logo

ఫలితాల్లో.. ‘పది’ పోయింది

పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్‌ జిల్లాలు నిలబడ్డాయి.

Updated : 01 May 2024 05:03 IST

చివరి నుంచి నాలుగో స్థానంలో రాజధాని
రంగారెడ్డి 24.. 27వ స్థానంలో మేడ్చల్‌
ఈనాడు, హైదరాబాద్‌

పదో తరగతి పరీక్షల ఫలితాల్లో హైదరాబాద్‌ జిల్లా కిందకు దిగింది. 33 జిల్లాల్లో కింది నుంచి నాలుగో స్థానంలో నిలిచింది. ఇదే వరుసలో రంగారెడ్డి.. మేడ్చల్‌ జిల్లాలు నిలబడ్డాయి. మంగళవారం ప్రకటించిన ఫలితాల్లో హైదరాబాద్‌ 30వ స్థానం దక్కించుకోగా.. మేడ్చల్‌ జిల్లా 27వ స్థానం, రంగారెడ్డి జిల్లా 24వ స్థానంలో నిలిచింది. గతేడాది ఈ మూడు జిల్లాలు 28, 20, 14 స్థానాల్లో నిలిచాయి.  విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం లేకకుండా పోయింది. మరోవైపు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు మంచి ఉత్తీర్ణత సాధించాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ‘రామోజీ ఫౌండేషన్‌’ సహకారంతో కొనసాగుతున్న నాగన్‌పల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల వందశాతం ఉత్తీర్ణత సాధించింది. 96శాతం మంది ఉత్తమ గ్రేడ్‌లను దక్కించుకున్నారు.   

ఉత్తీర్ణత పెరిగినా..

మూడు జిల్లాల్లో ఎక్కువమంది ఉత్తీర్ణులైనా.. ఇతర జిల్లాలతో పోలిస్తే ర్యాంకులు తగ్గాయి.  మొత్తం 1.70లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 1.51లక్షల మంది ఉత్తీర్ణులయ్యారు. హైదరాబాద్‌ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో 7445 మంది పరీక్షలు రాస్తే...5873మంది మాత్రమే పాసయ్యారు. గోల్కొండ జోన్‌లో 357 మంది, ఆసిఫ్‌నగర్‌ మండలంలో 276 మంది, తిరుమలగిరి మండలంలో 110 మంది పరీక్షల్లో తప్పారు. మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల్లోనూ ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం 80శాతం మించలేదు.

కారణాలు ఇవేనా..?

  • ఉపాధ్యాయుల బదిలీలు.
  • తేడాది ఎన్నికల విధులకు వెళ్లడం.
  • జీవో నంబర్‌ 317 కింద జరిగిన బదిలీలు వివాదాస్పదం కావడం.
  • ఉపాధ్యాయులు, విద్యార్థులు సక్రమంగా పాఠశాలలకు రాకపోవడం.
  • సర్కారు బడుల్లో సదుపాయాల కొరత.
  • కొన్ని పాఠశాలల్లో చాలీచాలని గదులు.
  • మరికొన్ని బడుల్లో ఇంటర్‌ కళాశాలలు కొనసాగుతుండడం.. ఇలా వివిధ అంశాలు పదోతరగతి ఫలితాలపై ప్రభావం చూపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని