logo

నీటి ట్యాంకర్లపై ఆరా.. రూ.కోటిన్నర ఆదా

జలమండలి అధికారులు ఇంటి దొంగల భరతం పట్టారు. తాగునీటి ఉచిత ట్యాంకర్లు రావడం లేదంటూ బస్తీవాసుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టి సిబ్బంది భరతం పట్టారు.

Published : 10 Dec 2022 03:22 IST

జలమండలిలో ఇంటి దొంగల భరతం

ఈనాడు, హైదరాబాద్‌: జలమండలి అధికారులు ఇంటి దొంగల భరతం పట్టారు. తాగునీటి ఉచిత ట్యాంకర్లు రావడం లేదంటూ బస్తీవాసుల నుంచి వస్తున్న ఫిర్యాదులపై దృష్టి పెట్టి సిబ్బంది భరతం పట్టారు. ఆ ట్యాంకర్లను దారి మళ్లించి హోటళ్లు, రెస్టారెంట్లకు విక్రయిస్తున్నట్టు తెలుసుకున్న ఎండీ దానకిశోర్‌ లెక్కలు తీయించారు. రోజుకు 500 ట్యాంకర్లను అమ్ముకుంటున్నారని లెక్కల్లో తేలింది. ఆసిబ్బందిపై చర్యలు తీసుకున్న అధికారులు నెలకు రూ.1.50 కోట్లు ఆదా చేశారు.

రోజుకు 1200 ట్యాంకర్లతో సరఫరా.. నగరం, శివారు ప్రాంతాల్లోని తాగునీటి పైప్‌లైన్‌ లేని ప్రాంతాలు, న్యాయవివాదాలున్న కాలనీలు, ఫిలింనగర్‌, సికింద్రాబాద్‌, మెహిదీపట్నం, చార్మినార్‌, బహుదూర్‌పురా, రహమత్‌నగర్‌ ప్రాంతాల్లోని బస్తీలకు జలమండలి అధికారులు రోజూ 1200 తాగునీటి ట్యాంకర్లను ఉచితంగా పంపుతున్నారు. వాస్తవానికి 700 ట్యాంకర్లు మాత్రమే ప్రజలకు చేరుతున్నాయి. మిగిలిన 500 ట్యాంకర్లను కిందిస్థాయి అధికారులు, సిబ్బంది దొంగ లెక్కలు రాసి అమ్మేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. రెండునెలల క్రితం ఒక బస్తీవాసులు జలమండలి ఎండీ దానకిశోర్‌ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లగా అంతర్గత విచారణ జరిగింది. రికార్డులు పరిశీలించి, కొందరు అధికారులను బస్తీలు, కాలనీలకు పంపించి ఉచిత ట్యాంకర్‌ వచ్చిందా? లేదా? అని ఆరా తీశారు. అలా అక్రమాలు బయటపడ్డాయి. దీంతో అక్రమాలకు చెక్‌పెట్టేందుకు ఉన్నతాధికారులు కార్యాచరణ రూపొందించారు. బస్తీలు, కాలనీలకు పైప్‌లైన్లు వేయడం ద్వారా ట్యాంకర్ల అవసరం లేకుండా చూడాలనుకుంటున్నారు. తద్వారా ఉచిత తాగునీటి పథకం వర్తించేలా చేయొచ్చంటున్నారు. రానురాను ట్యాంకర్ల సంఖ్యను తగ్గించనున్నామని అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని