ఉన్నట్లు తేలింది. కేసుల స్వరూపాన్ని పరిశీలించగా, రెండు కేసుల్లో కూడా సదరు అభ్యర్థి ఇతరులతో గొడవపడి కొట్టినట్లుగా నిర్థరించారు. ఇదే విషయాన్ని పేర్కొంటూ నివేదిక సమర్పించడంతో పోలీసు నియామక సంఘం అభ్యర్థిని పక్కన పెట్టింది.

* వికారాబాద్‌ ప్రాంతానికి చెందిన ఓ యువకునికి పోలీసు ఉద్యోగం వచ్చింది. విచారణలో అతనిపై కేసు ఉన్నట్లు గుర్తించారు. ఎలాగైనా రాజీ కుదుర్చుకుంటేనే ఉద్యోగం వస్తుందని, లేకుంటే అసాధ్యమని సలహా ఇవ్వడంతో నానా తంటాలు పడి కేసు రాజీ చేసుకున్నాడు. అయినా అతన్ని పోలీసు నియామక సంఘం అనర్హునిగా తేల్చింది. ఇలా జిల్లాలో 9 మంది అభ్యర్ధులకు ఉద్యోగాలు దక్కలేదు.

సామాజిక మాధ్యమాలతో జాగ్రత్త..

మహిళలను కించపర్చేలా అభ్యంతరకర పోస్టులను, ప్రజల మనోభావాలను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసినవారిపై కూడా కేసులు నమోదు చేస్తారు.


నిర్లక్ష్యంగా వ్యవహరించకండి
ఎన్‌.కోటిరెడ్డి, జిల్లా పోలీసు అధికారి

ప్రధానంగా యువత పోలీసు కేసులకు దూరంగా ఉండాలి. చిన్న తప్పే కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించి పోలీసు కేసు నమోదైతే భవిష్యత్తులో ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. పోలీస్‌ రికార్డుల్లోకి ఎక్కకుండా క్రమృశిక్షణతో మసులుకోవాలి. ఎలాంటి వివాదాలలో తలదూర్చక, పద్ధతిగా వ్యవహరిస్తే ఏ విధమైన ఇబ్బంది ఉండదు.  

Read latest Hyderabad News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని