logo

ఈ సారైనా వరదముప్పు తొలగేనా!

కోరుట్ల పట్టణంలోని 10, 11 వార్డుల గుండా ప్రవహించే మద్దుల చెరువు కాలువ ఆక్రమణకు గురికావడంతో ఏటా వర్షాకాలంలో రోజుల తరబడి వరదలు కాలనీలను ముంచెత్తున్నాయి

Published : 27 Mar 2024 03:40 IST

కాలువల ఆక్రమణతో ఏటా ఇళ్లలోకి చేరుతున్న నీరు

 పిచ్చిమొక్కలతో నిండిపోయిన కాలువ

న్యూస్‌టుడే, కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని 10, 11 వార్డుల గుండా ప్రవహించే మద్దుల చెరువు కాలువ ఆక్రమణకు గురికావడంతో ఏటా వర్షాకాలంలో రోజుల తరబడి వరదలు కాలనీలను ముంచెత్తున్నాయి. 10-15 అడుగుల వెడల్పు గల కాలువ 3-4 అడుగులకు కుచించుకపోవడంతో పదేళ్లుగా ప్రకాశంరోడ్‌, ఝాన్సీరోడ్‌లో పూర్తిగా జలమయమవుతున్నాయి. రోడ్లపై వరద ప్రవహించడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రాని పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, మున్సిపల్‌ అధికారులు వర్షాకాలంలో జలమయమైన కాలనీలను సందర్శిస్తున్నారే తప్పా వరద సజావుగా వెళ్లేలా చర్యలు చేపట్టడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేస్టేషన్‌ స్థలంలోనున్న బొల్లికుంటలో మురుగు నీరు నిల్వ చేరి గుర్రపు డెక్క పెరిగి దుర్గంధం వ్యాపిస్తోంది. చాలా కాలనీలు సిమెంట్‌రోడ్లుగా అభివృద్ధికి నోచుకోకపోవడంతో కంకర తేలిన రోడ్లపై ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన రహదారి నుంచి కాలనీలకు వెళ్లే ప్రకాశంరోడ్‌లోని సిమెంట్‌రోడ్డు పూర్తిగా దెబ్బతిని గుంతలమయంగా మారింది. ఈ రోడ్డుతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.


సీసీరోడ్డు నిర్మించాలి..

ప్రధాన సిమెంట్‌ రోడ్డు దెబ్బతిని కంకరతేలడంతో మూడేళ్లుగా రాకపోకలకు నరకయాతన అనుభవిస్తున్నాం. దెబ్బతిన్న రోడ్లపై ద్విచక్ర వాహనాలు నడిపితే నడుము నొప్పి భరించలేకపోతున్నాం. సీసీరోడ్డు నిర్మించాలని ప్రజాప్రతినిధులు, అధికారులతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదు.

- కటుకం రాజేంద్రప్రసాద్‌, పదో వార్డు


ప్రజాప్రతినిధులకు విన్నవించినా ఫలితం లేదు

ఏటా వర్షాకాలంలో రోజుల తరబడి వరద నీరు కాలనీలను ముంచెత్తుతుంది. నీరు ఇళ్లలోకి చేరడంతో సరుకులు, వస్తువులు దెబ్బతింటున్నాయి. వర్షాలు తగ్గుముఖం పట్టేవరకు ఇంటిలోంచి బయటకు రాలేకపోతున్నాం. మద్దుల చెరువు వరద ముప్పును నివారించాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదు.

- పోతు మణెమ్మ 11వ వార్డు

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని