logo

సామాన్యుల అవసరం.. వడ్డీ వ్యాపారుల ఇష్టారాజ్యం

అక్రమ వడ్డీ వ్యాపారుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.

Updated : 16 Apr 2024 05:39 IST

జిల్లాలో ఫైనాన్స్‌ సంస్థల నిర్వహణ తీరు

వ్యాపారి ఇంట్లో తనిఖీ చేస్తున్న పోలీసులు (పాతచిత్రం)

ఈనాడు డిజిటల్‌, సిరిసిల్ల: అక్రమ వడ్డీ వ్యాపారుల ఆట కట్టించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. సామాన్యులు, చిరు వ్యాపారులు, రైతులకు పెనుశాపంగా మారిన ఈ వ్యాపారాన్ని అరికట్టేందుకు నిఘా బృందాలు స్థానిక పోలీసుల సాయంతో ఆకస్మికంగా దాడులు జరుపుతున్నాయి. సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుని ఆభరణాలు, భూమి పత్రాలు వంటివి తనఖా పెట్టుకుని నగదు అందిస్తున్నారు. అవసరం ఎంతైనా వడ్డీ మాత్రం వారి ఇష్టం. అయిదు నుంచి పది శాతం వసూలు చేస్తూ పట్టి పీడిస్తున్నారు. జిల్లాలో ప్రధానంగా ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకు వెళ్లే వారికి వీసాలు, టికెట్‌ డబ్బులు తదితర ఖర్చుల కోసం అప్పులు ఇస్తుంటారు. దీనితోపాటు పట్టణ ప్రాంతాల్లో చిరు వ్యాపారులు, వస్త్ర పరిశ్రమలో పని చేసే వివిధ రంగాల్లోని కార్మికులు, సామాన్య ప్రజలనే వనరులుగా మలుచుకొని దందాలు నిర్వహిస్తున్నారు.

అనుమతి ఒక్కరికే...

జిల్లాలోని రెండు డివిజన్ల పరిధిలో బంగారం, ఆభరణాలు తనఖా పెట్టుకుని అప్పులు ఇచ్చేందుకు వేములవాడకు చెందిన ఒక వ్యాపారికి మాత్రమే రెవెన్యూశాఖ నుంచి అనుమతి ఉంది. పట్టణాల నుంచి గ్రామాల వరకు వందల సంఖ్యలో వడ్డీ వ్యాపారం చేసేవారు ఉన్నారు. వీరు ప్రామిసరీ నోట్లు, బ్యాంకు చెక్కులు ఖాళీవి, ఏటీఎం కార్డులను తీసుకుంటారు. ప్రామిసరీ నోట్లపై బాధితుల సంతకాలు తప్ప ఇతర ఏ వివరాలు ఉండవు. ఒకవేళ బాధితులు నిర్ణీత సమయానికి డబ్బులు చెల్లించని పక్షంలో దానిపై 5 నుంచి 10 శాతం వడ్డీ రాసుకుంటారు. దీనితోపాటు బెదిరింపులకు గురిచేస్తూ వారి స్థిరాస్తుల స్వాధీనానికి జీపీఏ, రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు.

  • వేములవాడ పట్టణంలో ఆలయ పరిసరాలు, హోటళ్లు, చిరు వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. వీరికి రోజు వారీగా అప్పులు ఇవ్వడం, వాటిపై అధిక మొత్తంలో వసూలు చేయడం జరుగుతుంది. జాతరలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చే రోజుల్లో వ్యాపారం బాగా సాగుతుంది. వీరు సామగ్రి కొనుగోలుకు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తారు. రోజు వారీ వసూళ్లు కావడంతో వ్యాపారులు అసలు, వడ్డీ కలిపి పది శాతం వరకు వసూలు చేస్తుంటారు.
  • సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమలో చిన్న మధ్య తరగతి ఆసాములు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తుంటారు. వీరు బంగారం, ఇంటి స్థలాలను తనఖా పెట్టి అప్పులు చేస్తుంటారు. వస్త్రోత్పత్తులు ఆర్డర్లు ఇచ్చినవారు సమయానికి డబ్బులు ఇస్తే పర్వాలేదు. ఆలస్యమైతే వీరికి వడ్డీల బాధుడు తప్పదు. జిల్లాలోని రెండు పోలీసు సబ్‌ డివిజన్ల పరిధిలోని గ్రామాల్లో ఉపాధి కోసం గల్ఫ్‌ వెళ్లేవారికి వీసాలు, అప్పులు ఇప్పించే దందా జోరుగా సాగుతోంది. అక్కడికి వెళ్లాక పనిలో చేరి డబ్బులు సకాలంలో చెల్లిస్తే పర్వాలేదు. లేకుంటే వడ్డీల బాధుడు తప్పదు. అక్కడ కష్టపడి సంపాదించిన సొమ్ము ఇక్కడికొచ్చాక తనఖా పెట్టిన స్థిరాస్తులు, ఆభరణాలు విడిపించుకునేందుకే సరిపోతుంది.

చర్యలు తీసుకుంటాం

అధిక వడ్డీలతో సామాన్యులను ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. వీరిపై గ్రామాల వారీగా మా నిఘా బృందాల పర్యవేక్షణ ఉంటుంది. ఇటీవల కొన్ని చోట్ల దాడులు చేశాం. సమాచారం ఉన్న దాన్ని బట్టి మరిన్ని దాడులు చేస్తాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు తీసుకుని వ్యాపారం చేసుకోవాలి.

అఖిల్‌ మహాజన్‌, ఎస్పీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని