logo

పెరుగుతున్న ఔషధ వినియోగం

ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల వినియోగం పెరుగుతోంది.. వైద్య కళాశాలల ఏర్పాటు, మాతాశిశు కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలతో సదుపాయాలు పెరిగి జనం రాక పెరగడమే ఇందుకు కారణం.

Published : 30 Mar 2024 06:12 IST

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం

ఉమ్మడి జిల్లా పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధాల వినియోగం పెరుగుతోంది.. వైద్య కళాశాలల ఏర్పాటు, మాతాశిశు కేంద్రాలు, బస్తీ, పల్లె దవాఖానాలతో సదుపాయాలు పెరిగి జనం రాక పెరగడమే ఇందుకు కారణం. గతంతో పోల్చితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలను విరివిగా వినియోగించుకుంటున్నారు.

కొవిడ్‌ సమయంలో అత్యధికం

కొవిడ్‌ కన్నా ముందు రూ.5 నుంచి రూ.6 కోట్ల విలువైన ఔషధాలు సరఫరా అయ్యేవని స్టోర్స్‌ అధికారులు తెలిపారు. 2021-22లో కొవిడ్‌ వల్ల అత్యధిక ఔషధ వినియోగం జరిగింది. ఆ సమయంలో రూ.12.93 కోట్ల విలువైన ఔషధాలు వినియోగించారు. 2022-23 సంవత్సరానికి  రూ.6.76 కోట్ల విలువైన మందులు అందించగా, 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.8.25 కోట్ల మందులు ఆసుపత్రులకు సరఫరా చేస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఇప్పటివరకు దాదాపు రూ.2 కోట్ల ఔషధాలు అధికంగా సరఫరా అయ్యాయి.

ఇంటింటికీ సరఫరా

రక్తపోటు, మధుమేహం వంటి వాటితో బాధపడేవారిని వైద్య, ఆరోగ్యశాఖ సర్వే ద్వారా గుర్తిస్తోంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గుర్తించిన వారందరికీ నెల నెలా మాత్రలు ఆశా కార్యకర్తలు స్వయంగా ఇంటికి వెళ్లి అందిస్తున్నారు. సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ద్వారా వీటిని అన్ని జిల్లాల వైద్యారోగ్యశాఖ కార్యాలయాలకు పంపిస్తే అక్కడి నుంచి బాధితులకు చేరుస్తారు. క్షయ, కుష్ఠు బాధితులకు కూడా మల్టీ డ్రగ్‌ థెరపీ విధానంలో ప్రత్యేక కిట్లను అందిస్తారు.

పెద్దాసుపత్రుల్లో ఎక్కువ

ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పటి నుంచి కరీంనగర్‌ జిల్లా కేంద్ర ఆసుపత్రికి రోగుల రాక ఎక్కువ. గత ప్రభుత్వ హయాంలో సిరిసిల్ల, జగిత్యాల, రామగుండం, కరీంనగర్‌లలో ప్రభుత్వ వైద్య కళాశాలలు ఏర్పాటు చేశారు. బోధన ఆసుపత్రుల్లో పలు విభాగాల వైద్యులు అందుబాటులో ఉండటం, వైద్య వసతులు మెరుగు పడటం వల్ల రోగుల సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ ఆసుపత్రులకు అభివృద్ధి కమిటీలు కూడా ఉన్నాయి. అత్యవసరమైన మందులు కమిటీ ఆమోదంతో కొనుగోలు చేసి వైద్యం అందిస్తున్నారు. కరీంనగర్‌ ప్రధాన ఆసుపత్రికి ప్రతీ వారానికోసారి, మిగిలిన మూడు జిల్లాల వైద్య కళాశాలల ఆసుపత్రులకు 15రోజులకు పంపిణీ చేస్తున్నారు. మిగిలిన ఆసుపత్రులకు నెలకోసారి పంపిస్తున్నారు.


రెండు జిల్లాలకు ఒక గోదాము

కరీంనగర్‌ స్టోర్‌లో ఔషధ నిల్వలను పరిశీలిస్తున్న సిబ్బంది

వైద్య కళాశాలలు, ఆసుపత్రుల ఆధునికీకరణ, మాతాశిశు కేంద్రాల వల్ల ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఔషధ వినియోగం పెరుగుతోంది. వచ్చే స్టాక్‌ నిల్వ చేసేందుకు గోదాములు సరిపోవడం లేదు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయ ఆవరణలో సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ఉంది. ఇదేకాకుండా కొత్తపల్లి వైద్య కళాశాల వద్ద కూడా గోదాము ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో కొత్త భవనం నిర్మించారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ భవనం ప్రారంభం కాగానే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాలకు జగిత్యాల నుంచి మందులు సరఫరా అవుతాయి. కరీంనగర్‌, పెద్దపల్లికి కరీంనగర్‌ నుంచి వెళ్తాయి. ప్రభుత్వం ఏటా కేటాయించిన కోటా ప్రకారం మందులను ఆయా ఆసుపత్రులకు వాహనాల ద్వారా ఏ సమస్య లేకుండా సరఫరా చేస్తున్నామని అధికార వర్గాలు తెలిపాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని