logo

రామగుండం వైద్య కళాశాల సాకారం

రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల కలలు గురువారం సాకారమయ్యాయి. గోదావరిఖని వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు అనుమతిస్తూ జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఎం.బి.బి.ఎస్‌

Updated : 26 Aug 2022 07:33 IST

ఎంబీబీఎస్‌ తరగతుల నిర్వహణకు అనుమతి
న్యూస్‌టుడే, గోదావరిఖని పట్టణం

ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రి ఆవరణలో సంబరాలు జరుపుకుంటున్న సిబ్బంది

రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజల కలలు గురువారం సాకారమయ్యాయి. గోదావరిఖని వైద్య కళాశాలలో తరగతుల నిర్వహణకు అనుమతిస్తూ జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో ఎం.బి.బి.ఎస్‌. మొదటి సంవత్సరంలో 150 మంది విద్యార్థులను చేర్చుకోనున్నారు. గత రెండు దశాబ్దాలుగా 100 పడకల సామర్థ్యంతో సేవలందించిన గోదావరిఖని ప్రభుత్వ ప్రాంతీయ ఆస్పత్రిని 330 పడకల స్థాయికి పెంచడంతో పాటు వైద్య కళాశాలకు బోధనాస్పత్రిగా ప్రకటించారు. ఆచార్యులు, సహాయక ఆచార్యులతో పాటు వైద్య, వైద్యేతర సిబ్బందిని నియమించారు. ప్రజలకు అత్యాధునిక సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం 330 పడకల సామర్థ్యంతోనున్న సార్వజనిక ఆస్పత్రిని దశల వారీగా 650 పడకల సామర్థ్యానికి పెంచనున్నారు. కొన్నేళ్లుగా ప్రసవాలు, ఎముకల శస్త్రచికిత్సలకు పరిమితమైన ఈ ఆస్పత్రిలో అనేక విభాగాల్లో వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. కార్పొరేట్‌ ఆస్పత్రుల స్థాయిలో గోదావరిఖనిలోని ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందనున్నాయి. వైద్య కళాశాలకు అనుబంధంగా ఒకటి, రెండేళ్లల్లో నర్సింగ్‌ కళాశాలను సైతం ఏర్పాటు చేయనున్నారు.
ఆసుపత్రిలో సంబరాలు : గోదావరిఖనిలో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణకు జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ గురువారం అనుమతులు మంజూరు చేయడంతో ప్రభుత్వ సార్వజనిక ఆస్పత్రిలో గురువారం రాత్రి సంబరాలు జరుపుకున్నారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, బోధనాస్పత్రి సూపరింటెండెంట్తో పాటు ఆచార్యులు, వైద్య, వైద్యేతర సిబ్బంది టపాకాయలు కాల్చుకుంటూ సంబరాలు జరుపుకున్నారు.

పరిశ్రమల సహకారంతో ముందడుగు
స్థానిక పరిశ్రమల సహకారంతోనే రామగుండం ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో పాటు ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటునకు మార్గం సుగమమైంది. కొన్నేళ్లుగా ప్రభుత్వ ఆస్పత్రికి అత్యాధునిక అంబులెన్సుతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు, అంబులెన్సు షెడ్లు, వైద్య పరీక్షలకు అవసరమైన అత్యాధునిక పరికరాలు అందించారు. పంఖాలు, లైట్లను సైతం ఎన్టీపీసీ యాజమాన్యం సమకూర్చింది. తాజాగా సుమారు రూ. 7 కోట్ల వ్యయంతో ఆస్పత్రిపైన మరో అంతస్థు నిర్మాణం చేపట్టడంతో వైద్య కళాశాల ఏర్పాటునకు అవసరమైన నిబంధనల ప్రకారంగా మరో 100 పడకల సదుపాయాన్ని ఆస్పత్రి ఆవరణలో కల్పించినట్లయింది. వైద్య కళాశాల ఏర్పాటులో సింగరేణి యాజమాన్యం కీలక పాత్రను పోషిస్తుంది. కళాశాల భవన నిర్మాణానికి స్థలాన్ని అప్పగించడంతో భవన నిర్మాణం కోసం రూ.500 కోట్లు మంజూరు చేసింది. కళాశాల భవన నిర్మాణం పురోగతిని పరిశీలించుకుంటూ ప్రతి మూడు నెలలకోమారు రూ.50 కోట్ల చొప్పున ఇప్పటి వరకు రూ.150 కోట్లు విడుదల చేసింది. సుమారు రూ. 6.5 కోట్ల వ్యయంతో ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో మరో 85 పడకల సామర్థ్యంతో ఆస్పత్రి భవన నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ నిర్మాణం పనులు పూర్తయ్యేందుకు మరికొంత కాలం పట్టే అవకాశముంది. స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని ట్రాన్సిట్‌ హాస్టల్‌ను బాలుర వసతి గృహానికి, శారదానగర్‌లోని మరో ట్రాన్సిట్‌ హాస్టల్‌ బాలికల వసతి గృహానికి కేటాయిస్తూ అవసరమైన మరమ్మతులు చేసి వసతికి సిద్ధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని