logo

ఆలస్యం.. ఆ అభ్యర్థులకు ఉపశమనం

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు ఊరట లభించనుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈలోగా ముగిసిపోనుంది.

Published : 17 Apr 2024 05:34 IST

జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలకు అవకాశం
అప్పటికి అనర్హత గడువు పూర్తి కానుండటంతో ఆశావహులకు ఊరట
న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌

స్థానిక సంస్థల ఎన్నికల్లో అనర్హత వేటుకు గురైన అభ్యర్థులకు ఊరట లభించనుంది. లోక్‌సభ ఎన్నికల కారణంగా పంచాయతీ, మండల, జిల్లా పరిషత్‌ ఎన్నికలు ఆలస్యం కానున్నాయి. ఎన్నికల్లో పాల్గొనకుండా విధించిన నిషేధ కాలపరిమితి ఈలోగా ముగిసిపోనుంది. వీరికి పోటీ చేసే అవకాశం రానుంది. పంచాయతీ పాలక వర్గాల పదవీ కాలం ఫిబ్రవరి 1న ముగిసింది. అప్పటి నుంచి పల్లెల్లో ప్రత్యేక పాలన కొనసాగుతోంది. జూన్‌ 3న ఎంపీటీసీ, జులై 4న జడ్పీటీసీల పదవీ ముగియనుంది. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి జూన్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించడంతో అనర్హత వేటు పడిన అభ్యర్థులకు ఆంక్షలు తొలగిపోనున్నాయి.

లెక్కలు చూపకుంటే తిప్పలే

ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రతి పైసాకు లెక్క చూపాల్సిందే. నూతన పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం 2019 జనవరిలో సర్పంచులు, వార్డు సభ్యులు, మేలో ఎంపీటీసీ, జడ్పీటీసీలు ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన 45 రోజుల్లోగా అభ్యర్థులు ఖర్చుల వివరాలను అధికారులకు నివేదించాలి. ఉమ్మడి జిల్లాలో 1,212 పంచాయతీల్లో సర్పంచులు, 12,045 మంది వార్డు సభ్యులు, 52 మంది జడ్పీటీసీలు, 646 మంది ఎంపీటీసీలు ఎన్నికయ్యారు. ఎన్నికల్లో ప్రచారానికి ఎంత ఖర్చు చేశారో నిర్దేశిత నమూనాలో ఎంపీడీవోలు అభ్యర్థుల ఖర్చులను లెక్కించి నివేదించారు. ఖర్చుల నివేదికపై అవగాహన లేకపోవడం, మరోసారి పోటీ చేయబోమనే భావన, ఇతరత్రా కారణాలతో చాలా మంది లెక్కలు చూపలేదు. దీంతో 2021లో ఉమ్మడి జిల్లాలో 5,055 మంది అభ్యర్థులపై వేటు వేశారు. ఇందులో సర్పంచి స్థానానికి 410, వార్డు సభ్యులకు 4,228, జడ్పీటీసీ 30, ఎంపీటీసీ స్థానంలో పోటీ చేసిన 387 మంది అనర్హులుగా ప్రకటించారు.

ఆంక్షలు తొలిగె.. ఆశలు చిగురించే

ఎన్నికల్లో అనర్హత వేటు పడ్డ అభ్యర్థులకు మళ్లీ పోటీ చేసే ఆశలు చిగురిస్తున్నాయి. నోటీసులు జారీ చేసిన నాటి నుంచి మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేయరాదు. సర్పంచి, వార్డు సభ్యులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు మే నెలాఖరు వరకు నిషేధం ఉంది. ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు సాధ్యంకాదు. షెడ్యూల్‌ ప్రకారం సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల పదవీ కాలం ముగియడానికి ముందే ఎన్నికలు నిర్వహిస్తే చాలా మంది పోటీ చేసే అవకాశం కోల్పోయేవారు. జూన్‌లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వ ప్రకటన అనర్హత వేటు పడిన అభ్యర్థులకు మరోసారి అదృష్టం కలిసిరానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని