logo

రక్తహీనతపై యుద్ధం

మహిళల్లో రక్తహీనతను తరిమేయడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వారిని గుర్తించి మందులు అందించాలని కార్యాచరణ రూపొందించింది.

Published : 28 Jun 2022 05:14 IST

15 - 49 ఏళ్ల వయసు గల మహిళలకు పరీక్షలు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ వైద్యవిభాగం


రక్తహీనత పరీక్షల కిట్లను ఆశాకార్యకర్తలకు అందజేస్తున్న జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌

మహిళల్లో రక్తహీనతను తరిమేయడానికి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా వారిని గుర్తించి మందులు అందించాలని కార్యాచరణ రూపొందించింది. అంగన్‌వాడీ, మహిళా సంక్షేమం, వైద్య ఆరోగ్య శాఖ సమన్వయంతో వచ్చే నెల నుంచి కార్యక్రమం చేపడతారు. గత నెలలో ఏడు వేల మందికి పైగా మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజాప్రతినిధులందరికీ వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా ఎ.ఎన్‌.ఎం.లు హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించారు. సమస్య ఉన్నవారిని గుర్తించి తగిన మందులు అందజేశారు. రక్తహీనతను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలు, ఇతర అంశాలతో కూడిన ప్రత్యేక యాప్‌ను జిల్లా పాలనాధికారి నేతృత్వంలో రూపొందించారు. ఏఎన్‌ఎంలకు శిక్షణ ఇచ్చి పరీక్షలు నిర్వహించారు. ఇటీవల ఆశా, అంగన్‌వాడీ కార్యకర్తలను భాగస్వాములను చేయాలని ఇటీవల జిల్లా కేంద్రంలో సమావేశం నిర్వహించారు. వివిధ మండలాలకు చెందిన వారు రెండు వేల మంది పాల్గొన్నారు. అవసరమైన కిట్లు అందజేశారు.

నెల రోజుల పాటు

జిల్లాలోని 15 నుంచి 49 ఏళ్ల మధ్య వయసుల మహిళలు 2లక్షల 2వేల మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ గుర్తించింది. వీరందరికి నెల రోజుల పాటు పరీక్షలు నిర్వహిస్తారు. హిమోగ్లోబిన్‌ శాతం తక్కువ ఉన్నవారి పేర్లు, చిరునామాలు నమోదు చేస్తారు. మొదటి దశలో మాత్రలు అందజేస్తారు. తీవ్రత ఎక్కువ ఉన్నవారిని వైద్యం అందించే ఏర్పాట్లు చేస్తారు. జిల్లా పాలనాధికారి, అదనపు పాలనాధికారి సమీక్షలు నిర్వహిస్తారు. త్వరలోనే రాష్ట్ర, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, జిల్లా పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు.

సమస్యలు ఇలా..

సాధారణంగా మహిళలకు 11 నుంచి 12 గ్రాముల హిమోగ్లోబిన్‌ ఉండాలి. పది లోపు ఉన్న వాళ్లకు అనారోగ్య సమస్యలు ఉంటాయి. నీరసం, ఆయాసం, పాలిపోవడం, గైనిక్‌ సమస్యలు వస్తాయి.

* గర్భిణులకు రక్తం తక్కువగా ఉంటే ప్రసవ సమయంలో ఇబ్బందులు వస్తాయి. కాన్పు సమయంలో శస్త్ర చికిత్స చేయాల్సి వస్తే ముందుగా రక్తం సమకూర్చుకోవాల్సి ఉంటుంది.

* జిల్లాలో ఇది వరకు మహిళా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు హిమోగ్లోబిన్‌ పరీక్షలు నిర్వహించినప్పుడు ముగ్గురికి కేవలం ఆరు శాతం ఉన్నట్లు తేలింది. 8 నుంచి 10 శాతం లోపు ఉన్న వారు 30 మంది శాతం వరకు ఉన్నారు.

* రక్తహీనత ఉన్నవారికి ఐరన్‌ మాత్రలు ఇస్తారు. అవి పడనివారికి అవసరమైన ఇంజక్షన్‌లు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని