logo

విద్యార్థి సంఘం నేతకు దక్కిన అవకాశం

ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఒకరిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేయడం ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.

Updated : 18 Jan 2024 05:05 IST

బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్సీ టికెట్‌ ఖరారుతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం

న్యూస్‌టుడే, హుజూరాబాద్‌: ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌కు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులలో ఒకరిగా కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంపిక చేయడం ఆ పార్టీ ఉమ్మడి జిల్లా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. 2021 అక్టోబరులో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధిష్ఠానం అనూహ్యంగా ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయనను బరిలోకి దింపగా ఓటమి పాలయ్యారు. అనంతరం నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా కాంగ్రెస్‌ శ్రేణులను ఉత్తేజపరుస్తూ పార్టీ కార్యక్రమాలను నిర్వహించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో హుజూరాబాద్‌ అభ్యర్థిత్వం కోసం ఆయన ప్రయత్నించినప్పటికి కాంగ్రెస్‌ అధిష్ఠానం వొడితెల ప్రణవ్‌కు టికెట్‌ ఇచ్చింది. దీంతో కొంత నిరుత్సాహానికి గురైన వెంకట్‌కు సరైన న్యాయం చేస్తానని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొట్ట మొదటిసారిగా రెండు ఎమ్మెల్సీ పదవులకు ఎంపిక చేసిన అభ్యర్థులలో వెంకట్‌కు చోటు దక్కింది. 2021లో హుజూరాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డికి భారాస అధినేత కేసీఆర్‌ ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వగా విజయం సాధించారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానంలో తిరిగి హుజూరాబాద్‌లో పోటీ చేసిన నేతకే కాంగ్రెస్‌ అధిష్ఠానం అవకాశం ఇవ్వడం గమనార్హం. తనపై నమ్మకంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేసిన అధిష్ఠానానికి వెంకట్‌ కృతజ్ఞతలు తెలిపారు.

పేరు : బల్మూరి వెంకట నర్సింగరావు
పుట్టిన తేదీ : 2.11.1992, విద్యార్హత : ఎంబీబీఎస్‌
తల్లిదండ్రులు : పద్మారావు, మదన్‌మోహన్‌రావు భార్య : రమ్య,
స్వగ్రామం : జగిత్యాల జిల్లా మల్యాల మండలం మానాల
పార్టీ హోదా : ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు
రాజకీయ నేపథ్యం : 2015, 2018లలో ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నిక. 2017లో ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శిగా పని చేశారు.

బల్మూరి వెంకట్‌ స్వగ్రామం మానాల మండలం మానాల అయినా వారి కుటుంబం చాలా ఏళ్ల కిందటే హైదరాబాద్‌కు వెళ్లి స్థిరపడింది. తండ్రి మదన్‌మోహన్‌రావు 15 ఏళ్ల కిందట చనిపోయారు. కుటుంబానికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు. కాంగ్రెస్‌ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన వెంకట్‌ 2018లో పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించినప్పటికి రాలేదు. 2021 అక్టోబరులో జరిగిన హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో వెంకట్‌ను బరిలో దింపినప్పటికి ఆయన ఓటమి పాలయ్యారు.

ఆందోళనల్లో చురుగ్గా.. : హైదరాబాద్‌లో ఉంటున్న వెంకట్‌ భారాస ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఉదంతాలు కూడా ఉన్నాయి. 14 రోజుల పాటు రిమాండ్‌కు కూడా వెళ్లారు. టీఎస్‌పీఎస్సీ పరీక్షల పత్రాల లీకేజీని నిరసిస్తూ ఆయన నిరుద్యోగులతో కలిసి ఉద్యమాన్ని చేపట్టడంతోపాటు విచారణ జరిపించాలని హైకోర్టులో పిటిషన్‌ కూడా దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు