logo

హామీలను విస్మరించిన ప్రభుత్వం

శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్‌ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు.

Published : 23 Apr 2024 02:13 IST

కరీంనగర్‌ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌

మల్యాలలో మాట్లాడుతున్న వినోద్‌కుమార్‌ చిత్రంలో మాజీ మంత్రి గంగుల

మల్యాల, న్యూస్‌టుడే: శాసనసభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించిందని కరీంనగర్‌ భారాస అభ్యర్థి వినోద్‌కుమార్‌ అన్నారు. సోమవారం రాత్రి మల్యాల మండల కేంద్రంలోని అంగడి బజారులో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి ధైర్యంగా ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఓటమిచెంది ఉండకపోతే కేంద్రంతో కొట్లాడి జిల్లాకు ట్రిపుల్‌ ఐటీ కళాశాల, యువతకు నైపుణ్య కేంద్రాలను మంజూరు చేయించేవాడినని వివరించారు. జగిత్యాల, కరీంనగర్‌, వరంగల్‌ జాతీయ రహదారి విస్తరణ పనులను తాను ఎంపీగా ఉన్నప్పుడే మంజూరు చేయించి, ప్రజలను భూసేకరణకు కూడా ఒప్పించానన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడే కొండగట్టు అంజన్న ఆలయానికి 333 ఎకరాల స్థలాన్ని అప్పగించినట్లు గుర్తు చేశారు. బండి సంజయ్‌ కరీంనగర్‌ జిల్లాకు చేసిందేమీలేదని, బడి, గుడి కూడా తేలేదన్నారు. కేసీఆర్‌ మరోసారి ముఖ్యమంత్రి అయితే మేడిగడ్డవద్ద కాఫర్‌ డ్యాం నిర్మించి వరద కాలువకు సాగునీటిని విడుదల చేసి ఉండేవారని తెలిపారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ వినోద్‌కుమార్‌ను ఎంపీగా గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తారని వివరించారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్‌, నరేందర్‌రెడ్డి, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని