logo

బీసీలకు బాసట.. ఎందరికి ఊరట?

బీసీలకు వ్యక్తిగత రుణాల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న యువత ఉన్నపళంగా అర్జీలు పెట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు.

Published : 08 Jun 2023 05:06 IST

రుణాలపై చిగురిస్తున్న ఆశలు
ఉమ్మడి జిల్లాలో ఆశావహులు అధికమే

ఈనాడు, కరీంనగర్‌: బీసీలకు వ్యక్తిగత రుణాల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎప్పటి నుంచో నిరీక్షిస్తున్న యువత ఉన్నపళంగా అర్జీలు పెట్టుకునేందుకు సమాయత్తమవుతున్నారు. తెలంగాణ దశాబ్ది వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం స్వయం ఉపాధికి బాటలు వేసేందుకు రుణాలివ్వాలని తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల సంఖ్య నాలుగు జిల్లాల పరిధిలో పెరగబోతోంది. ఈ నెల 20వ తేదీ వరకు గడువుని నిర్ణయించడంతో చిరు వ్యాపారులతోపాటు కొత్తగా ఉపాధిని అందుకోవాలనుకునేవారు ఆన్‌లైన్‌ కేంద్రాలకు, రెవెన్యూ కార్యాలయాలకు పరుగులు పెడుతున్నారు. అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ సహా ఇతర పత్రాలను సమకూర్చుకుంటున్నారు. ఆన్‌లైన్‌లో స్వీకరణ ప్రక్రియ ప్రారంభమవడంతో ముందుగానే తమ వివరాల్ని నమోదు చేయించుకోవాలని చూస్తున్నారు.

అర్హులకు అందేనా?

గతంలో బీసీ కార్పొరేషన్‌ ద్వారా మూడు కేటగిరీలుగా అందించిన రుణసాయం విషయంలో ఉమ్మడి జిల్లాలో పైరవీలకే ప్రాధాన్యతనిచ్చారనే ఆరోపణలు వినిపించాయి. వచ్చిన దరఖాస్తుల్లో నుంచి తుది జాబితాలో ఎక్కువగా నాయకులు వారి అనుచరగణానికి చోటిచ్చారనే విమర్శలున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తరవాత కొన్నేళ్లపాటు ఇచ్చిన ఈ సాయం తరువాత నిలిపివేశారు. దాదాపుగా ఏడేళ్ల తరవాత మళ్లీ తెరమీదకు రుణాల ప్రస్తావన రావడంతో నిరుద్యోగ యువతలో ఆశలు చిగురిస్తున్నాయి. పైగా గతానికి భిన్నంగా ఈ సారి లక్ష రూపాయల రుణం వందశాతం రాయితీతో అందిస్తుండటంతో ఎందుకు ఈ అవకాశాన్ని వదులుకోవాలనే ఉద్దేశంతో అందరూ చొరవ చూపిస్తున్నారు. అప్పట్లో కేటగిరీ-1 కింద రూ.75 వేల నుంచి రూ.లక్ష, కేటగిరీ-2 కింద రూ.2 లక్షల వరకు, కేటగిరీ-3 కింద రూ.5 లక్షల నుంచి రూ.10లక్షల వరకు రాయితీ రుణం అందేది. ఈ సారి తక్కువ మొత్తంతో ఎక్కువ మంది బీసీ లబ్ధిదారులకు చేయూతనివ్వాలని సర్కారు భావిస్తోంది.

పెరగనున్న పోటీ!

ఈసారి అర్హుల ఎంపిక విషయంలో విపరీతమైన పోటీ ఉండనుంది. దీంతో కొందరు ఎందుకైనా మంచిదని ముందుగానే ఓ మాట తమకు తెలిసిన నాయకులకు చెబుతూనే అర్జీ పెట్టుకుంటున్నారు. 2015లో ఉమ్మడి జిల్లాకు బీసీ కార్పొరేషన్‌ ద్వారా 2,306 యూనిట్లు మంజూరవగా అప్పుడున్న నిబంధనల ప్రకారం వెల్లువలా దరఖాస్తులు అందాయి. ఏడేళ్ల కిందటే 20,926 మంది పోటీపడ్డారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సంఖ్య దాదాపుగా అయిదింతలకు పెరిగే అవకాశముంది. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 40 వేల మందికి రుణాలను ఇవ్వాలని తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్‌ సహా కొన్ని జిల్లాల్లోనే ఎంపిక ప్రక్రియను చేపట్టారు. అప్పుడు ఉమ్మడి జిల్లాకు అవకాశం లభించలేదు. నాలుగు జిల్లాల పరిధిలో మాత్రం ప్రతి వార్షిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్‌, సంక్షేమశాఖల తరఫున రుణాలను అందించేందుకు ప్రణాళికల్ని రూపొందించి ప్రభుత్వానికి పంపుతున్నారు. బడ్జెట్‌లో నిధుల కేటాయింపు ఉంటున్నా.. క్షేత్రస్థాయికి యూనిట్ల మంజూరు ప్రస్తావన ఇన్నాళ్లు వినిపించలేదు. స్వయం ఉపాధితో ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఆశతో ప్రతి ఏడాది బీసీలంతా రుణాల కోసం నిరీక్షిస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు ఈసారి తీసుకున్న నిర్ణయంతో తక్కువ రుణమైనా.. ఎక్కువ రాయితీతో అందుతుందనే ఉత్సాహంతో ఆ దిశగా ఆశావహ యువత అడుగులేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని