logo

పత్తిపాక రిజర్వాయరుతో చివరి ఆయకట్టుకు భరోసా

భారాస అసమర్థ నాయకత్వంతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు.

Published : 16 Apr 2024 03:25 IST

భారాస నిర్లక్ష్యంతోనే ఎండుతున్న పంటలు: మంత్రి శ్రీధర్‌బాబు

మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఏకత చాటుతున్న ఎమ్మెల్యేలు వివేక్‌, ప్రేమ్‌సాగర్‌రావు, మక్కాన్‌సింగ్‌, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఎమ్మెల్యే విజయరమణారావు, ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్‌, మాజీ ఎమ్మెల్యే మోహన్‌, జడ్పీటీసీ సభ్యుడు లక్ష్మీనారాయణ

ఈనాడు, పెద్దపల్లి: భారాస అసమర్థ నాయకత్వంతోనే పెద్దపల్లి నియోజకవర్గంలో ఎస్సారెస్పీ చివరి ఆయకట్టుకు నీరందడం లేదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు విమర్శించారు. వచ్చే రెండేళ్లలో ధర్మారం మండలం పత్తిపాకలో నిర్మించే రిజర్వాయరుతో ఇక్కడి రైతులకు భరోసా కలుగుతుందన్నారు. పెద్దపల్లిలోని ఓ వేడుకల మందిరంలో సోమవారం నిర్వహించిన నియోజకవర్గ స్థాయి పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ మంత్రి, భారాస  ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ ఏనాడైనా జిల్లాలోని చివరి ఆయకట్టుకు కాళేశ్వరం నీటిని అందించేలా చర్యలు తీసుకున్నారా? అని ప్రశ్నించారు. వారి నిర్లక్ష్యం వల్లే పంటలు ఎండిపోయాయని, ఈ క్రమంలో మూడు నియోజకవర్గాల్లోని ఆయకట్టుకు చివరి తడి వరకు నీరందించామన్నారు. పెద్దపల్లిలో టాస్క్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేసి పట్టభద్రులకు శిక్షణ అందిస్తామని, విడతల వారీగా మిగిలిన నియోజకవర్గాల్లోనూ వీటిని అందుబాటులోకి తెస్తామన్నారు. రాజీవ్‌ రహదారిపై పెద్దపల్లి, సుల్తానాబాద్‌ పట్టణాల్లో బైపాస్‌ రహదారులకు నిధుల కేటాయింపు జరిగిందని, ఎన్నికల అనంతరం పనులు ప్రారంభిస్తామన్నారు.

వారివి దొంగ దీక్షలు

ప్రభుత్వ విప్‌, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు తమ నియోజకవర్గాలకు తరలిస్తుంటే మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ కళ్లప్పగించి చూశారని ఎద్దేవా చేశారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు మాట్లాడుతూ పంటలు ఎండిపోయాయని 36 గంటల దొంగ దీక్షలు చేసిన కొప్పుల, పుట్ట మధూకర్‌, దాసరి మనోహర్‌రెడ్డిలు ఏనాడూ చివరి ఆయకట్టుకు నీరందించలేదన్నారు. గతంలో లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లు ఇవ్వకుండా నాటి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి జాప్యం చేశారని, ఎన్నికల తర్వాత పెద్దపల్లిలో 3,500 వరకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు. ఎమ్మెల్యేలు మక్కాన్‌సింగ్‌(రామగుండం), ప్రేమ్‌సాగర్‌రావు(మంచిర్యాల) గడ్డం వివేక్‌(చెన్నూరు) మాట్లాడారు. పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ, ఐఎన్‌టీయూసీ నాయకుడు జనక్‌ప్రసాద్‌, మాజీ ఎమ్మెల్సీ వెంకట్రావ్‌, కాంగ్రెస్‌ నాయకులు, జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు పాల్గొన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు ప్రసంగం అనంతరం అప్పన్నపేటకు చెందిన రైతులు ధాన్యం కొనుగోళ్లలో కోతలు లేకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇతర పార్టీలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు, సర్పంచులు, సింగిల్‌విండో ఛైర్మన్లను కాంగ్రెస్‌లోకి తీసుకోవద్దంటూ కాల్వశ్రీరాంపూర్‌కు చెందిన సీనియర్‌ కార్యకర్త సభలో హల్‌చల్‌ చేశారు. ‘గోబ్యాక్‌’ అంటూ నినాదాలు చేయగా మిగిలిన కార్యకర్తలు సముదాయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని