logo

నాటు అదిరింది.. నగరం ఊగింది!

నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాట రాసిన చంద్రబోస్‌ చదివిన రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల పూర్వ విద్యార్థులు,  ఆయనతో కలిసి చదవడం గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.

Published : 14 Mar 2023 02:15 IST

అవార్డు ప్రకటనతో ఒక్కసారిగా ఆనందోత్సవాలు
ఉదయం నుంచే టీవీలకు అతుక్కుపోయిన జనం
ఈనాడు, హైదరాబాద్‌

హబ్సిగూడ: నాటునాటు పాట అవార్డు గెలుచుకోవడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పాట రాసిన చంద్రబోస్‌ చదివిన రామంతాపూర్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల పూర్వ విద్యార్థులు,  ఆయనతో కలిసి చదవడం గర్వంగా భావిస్తున్నామని పేర్కొన్నారు. ‘ఈ కళాశాలలో చంద్రబోస్‌ ఎలక్ట్రికల్‌ విభాగంలో 1986-1989 బ్యాచ్‌ విద్యార్థి. ఆ రోజుల్లో ఎస్‌ఎఫ్‌ఐ కార్యకలాపాల్లో పాల్గొంటూ పాటలు పాడేవాడు.  సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ సినిమా పాటలు వినసొంపుగా ఆలపించే వాడు’ అని స్నేహితులు వివరించారు.


మిన్నంటిన ‘ఆస్కార్‌’  సంబరాలు

తెలతెలవారుతుండగానే భాగ్యనగరం ‘నాటు..నాటు’ అంటూ ఊగిపోయింది. తెలుగు సినీ చరిత్రలో ఇంతవరకు ఎవరికీ సాధ్యం కాని ‘ఆస్కార్‌’ అవార్డు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలోని పాటకు దక్కడంతో చిన్నా పెద్దా  సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. లాస్‌ఏంజిల్స్‌ వేదికగా ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం అట్టహాసంగా జరుగుతున్న వైనాన్ని ఇక్కడి నుంచే లైవ్‌ ద్వారా వీక్షిస్తూ.. మన సినిమా వంతు ఎప్పుడొస్తుందా అని ఉత్సుకతతో ఎంతోమంది సోమవారం తెల్లవారుజాము నుంచే టీవీలకు అతుక్కుపోయారు. ప్రత్యక్ష ప్రసారాన్ని ఉత్కంఠగా వీక్షించారు. ఒక్కో కేటగిరిలో అవార్డులను ప్రకటిస్తుండగా అందరి ముఖాల్లో ఒక్కటే ఉత్కంఠ. ఆ భాగ్యం మనకు దక్కుతుందా..లేదా అని నిశ్శబ్దంగా ఉండిపోయారు. తప్పకుండా అవార్డు వస్తుందనే నమ్మకం ఉన్నప్పటికీ మిగతా అంతర్జాతీయ సినిమాలు కూడా పోటీలో ఉండటం వల్ల ఎక్కడో చిన్న సంశయం. క్షణాలు గడుస్తుండగా..ఇంతలో బెస్ట్‌ ఒరిజినల్‌ కేటగిరి కేరింతల నడుమ ప్రకటించారు. అవార్డు గోస్‌ టు ‘నాటు నాటు’ అనగానే లాస్‌ ఏంజిల్స్‌లో డాల్బీ థియేటర్‌ కరతాళ ధ్వనులతో దద్దరిల్లగా.. భాగ్యనగరం కూడా ఆనందంతో ఊగిపోయింది. కేరింతలు కొడుతూ.. విజిల్స్‌ వేస్తూ తమ ఆనందం వ్యక్తం చేశారు. తమ ఇంటికే అవార్డు వచ్చినంత సంతోషం వ్యక్తం చేశారు. టీవీల ముందు నాట్యం చేసి తమ ఉత్సాహాన్ని చాటుకున్నారు.  ఫేస్‌బుక్‌, ట్విటర్‌.. ఏ సామాజిక మాధ్యమం చూసినా..నాటు నాటు పాట...ఆస్కార్‌ అవార్డుపైనే విశ్లేషణలు రాస్తూ.. తమ సంతోషం వ్యక్తం చేస్తూ పోస్టులు కన్పించాయి.


మన సినిమా ఖ్యాతి పెరిగింది

కరుణాకర్‌రెడ్డి

అమీర్‌పేట:‘నాటు నాటు’ పాటకు ఆస్కార్‌ పురస్కారం దక్కడంపై తెలంగాణ ఫిలిం ఫెడరేషన్‌ అధ్యక్షుడు వడ్డె కరుణాకర్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం బీకేగూడలో ఆయన మాట్లాడుతూ, ఆస్కార్‌ వేదికపై తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా బృందానికి అభినందనలు తెలిపారు.  గేయ రచయిత చంద్రబోస్‌, సంగీత దర్శకులు కీరవాణి,  దర్శకులు రాజమౌళి తెలుగు పాటతో పాటు దేశప్రతిష్ఠనూ పెంచారన్నారు.


ఆస్కార్‌ విజేత చంద్రబోస్‌ రామంతాపూర్‌ విద్యార్థి

చంద్రబోస్‌తో కలిసి చదువుకున్నందుకు ఆనందంగా ఉందని బాల్యమిత్రుడు శ్రీనివాస్‌ అన్నారు.  మేమంతా హాస్టల్లో కలిసి ఉండేవాళ్లం. తాను ఎలక్ట్రికల్‌, నేను సివిల్‌  బ్యాచ్‌. తన పాట నేడు ప్రపంచ స్థాయికి ఎదగడం  గర్వించదగ్గ విషయం.


బస్తీ కుర్రాడి పాట.. విశ్వమంతటా..

ఈనాడు, హైదరాబాద్‌: నాటునాటు పాటతో రాహుల్‌ సిప్లిగంజ్‌ పేరు.. ఇప్పుడు దేశమంతా మారుమోగుతోంది. భాగ్యనగర గల్లీల్లో గణపతి ఉత్సవాల్లో పాటలు పాడే ఓ కుర్రాడు.. విశ్వవేదికపై తన గొంతును వినిపించి.. చార్‌సౌ నగరి ఖ్యాతిని చాటాడు. ఆస్కార్‌ వేదికపై ప్రత్యక్షంగా పాట పాడి అందరి దృష్టినీ ఆకర్షించాడు. నాటునాటు పాటకు ఆస్కార్‌ అవార్డు వరించడంతో రాహుల్‌ ఇంటి వద్ద కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందడోలికల్లో మునిగిపోయారు. పెద్ద ఎత్తున అభిమానులు ఇంటికి చేరుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ..తొలుత గోల్డెన్‌ గ్లోబ్‌, సినీ క్రిటిక్స్‌ అవార్డులను సొంతం చేసుకున్న క్రమంలోనే ఆస్కార్‌ అవార్డుపై తమకు నమ్మకం కలిగిందని.. అదే నిజమైందని పలువురు పేర్కొన్నారు.

ఆస్కార్‌ వరించడంతో వారాసిగూడలో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తున్న చిన్నారులు


తెలుగుజాతికే గర్వకారణం

తుమ్మల భూమికాచౌదరి, నిజాంపేట

‘నాటు.. నాటు..’ పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం తెలుగు జాతికే గర్వకారణం. మన తెలుగు పాటకు ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు రావడం విశేషం. యువత మదిలో అగ్రతారలుగా సుస్థిర స్థానాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ అభిమానులకు నిజంగా పండగే. అదేవిధంగా పాట రచయిత చంద్రబోస్‌తోపాటు శ్రోతల మనసులను ఉర్రూతలూగించేలా పాడిన రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవలు తెలుగు ఖ్యాతిని చాటారు. ఇంతటి ఉన్నతమైన అవార్డు మన సొంతం కావడంతో ప్రతి ఒక్కరి మనసు ఉప్పొంగుతోంది.


సువర్ణాక్షరాలతో లిఖించే రోజు

తూము శ్రావ్య, మూసాపేట

తెలుగు సినిమా పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం సినీచరిత్రలోనే మహోన్నతమైన ఘట్టం. ఇది కచ్చితంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. తెలుగువాడితో పాటు యావత్‌ దేశ ప్రజలకు గర్వకారణం.  తెలుగు వాడి సత్తా ప్రపంచ స్థాయిలో ఎలుగెత్తి చాటిన ‘నాటు’ పాట సుస్థిర స్థానాన్ని సంపాదించుకుంది.

న్యూస్‌టుడే, మూసాపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని