icon icon icon
icon icon icon

KTR: తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన ఆ ఇద్దరికీ బుద్ధి చెప్పాలి: కేటీఆర్‌

తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు.

Published : 23 Apr 2024 15:06 IST

హైదరాబాద్‌: తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి బుద్ధి చెప్పాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల లోక్‌సభ పరిధిలోని రాజేంద్రనగర్‌లో జరిగిన రోడ్‌ షోలో కేటీఆర్‌ ప్రసంగించారు. భారాసకు 8 నుంచి 10 సీట్లు ఇస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం మనం చెప్పినట్లే వింటుందన్నారు. కేంద్రంలో అధికారంలో ఉండే ఎవరైనా మన వద్దకు రావాలంటే భారాసకు ఎక్కువ సీట్లు కావాలన్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పారిపోయే పిరికిపందలకు తప్పకుండా బుద్ధి చెప్పాలని పార్టీ శ్రేణులను కోరారు.

‘‘బలహీన వర్గాలను ఒక్కటి చేసిన బాహుబలి కాసాని జ్ఞానేశ్వర్‌. ఆ వర్గాలకు సీట్లు ఇస్తే గెలవరన్న అపవాదు ఉంది. అది తప్పని నిరూపించాలి. చేవెళ్ల పార్లమెంట్‌ నియోజకవర్గంలో మొదటిసారి బీసీ అభ్యర్థి బరిలో ఉన్నారు. కాసానిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మోదీ, ఎన్డీయే కూటమికి 400 కాదు..200 సీట్లు కూడా వచ్చేలా లేవు. కాంగ్రెస్‌ పార్టీకి కూడా 100 నుంచి 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. అరచేతిలో వైకుంఠం చూపించిన కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నిలదీయాలి. రైతుల దగ్గరకు వెళ్లి రూ.2లక్షల రుణమాఫీ హామీ నెరవేరిందా అని అడగాలి. కేసీఆర్‌ అభివృద్ధి చేసిన పదేళ్ల పాలన ఒకవైపు.. కాంగ్రెస్‌ 100 రోజుల అబద్ధాల పాలన మరో వైపు. భాజపా పదేళ్లలో ఏం చేసిందో చెప్పి ఓటు అడగమంటే చెప్పేందుకు ఒక్కటీ లేదు’’ అని కేటీఆర్‌ విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img