logo

సాంకేతికత తోడుగా.. సృజనాత్మకత చేరువ!

రొబొటిక్స్‌ అనేది సాంకేతిక విద్య. ఇది ఒకప్పుడు నిట్‌, ఐఐటీ కళాశాలలకు పరిమితంకాగా, ప్రస్తుతం కార్పొరేట్‌ పాఠశాలల్లోనూ నేర్పిస్తున్నారు.

Published : 16 Apr 2024 03:20 IST

గ్రామీణ విద్యార్థులకు రొబోటిక్స్‌పై శిక్షణ

రొబోటిక్స్‌పై పాఠశాల విద్యార్థులకు నేర్పిస్తూ..

రొబొటిక్స్‌ అనేది సాంకేతిక విద్య. ఇది ఒకప్పుడు నిట్‌, ఐఐటీ కళాశాలలకు పరిమితంకాగా, ప్రస్తుతం కార్పొరేట్‌ పాఠశాలల్లోనూ నేర్పిస్తున్నారు. అయితే ఇది ప్రభుత్వ కళాశాల, పాఠశాల విద్యార్థులకు మాత్రం అందడంలేదు. ఈ విషయాన్ని గుర్తించిన హైదరాబాద్‌ స్వచ్ఛంద సంస్థ సోహమ్‌ అకాడమీ వారికి అండగా నిలవాలని భావించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంచుకున్న 15 జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 7, 8, 9వ తరగతి విద్యార్థులకు రొబోటిక్స్‌పై మెలకువలు నేర్పిస్తోంది. పూర్తి వివరాలతో కథనం.

న్యూస్‌టుడే - కరీంనగర్‌ కలెక్టరేట్‌: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సృజనాత్మక విద్య అందాలనే లక్ష్యంతో సోహమ్‌ సంస్థ ముందుకెళ్తోంది. గత ఏడాది నవంబరులో ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు కరీంనగర్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, ఎస్సారార్‌ కళాశాలను ఎంపిక చేసుకుంది. ఔత్సాహిక డిగ్రీ, పీజీ భౌతికశాస్త్రం విద్యార్థులు ప్రతి కళాశాల నుంచి 20 మందిని ఎంపిక చేసి.. నిపుణులతో రొబోటిక్స్‌పై ప్రయోగాత్మక శిక్షణ ఇచ్చింది. తర్ఫీదు పొందిన విద్యార్థులు జిల్లా కేంద్రం చుట్టుపక్కల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకూ నేర్పేలా తీర్చిదిద్దింది. చిన్నప్పుడే కంప్యూటర్‌  రంగంపై పట్టు సాధించేలా కృషి చేస్తోంది.

ఎంచుకున్న పాఠశాలలు ఇవే..

శిక్షణ పూర్తి చేసిన రెండు కళాశాలల విద్యార్థులు తిమ్మాపూర్‌ కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయం, చామనపల్లి, నగునూరు, సప్తగిరికాలనీ, కొత్తపల్లి, కరీంనగర్‌లోని కార్ఖానగడ్డ, సుభాష్‌నగర్‌, దన్గర్‌వాడీ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో 7, 8, 9వ తరగతి విద్యార్థులకు రొబోటిక్స్‌ ప్రాజెక్ట్‌పై శిక్షణ ఇచ్చారు. వివిధ అంశాలను విద్యార్థులకు నేర్పించటంతోపాటు ప్రయోగాత్మకంగా వారితో చేయించారు. ఒక్కో పాఠశాలకు వెళ్లే డిగ్రీ, పీజీ విద్యార్థులకు, టీఏ, డీఏతోపాటు ఒక్కో విద్యార్థికి ఒక రోజు శిక్షణకు రూ.1200 సంస్థ అందజేస్తోంది.


ఉత్సాహంగా నేర్చుకున్నా..

మా పాఠశాలలో రొబోటిక్స్‌పై నేర్పిన ప్రయోగాలను ఉత్సాహంగా నేర్చుకున్నా. నైపుణ్య మెలకువలు తెలుసుకున్నా. సొంతంగా ఆవిష్కరణ చేయడానికి ప్రయత్నిస్తున్నా. నిత్యం పుస్తకాలతో చదువు సాగించే విద్యార్థులకు ఇటువంటి సాంకేతిక విద్య తోడ్పాటునందిస్తుందని భావిస్తున్నా.

భానుప్రసాద్‌, 9వ తరగతి, జడ్పీహెచ్‌ఎస్‌ నగునూరు


ఉత్తమ అవార్డుకు ఎంపిక

అకాడమీ ఫిబ్రవరిలో రాష్ట్ర వ్యాప్తంగా 142 మంది విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో ఉత్తమ అవార్డుకు 15 మంది ఎంపికయ్యారు. కరీంనగర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుంచి నాతోపాటు మరో ఇద్దరు శ్వేత, రమ్యలు ఈ అవార్డుకు ఎంపిక కావటంతో కంప్యూటర్‌ విద్యపై ఉత్సాహం రెట్టింపు అయింది.  

హర్షిత, విద్యార్థిని, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, కరీంనగర్‌


మంచి ఆలోచన..

మా కళాశాల నుంచి 20 మంది ఔత్సాహిక విద్యార్థులను ఎంపిక చేశాం. అకాడమీ ప్రతినిధులు వారికి కళాశాల ఆవరణలో శిక్షణ ఇచ్చారు. ఆ విద్యార్థులు మా అనుమతితో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రొబోటిక్స్‌పై శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర వ్యాప్త పోటీల్లో మా కళాశాల విద్యార్థులు అవార్డుకు ఎంపిక కావడం సంతోషంగా ఉంది.

డాక్టర్‌ శ్రీలక్ష్మి, ప్రిన్సిపల్‌, ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని