logo

అమాత్యులుగా ఆ నలుగురు

ఉమ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది.

Updated : 23 Apr 2024 05:54 IST

కేసీఆర్‌ , విద్యాసాగర్‌రావు

మ్మడి జిల్లాలోని కరీంనగర్‌, పెద్దపల్లి లోక్‌సభా నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎంపీల్లో ఇప్పటివరకు నలుగురికి మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కింది. కరీంనగర్‌ నుంచి 1952, 1957లలో ఎంపీగా ఎన్నికైన ఎం.ఆర్‌.కృష్ణ పెద్దపల్లి స్థానానికి కూడా 1962-67లో ప్రాతినిధ్యం వహించారు. ఆ సమయంలో కేంద్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో రక్షణ, పారిశ్రామికాభివృద్ధి శాఖల మంత్రిగా పని చేశారు. ఇక పెద్దపల్లి నుంచి 1989, 1991, 1996, 2004లలో ఎన్నికైన జి.వెంకటస్వామి కేంద్రంలో కార్మిక, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రిగా సేవలందించారు. భాజపా నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు కరీంనగర్‌ లోక్‌సభ స్థానం నుంచి 1998, 1999లలో ఎన్నికయ్యారు. వాజ్‌పేయీ ప్రభుత్వంలో ఆయన హోం శాఖ సహాయ మంత్రిగా సేవలందించారు. అప్పటివరకు శాసనసభ్యుడిగా ఉన్న తెరాస(ప్రస్తుత భారాస) అధినేత 2004లో కాంగ్రెస్‌తో జత కట్టి కరీంనగర్‌ ఎంపీగా గెలిచారు. మన్మోహన్‌సింగ్‌ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఇక జిల్లాకు చెందిన పీవీ నరసింహారావు కేంద్ర మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాలు, మానవ వనరులు, హోం, రక్షణ మంత్రిత్వ శాఖల బాధ్యతలతో పాటు ప్రధానిగా సేవలందించారు. అయితే ఆయన ఉమ్మడి జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల నుంచి లోక్‌సభకు ఎన్నికవడం గమనార్హం.

ఎం.ఆర్‌.కృష్ణ

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం


జగిత్యాల జిల్లా నుంచి ముగ్గురికి అవకాశం

బాల్క సుమన్‌  , ఎల్‌.రమణ

1952 నుంచి ఇప్పటివరకు జరిగిన 17 విడతల లోక్‌సభ ఎన్నికల్లో జగిత్యాల జిల్లాకు చెందిన ముగ్గురు గెలుపొందారు. జగిత్యాల మండలం అంతర్గాంకు చెందిన ఎం.శ్రీరంగారావు 1957లో కరీంనగర్‌ నుంచి, జిల్లాకేంద్రానికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ ఎల్‌.రమణ 1996లో కరీంనగర్‌ నుంచి, మెట్పల్లికి చెందిన బాల్క సుమన్‌ 2014లో పెద్దపల్లి నుంచి ఎన్నికయ్యారు. జగిత్యాల, కోరుట్ల(మెట్పల్లి) శాసనసభ నియోజకవర్గాలు గతంలో కరీంనగర్‌ లోక్‌సభా స్థానం పరిధిలో ఉండగా 2004లో నియోజకవర్గాల పునర్విభజనలో నిజామాబాద్‌ పరిధిలోకి వెళ్లాయి. జిల్లాలోని ధర్మపురి(గతంలో బుగ్గారం) సెగ్మెంటు పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఉండగా పలు మండలాలు చొప్పదండి, వేములవాడ సెగ్మెంట్లలో, కరీంనగర్‌ లోక్‌సభా స్థానం పరిధిలో ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన సీహెచ్‌ విద్యాసాగర్‌రావు మెట్పల్లి నుంచి శాసనసభకు, కరీంనగర్‌ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. జగిత్యాల(పెగడపల్లి మండలం బతికెపల్లి స్వస్థలం)కి చెందిన ప్రస్తుత ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి గతంలో కరీంనగర్‌ లోక్‌సభా స్థానం నుంచి రెండు సార్లు పోటీ పడగా, ప్రస్తుతం నిజామాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచారు.

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు