logo

వైద్యుల చొరవతో ఏడేళ్లకు కుటుంబ సభ్యుల చెంతకు

మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాధితుడు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం వైద్యుల చొరవతో ఏడేళ్ల తరువాత కుటుంబ సభ్యుల చెంతకు చేరారు.

Updated : 29 Mar 2024 04:36 IST

అమీర్‌పేట, న్యూస్‌టుడే: మానసిక సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయిన ఓ బాధితుడు ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయం వైద్యుల చొరవతో ఏడేళ్ల తరువాత కుటుంబ సభ్యుల చెంతకు చేరారు. మానసిక చికిత్సాలయం సూపరింటెండెంట్‌ డా.ఉమాశంకర్‌, వైద్యులు అనిత వివరాల ప్రకారం.. కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుడు (38) మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతుండేవాడు. అతని తల్లిదండ్రులు, భార్య, ఇద్దరు పిల్లలు జాగ్రత్తగా చూసుకుంటూ చికిత్స చేయించేవారు. ఈ క్రమంలో 2017లో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతని జాడ కోసం వెతికిన కుటుంబ సభ్యులు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతనిపై ఆశలు సైతం వదిలేసుకున్నారు. 2020లో కాజీపేట రైల్వేస్టేషన్‌లో తిరుగుతున్న ఆ యువకుడిని గుర్తించిన ఓ స్వచ్ఛంద సంస్థ చేరదీసి వరంగల్‌ మేజిస్ట్రేట్‌ సహకారంతో రిసెప్షన్‌ ఆర్డర్‌ కింద చికిత్స నిమిత్తం ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చారు. రెండేళ్ల చికిత్స అనంతరం బన్సీలాల్‌పేటలోని హోంలో ఆశ్రయం కల్పించారు. మందులు సరిగా వాడకపోవడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. దీంతో అతడ్ని గతేడాది డిసెంబరులో తిరిగి ఎర్రగడ్డ మానసిక చికిత్సాలయంలో చేర్చగా.. వైద్యులు కోలుకునేలా చేశారు. నాలుగు రోజుల కిందట వైద్యులు ఆ యువకుడితో మాట్లాడగా.. తల్లిదండ్రులు, ఊరి పేరు చెప్పడంతో కర్నూలులో ఉండే ఓ వైద్య విద్యార్థి సహకారంతో స్థానిక పోలీసుస్టేషన్ల ద్వారా వివరాల కోసం ఆరా తీశారు. చివరికి అతడి గ్రామ సర్పంచి ఫోన్‌ నంబరు సేకరించిన వైద్యులు వీడియో కాల్‌ ద్వారా కుటుంబ సభ్యులకు చూపించారు. వారు అతడ్ని చూసి ఆశ్చర్యపోయి.. హుటాహుటిన గురువారం ఆసుపత్రికి చేరుకున్నారు. యువకుడు సైతం వారిని గుర్తుపట్టడంతో వైద్యులు అతన్ని అప్పగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని