logo

పిల్లల అల్లరిని దారి మళ్లించండి

పది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు.

Updated : 23 Apr 2024 05:48 IST

వినోదం, విజ్ఞానంతో మానసిక వికాసం
రేపటి నుంచి వేసవి సెలవులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ సాంస్కృతికం

ది నెలలపాటు చదువుతో కుస్తీ పడిన పిల్లలకు వేసవి సెలవులు ఉపశమనం ఇస్తాయి. ఆటాపాటలతో సరదాగా గడపొచ్చని భావిస్తుంటారు. అయితే సెలవుల్లో పిల్లల అల్లరిని భరించలేక చాలామంది తల్లిదండ్రులు తలలు పట్టుకుంటారు. ఈ సమయంలో వినోదంతోపాటు విజ్ఞానాన్ని అందిస్తే వారిలో మానసిక వికాసం వృద్ధి చెందుతుంది. పది మందిలో ఎలా ఉండాలి? బంధువులు, కుటుంబ సభ్యులతో ఎలా వ్యవహరించాలో తల్లిదండ్రులు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది. కొందరు అమ్మమ్మ, నానమ్మల ఊళ్లకు పంపుతుంటారు. అక్కడ కొత్త విషయాలు నేర్చుకుంటారు. మరికొందరు అదనపు నైపుణ్యాల పెంపునకు శిక్షణ శిబిరాలకు పంపిస్తుంటారు. ఇవన్నీ వారి ఉన్నతికి దోహదపడేవే. ఇటీవల ఓ పాఠశాల యాజమాన్యం వేసవి సెలవుల్లో పిల్లలపట్ల తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విడుదల చేసిన లేఖ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సెలవుల్లో ఎలా గడపాలో పిల్లలకు సూచనలు చేయాలని ఆయా పాఠశాలలకు మార్గదర్శకాలను విడుదల చేసింది. బుధవారం నుంచి పాఠశాలలకు సెలవుల నేపథ్యంలో పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకు చేసిన సూచనలు

  • ఆరు బయట ఉదయం, సాయంత్రం మాత్రమే ఆడుకోవాలి. ఎండల్లో ఆడొద్దు.
  • చెరువులు, కుంటలు, బావులు, నదుల్లోకి ఈతకు వెళ్లకూడదు. పెద్దల పర్యవేక్షణలో నేర్చుకోవాలి
  • మంచినీరు తగినంత తాగాలి. నిమ్మరసం, కొబ్బరి నీళ్లు వంటి ద్రవపదార్థాలు తీసుకోవాలి.
  • ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారాన్ని మాత్రమే తినాలి.
  • శరీరానికి గాలి తగిలేలా కాటన్‌ దుస్తులు ధరించాలి.
  • బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ ధరించాలి. మంచినీళ్ల సీసాను వెంట తీసుకెళ్లాలి.
  • వీలైనన్ని కథలు, జీవిత చరిత్రల పుస్తకాలు చదవాలి.
  • బొమ్మలు, పెయింటింగ్‌ నేర్చుకోవాలి.
  • మీ అభిరుచి మేరకు అందుబాటులో ఉన్న వస్తువులతో క్రాఫ్ట్‌ వర్క్‌ చేయండి.

సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న పాఠశాల యాజమాన్యం లేఖ

  • గత పది నెలలుగా మీ పిల్లలను సంరక్షించాం. ఈ రెండు నెలలు మీతో గడుపుతారు. ఈ సమయం వారికి ఉపయోగకరంగా, సంతోషంగా ఉండేలా మేము మీకు కొన్ని చిట్కాలను అందిస్తున్నాం.
  • మీ పిల్లలతో కలిసి భోజనం చేయండి. రైతుల కష్టం వివరించి.. ఆహారాన్ని వృథా చేయనీయకండి.
  • వారు భోజనం తిన్న ప్లేట్లను వారినే శుభ్రం చేయమనండి. దుస్తులు సర్దడం లాంటి చిన్న చిన్న పనులు చెప్పండి.
  • వంట, తదితర పనుల్లో పిల్లల సహాయం కోరండి.
  • ఇరుగు పొరుగువారి ఇళ్లకు తీసుకెళ్లండి. వారిని పరిచయం చేయండి.
  • సెలవుల్లో అమ్మమ్మ, నాన్నమ్మల ఇంటికి పంపండి. అక్కడే వారితో కొన్ని రోజులు గడపనివ్వండి.
  • వీలైతే పిల్లలను పని ప్రదేశాలకు తీసుకెళ్లాలి. తద్వారా కుటుంబ పెద్దలు పడే కష్టం వారికి అర్థమవుతుంది.
  • వారితో మొక్కల నాటించి సంరక్షణ బాధ్యతలు అప్పగించాలి.
  • మీ బాల్యంలోని జ్ఞాపకాలను వారితో పంచుకోవాలి. కుటుంబ చరిత్ర తెలియజేయాలి.
  • ఇతర పిల్లలతో కలిసి బయట ఆడుకోనివ్వాలి.
  • రంగురంగు చిత్రాలతో కూడిన కథల పుస్తకాలు చిన్నారులకు బహుమతులుగా ఇవ్వాలి.
  • పిల్లలను టీవీ, మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు తదితర వాటికి దూరంగా ఉంచాలి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని