logo

సరిహద్దులు దాటుతున్న రేషన్‌ బియ్యం

ఉమ్మడి జిల్లాలో కొంత కాలంగా సద్దుమనిగిన రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మళ్లీ సాగుతోంది.

Published : 16 Apr 2024 03:26 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

మంథనిలో పట్టుకున్న రేషన్‌ బియ్యం(పాతచిత్రం)

  • ఈనెల 10న మంథని పట్టణంలో 28 క్వింటాళ్ల రేషన్‌ బియ్యాన్ని వ్యాన్‌లో తరలిస్తుండగా పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తాజాగా ఆదివారం సైతం మంథని పట్టణంలోని ఆర్టీసీ డిపో సమీపంలో రేషన్‌ బియ్యం తరలిస్తున్న వ్యాన్‌ను పట్టుకున్నారు. 25 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
  • పరకాల నుంచి గుజరాత్‌కు తరలించేందుకు రవాణా చేస్తున్న రేషన్‌ బియాన్ని ఇటీవల హుజూరాబాద్‌ శివారులో పోలీసులు తనిఖీ చేసి పట్టుకున్నారు. లారీని పౌరసరఫరాల అధికారులకు అప్పగించారు. భారీ మొత్తంలో ఒక రైస్‌మిల్లు నుంచి బియ్యాన్ని లోడ్‌చేసి లారీలో గుజరాత్‌కు తరలిస్తున్నట్లు గుర్తించారు.

ఉమ్మడి జిల్లాలో కొంత కాలంగా సద్దుమనిగిన రేషన్‌ బియ్యం అక్రమ రవాణా మళ్లీ సాగుతోంది. పేద ప్రజల కోసం ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యాన్ని సేకరిస్తున్న కొంత మంది మహారాష్ట్ర, గుజరాత్‌లోని పలు ప్రాంతాలకు తరలించి భారీ మొత్తంలో అక్రమంగా సంపాదిస్తున్నారు. రేషన్‌ దుకాణాల నుంచి కొంత మంది సేకరిస్తుండగా మరి కొంత మంది లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి ఎక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మహారాష్ట్రలో బియ్యానికి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో అక్కడికి రవాణా చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 413 రేషన్‌ దుకాణాల ద్వారా నెలకు 3,500 క్వింటాళ్ల బియ్యాన్ని లబ్ధిదారులకు సరఫరా చేస్తున్నారు. 2,21,956 రేషన్‌ కార్డులు ఉండగా 6,40,250 మంది లబ్ధిదారులున్నారు. ఉమ్మడి జిల్లాలో సరఫరా చేస్తున్న రేషన్‌ బియ్యంలో కొద్ది మంది లబ్ధిదారులు మాత్రమే వాటిని తీసుకుంటుండగా మిగతా చాలామంది బయటి వ్యక్తులకు విక్రయిస్తున్నారు. కొన్ని రేషన్‌ దుకాణాల్లో డీలర్లే ఎంతోకొంత ఇచ్చి లబ్ధిదారుల నుంచి సేకరించి బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఇది చాలాకాలంగా సాగుతున్న దందా. ఇటీవల కొంత కాలంగా సద్దుమణిగినా మళ్లీ మొదలైంది.

మండలాల వారీగా సేకరణ

రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా చేసేందుకు మండలానికి కొంత మందిని దళారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో సేకరించిన బియ్యాన్ని భారీ మొత్తంలో విక్రయించే మరో దళారికి అందజేస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లో కిలోకు రూ.8 చొప్పున కొనుగోలు చేస్తున్నవారు బడా వ్యాపారికి రూ.10కి విక్రయిస్తున్నారు. వీటిని లారీల్లో లోడ్‌ చేసి ఇతర రాష్ట్రాలకు రవాణా చేసే అక్రమ వ్యాపారి అక్కడ రూ.15 నుంచి రూ.18 వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాలో సేకరించిన బియ్యాన్ని మంచిర్యాల కేంద్రంగా పలువురు ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.

పెరిగిన పోటీ

ఇటీవల రేషన్‌ బియ్యం అక్రమ దందా చేసే వారిలో పోటీ పెరగడంతో ఒకరిపై ఒకరు పోలీసులకు సమచారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి కాలంలో ఎక్కువ శాతం రేషన్‌ బియ్యం పట్టుబడుతుండటం వెనుక అక్రమ వ్యాపారుల మధ్య నెలకొన్న పోటీ కారణమై ఉంటుందని పలువురు భావిస్తున్నారు. గతంలో కొంతమంది మాత్రమే దందా చేయగా ఆర్జన అధికంగా ఉండటంతో చాలామంది రేషన్‌బియ్యం అక్రమ రవాణాకు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారం పెరగడం.. తమకు రావాల్సిన బియ్యం మరో వ్యాపారి వద్దకు వెళ్తుండటంతో కొందరు పోలీసులకు సమాచారం ఇస్తున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఎక్కువగా రేషన్‌ బియ్యం పట్టుబడుతోంది.  

ఇతర రాష్ట్రాలకు...

ఉమ్మడి జిల్లా నుంచి ఎక్కువ శాతం మహారాష్ట్రకు రోడ్డు మార్గంతో పాటు రైలు మార్గంలో రేషన్‌ బియ్యాన్ని తరలిస్తూ పలువురు అక్రమ దందా సాగిస్తున్నారు. పెద్దపల్లి, రామగుండం, జమ్మికుంట రైల్వేస్టేషన్లకు బస్తాలను చేర్చి గుట్టుచప్పుడు కాకుండా రైలులో వేసి తరలిస్తున్నారు. సీట్ల కింద బస్తాలను వేసి తమ గమ్యస్థానం రాగానే వాటిని కిందకు దించుతున్నారు. ఎవరైనా పట్టుకుంటే తమకు సంబంధం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రోడ్డు మార్గంలో అయితే వాహనాల ద్వారా రవాణా చేస్తూ చెక్‌పోస్టుల వద్ద సిబ్బందికి మామూళ్లు ముట్టచెబుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని