logo

రవాణా శాఖ కార్యాలయంలో సేవలకు అంతరాయం

జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సేవలు స్తంభించిపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Updated : 16 Apr 2024 06:36 IST

సమన్వయ లోపం.. వాహనదారులకు శాపం

కౌంటర్ల వద్ద బారులు దీరిన వాహనదారులు

న్యూస్‌టుడే, కరీంనగర్‌ రవాణా విభాగం: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో సేవలు స్తంభించిపోవడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక వైపు భానుడు నిప్పులు చెరుగుతుండగా, మరో వైపు గంటల తరబడి వరుసలో నిల్చోవలసి వచ్చింది. కొందరు ఎండను తాళలేక చెట్ల నీడను ఆశ్రయించారు. తిమ్మాపూర్‌లో పరిధిలో విద్యుత్తు శాఖ అధికారులు చెట్ల కొమ్మలు తొలగించడంతో ఇంటర్నెట్‌ తీగలు తెగిపోయాయి. ఆర్టీఏ కార్యాలయంలో మధ్యాహ్నం వరకు అంతర్జాల సేవలు నిలిచిపోయాయి. వరుస సెలవులు రావడంతో సోమవారం ఆర్టీఏ కార్యాలయానికి వాహనదారులు అధిక మొత్తంలో వచ్చారు. స్లాట్‌ బుక్‌ చేసుకొని వచ్చిన వారు ఇబ్బందులుపడ్డారు.

ఎండలోనే గంటలకొద్దీ..

ఒకవైపు ఇంటర్నెట్‌ సేవలు నిలిచిపోవడంతో డ్రైవింగ్‌ పరీక్ష, వాహనాల రిజిస్ట్రేషన్‌, పిట్‌నెస్‌ పరీక్షల కోసం వచ్చిన వాహనదారులు తాత్కాలిక ట్రాక్‌ ప్రాంతంలో ఎండలో గంటల కొద్ది వేచి చూశారు. గతంలో డీఎల్‌ పరీక్షకు వచ్చే అభ్యర్థులు నేరుగా ట్రాక్‌ వద్దకు వెళ్లి సంబంధిత అధికారికి స్లాట్‌ బుక్‌ చేసిన పత్రాలు ఇచ్చి డ్రైవింగ్‌ చేసేవారు. అలా కాకుండా దస్త్రంపై కౌంటర్‌ నంబర్‌ వేయించుకొని వస్తేనే డ్రైవింగ్‌ చేయాలని సిబ్బంది చెప్పడంతో ఇబ్బందులు పెరిగాయి. కౌంటర్ల వద్ద క్యూలైన్లు నిండిపోవడంతో గంటల కొద్దీ నిలబడాల్సిన పరిస్థితి. అంతర్జాల సేవలు నిలిచిపోవడంతో ఉన్నతాధికారులతో మాట్లాడిన అధికారులు.. దస్త్రంపై నంబరు వేసే సమయాన్ని పొడిగించారు.

మంత్రి పొన్నం ఆరా..

అంతర్జాల సేవలకు అంతరాయం కల్గిన విషయాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆ శాఖ కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. వెంటనే సేవలు పునరుద్ధరించడానికి కావాల్సిన చర్యలు చేపట్టడంతోపాటు వాహనదారులకు ఇబ్బంది కల్గకుండా చూడాలని ఆదేశించారు. డీటీసీ పెద్దింటి పురుషోత్తం కూడా సంబంధిత విద్యుత్తు శాఖ అధికారులతో మాట్లాడి చెట్ల కొమ్మలు తొలగించిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. ఇంటర్నెట్‌ సౌకర్యం త్వరగా అందుబాటులోకి తెచ్చేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు.

సిబ్బంది ఇబ్బంది..

ఆర్సీ, డీఎల్‌ ప్రింట్‌ తీయడం, ఇతర సేవలకు ఏర్పాటు చేసిన కంప్యూటర్‌ గదిలోకి కొందరు ఏజెంట్లతోపాటు ఎవరు పడితే వారు ఇష్టారాజ్యంగా వస్తుండటంతో సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కౌంటర్ల వద్ద నివృత్తి చేసుకోవాల్సిన అనుమానాలను కూడా పలువురు కంప్యూటర్‌ గదిలోకి వచ్చి అడుగుతుండటంతో ఇబ్బందికర పరిస్థితి నెలకొందని సిబ్బంది వాపోతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని