logo

పార్టీల వ్యూహాలు.. గెలుపుపైనే ఆశలు

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇరవై ఆరు రోజుల సమయమే ఉంది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ వెలువడనున్న నాటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది.

Published : 16 Apr 2024 03:17 IST

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఇరవై ఆరు రోజుల సమయమే ఉంది. ఈ నెల 18న నోటిఫికేషన్‌ వెలువడనున్న నాటి నుంచే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎన్నికలను మూడు ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌, ప్రధాన ప్రతిపక్షం భారాస, కేంద్రంలో రెండు సార్లు అధికారం చేపట్టి మూడోసారి హ్యాట్రిక్‌ సాధించేందుకు భాజపాలు ఓటర్లను ఆకట్టుకునేలా ప్రచార వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. కరీంనగర్‌ పార్లమెంటు స్థానం పూర్తిగా కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల్లో విస్తరించి ఉంది. పెద్దపల్లి స్థానంలో మంచిర్యాల, భూపాలపల్లి జిల్లాల పరిధి కూడా ఉంది. నిజామాబాద్‌ స్థానంలో జగిత్యాల, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మనాలతోపాటు దాని సమీపంలోని ఏడు గిరిజన పంచాయతీలున్నాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది కాంగ్రెస్‌, అయిదు భారాస కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీని మరింత పెంచుకొని గెలుపు సాధించేందుకు ఆయా పార్టీలు పావులు కదుపుతున్నాయి.

2019లో మూడు లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌కు 18.09 శాతం ఓటు బ్యాంకు ఉండగా 2023 అసెంబ్లీ ఎన్నికలో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు 25.40 శాతానికి చేరింది. భారాసకు 39.60 శాతం ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో 22.59 శాతం వచ్చాయి. భాజపాకు 33.68 శాతం ఉండగా అసెంబ్లీ ఎన్నికల్లో 11.52 శాతం వచ్చాయి. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో మూడు పార్టీలు తమ బలాన్ని మరింత పెంచుకునే దిశగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే ఏ పార్టీ వైపు మొగ్గుచూపుతారనే ఆసక్తి నెలకొంది.

వర్గాలకు వల

అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం తక్కువగా ఉంటుంది. నియోజకవర్గ పరిధి ఎక్కువగా ఉండటంతో ఇంటింటికీ తిరిగి ఓటు అభ్యర్థించే పరిస్థితి ఉండదు. ఫలితంగా పోలింగ్‌ శాతంలో తేడా ఉంటుంది. దీనిలో ఎక్కువగా ఆయా నియోజకవర్గాలు, ప్రాంతాల వారీగా సామాజిక వర్గాలను ప్రసన్నం చేసుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు. మైనార్టీ వర్గాలను కలుసుకునేందుకు మొన్నటి వరకు ఇఫ్తార్‌ విందుల్లో పాల్గొంటూ వచ్చారు. ఈ నెల 17న శ్రీరామనవమి ఉమ్మడి జిల్లాలో పెద్దఎత్తున నిర్వహిస్తారు. అభ్యర్థులు వారి పరిధిలోని ఆలయాలను సాధ్యమైనంత ఎక్కువ దర్శించుకునేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఉదయం వాకింగ్‌ చేసేవారితోనూ, సింగరేణి గనుల్లో విధులకు వెళ్లే కార్మికులను, అడ్డా కూలీలను కలిసి ముచ్చటిస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. నెల రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్న సిరిసిల్లలో నేతన్నలతో కాంగ్రెస్‌, భాజపాలు వేర్వేరుగా సమావేశమై వారికి అండగా ఉంటామని భరోసానిచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని