logo

కమలం శ్రేణుల్లో కదనోత్సహం

ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. పట్టణ శివారు బాలానగర్‌లో ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన జనసభకు జనం భారీగా హాజరయ్యారు.

Published : 09 May 2024 05:25 IST

మోదీ వేములవాడ సభకు భారీ స్పందన

సిరిసిల్ల (ఈనాడు డిజిటల్‌), వేములవాడ, వేములవాడ గ్రామీణం (న్యూస్‌టుడే) : ప్రధాని నరేంద్ర మోదీ వేములవాడ సభ భాజపా శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.. పట్టణ శివారు బాలానగర్‌లో ఆదిలాబాద్‌, పెద్దపల్లి, కరీంనగర్‌ లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏర్పాటు చేసిన జనసభకు జనం భారీగా హాజరయ్యారు. ప్రధాని రాకకు గంట ముందే సభా ప్రాంగణం నిండిపోగా వందలాది మంది రోడ్లపైనే ఉండిపోయారు. వారందరినీ సభా ప్రాంగణంలోని ఖాళీ స్థలంలోకి అనుమతించాలని సభాధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పోలీసులను కోరాల్సి వచ్చింది.  ప్రధాని మొదట తెలుగులో ‘నా తెలంగాణ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు’ అన్నారు.. తరువాత ‘దక్షిణ కాశీ భగవానుడు రాజరాజేశ్వరస్వామికి ప్రణామాలు’ అంటూ తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చానని ప్రసంగం ప్రారంభించారు.

తాను మూడుసార్లు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా చేశానని, గుజరాత్‌తో తనకు ఉన్న అనుబంధం తెలిసిందేనని అక్కడ ఎన్నో ఎన్నికలు చూశానని.. కానీ ఇంత పెద్ద ఎత్తున జనం తరలిరావడం ఎన్నడూ చూడలేదన్నారు. మీరందరూ తనపై చూపుతున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు అన్నారు. ఈ జనసందోహాన్ని చూస్తే బండి సంజయ్‌ విజయం ఖాయమైందని కితాబిచ్చారు. మోదీ మాటలతో జనం కేరింతలు కొట్టారు. ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌ ప్రసంగంలో కాంగ్రెస్‌, భారాసలు కేంద్ర ప్రభుత్వంతోపాటు భాజపాపై చేస్తున్న విమర్శలను తిప్పిగొట్టారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, కరీంనగర్‌, సిద్దిపేట, జగిత్యాల జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మోహన్‌రెడ్డి, సత్యనారాయణ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ, నాయకులుచెన్నమనేని వికాస్‌రావు, రాణి రుద్రమ,  గండ్ర నళిని, ఎర్రం మహేష్‌, అల్లాడి రమేష్‌, రేగుల మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు.


పర్యటన సాగిందిలా..

  • ఉదయం 9:30 గంటలకు ప్రధాని మోదీ హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో వేములవాడ గుడి చెరువులో ఏర్పాటు చేసిన ప్రత్యేక హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడ హుజూరాబాద్‌, జమ్మికుంటలకు చెందిన భాజపా నాయకులు ఆయనకు స్వాగతం పలికారు.
  • హెలిప్యాడ్‌ నుంచి 9:45 గంటలకు ప్రత్యేక వాహనంలో ఆలయ ఈవో కార్యాలయానికి చేరుకున్నారు. ఉత్తర ద్వారం నుంచి రాజన్న ప్రధాన ఆలయంలోకి వెళ్లారు. తొలుత కోడెకు ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత ఆలయంలోని గణపతి, రాజేశ్వరి అమ్మవార్లకు పూజలు చేసి, రాజన్నను దర్శించుకున్నారు. ఆలయ పూజారి స్వామివారి హారతి ఇచ్చారు. అక్కడే స్వామి వారి ఆశీర్వచనం అందించి, శేష వస్త్రం, ప్రసాదం అందించారు.
  • 9:55 గంటలకు ఆలయంలో పూజా కార్యక్రమాలు ముగించుకుని ప్రత్యేక వాహన శ్రేణిలో బాలానగర్‌లోని సభా ప్రాంగణానికి బయలుదేరారు.
  • 10:09 గంటలకు సభా స్థలికి చేరుకుని వేదికపై కలియదిరుగుతూ ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో జనం ‘మోదీ.. మోదీ’ అంటూ నినాదాలు చేశారు.
  • 10:24 గంటలకు మోదీ ప్రసంగం ప్రారంభించి 11.06 గంటలకు ముగించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ మోదీ ప్రసంగాన్ని తెలుగులోకి అనువదించారు.

సైడ్‌లైట్స్‌

  • సభా ప్రాంగణంలో జనం ఇబ్బంది పడకుండా వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వారు జనానికి తాగునీరు అందించారు.
  • సభా ప్రాంగణం బయట ఉన్నవారు అక్కడ ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ తెరలపై మోదీ ప్రసంగాన్ని తిలకించారు.
  • సభలో పలుమార్లు జనం ‘భారత్‌ మాతాకీ జై’ ‘జై శ్రీరాం’ నినాదాలు చేశారు.
  • సంజయ్‌ తన ప్రసంగంలో మా నరేంద్ర మోదీ ఆరు అడుగుల బుల్లెట్టు అనగానే ప్రజలు కేరింతలు కొట్టారు.

మోదీ నాయకత్వంలో అభివృద్ధి

- గోమాసె శ్రీనివాస్‌, భాజపా పెద్దపల్లి అభ్యర్థి

నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. దేశం కోసం, ధర్మం కోసం, ప్రగతి కోసం నరేంద్రమోదీ కృషి చేస్తున్నారు. నరేంద్రమోదీ ఆలోచన విధానం దేశానికి చాలా అవసరం. భాజపా అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో ఎన్నుకుని మరోసారి నరేంద్రమోదీని ప్రధాని చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని