logo

13 శాసనసభ స్థానాలు.. ఆరు ఉప ఎన్నికలు

పదమూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 15 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా వీటికి అదనంగా ఆరు సార్లు పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి.

Updated : 03 Nov 2023 05:08 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం:  పదమూడు శాసనసభ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పరిధిలో 15 సార్లు సాధారణ ఎన్నికలు జరగగా వీటికి అదనంగా ఆరు సార్లు పది నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరిగాయి. 2010లో అప్పటి తెరాస అధినేత నిర్ణయం మేరకు అయిదు శాసనసభ స్థానాలకు అయిదుగురు శాసనసభ్యులు రాజీనామా చేసి తిరిగి విజయ బావుటా ఎగురవేశారు. మిగిలిన ప్రాంతాల్లో వేర్వేరు కారణాలతో ఉప ఎన్నికలు తప్పనిసరి అయ్యాయి. జగిత్యాలలో రెండు సార్లు, పెద్దపల్లి, మెట్‌పల్లి, బుగ్గారం అప్పటి నియోజకవర్గాలలో ఒకసారి, హుజూరాబాద్‌, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ, ధర్మపురి ఇప్పటి నియోజకవర్గాలకు ఒకసారి ఉప ఎన్నికలు జరిగాయి.

హుజూరాబాద్‌

  •  2009 శాసనసభ సాధారణ ఎన్నికల్లో హుజూరాబాద్‌, వేములవాడ, ధర్మపురి, కోరుట్ల, సిరిసిల్ల నియోజకవర్గాలలో  తెరాస పార్టీ అభ్యర్థులే ఎన్నికయ్యారు. 2010లో తెరాస అధినేత ఆదేశాల మేరకు వీరు రాజీనామా చేసి ఉప ఎన్నికలలో మళ్లీ విజయం సాధించారు. హుజురాబాద్‌ నుంచి ఎన్నికైన ఈటల రాజేందర్‌ ఉప ఎన్నికలో తెదేపా అభ్యర్థి దివంగత  ముద్దసాని దామోదర్‌రెడ్డిపై గెలుపొందారు. సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కె.తారకరామారావుకు ప్రత్యర్థిగా కాంగ్రెస్‌ అభ్యర్థి కె.కె.మహేందర్‌రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌ కూడా కాంగ్రెస్‌ అభ్యర్థి ఆది శ్రీనివాస్‌పై విజయం సాధించారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు సైతం అప్పటి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్‌ అభ్యర్థి జె.రత్నాకర్‌రావును ఓడించారు. ధర్మపురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన కొప్పుల ఈశ్వర్‌ తన సమీప ప్రత్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌పై గెలుపొందారు. ఈ అయిదుగురు ప్రత్యర్థులను ఖంగుతినిపించారు. వీరంతా 2014వరకు పదవులలో ఉన్నారు.

కోరుట్ల

  • 1998లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అప్పటి భాజపా సీనియర్‌ నేత ఎమ్మెల్యే చెన్నమనేని విద్యాసాగర్‌రావు కరీంనగర్‌ ఎంపీగా విజయం సాధించారు. ఎంపీగా బాధ్యతలు చేపట్టిన విద్యాసాగర్‌రావు మెట్‌పల్లి శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. 1998లో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన మహిళ కొమిరెడ్డి జ్యోతి, భాజపా అభ్యర్థిపై విజయం సాధించారు. 1999 ఎన్నికల వరకు జ్యోతి ఎమ్మెల్యేగా పని చేశారు.
  • 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి జగిత్యాల ఎమ్మెల్యేగా ఎల్‌.రమణ తెదేపా నుంచి గెలిచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. 1996లో జగిత్యాల శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా ఆ ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి బండారి వేణుగోపాల్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి విజయం సాధించారు.

పెద్దపల్లి

  • మాజీ ముఖ్యమంత్రి, సుప్రసిద్ధ నటుడు ఎన్‌టి.రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించిన అనంతరం 1983లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఆ పార్టీ సంజయ్‌ విచార్‌ మంచ్‌తో కలిసి పోటీ చేసింది. పెద్దపల్లి శాసనసభ స్థానానికి సంజయ్‌ విచార్‌ మంచ్‌కు కేటాయించారు. ఆ పార్టీ నుంచి గోనే ప్రకాశ్‌రావు విజయం సాధించారు. ఆ తర్వాత ప్రకాశ్‌రావు కొన్ని కారణాలతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆక్రమంలో ఆ నియోజకవర్గానికి 1983లోనే ఉప ఎన్నికలు జరగగా అప్పటి తెదేపా అభ్యర్థి వేముల రమణయ్యపై పోటీ చేసిన కాంగ్రెస్‌ అభ్యర్థి గీట్ల ముకుందరెడ్డి కాంగ్రెస్‌ నుంచి గెలిచి 1985వరకు ప్రాతినిథ్యం వహించారు.
  • 1963లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో జగిత్యాల శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థి ఎం.ధర్మరావు విజయం సాధించారు. కొన్ని కారణాతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికలలో కాంగ్రెస్‌ నుంచి బరిలో దిగిన కె.లక్ష్మినరసింహారావు విజయం సాధించారు.

జగిత్యాల

  • 1957 శాసనసభ ఎన్నికలలో మోహన్‌రెడ్డి బుగ్గారం శాసనసభ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించి 1958 వరకు కొనసాగారు. ఏడాది తర్వాత ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్‌ అభ్యర్థిగా పోటి చేసిన బి.ఎల్లారెడ్డి గెలిచి 1962 వరకు ఎమ్మెల్యేగా కొనసాగారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని